America: అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల ఒకవైపు భారతీయులు మరణాలు పెరుగుతున్నాయి.. ఇంకోవైపు అక్కడి హిందూ ఆలయాలపై దాడులు కూడా పెరుగుతున్నాయి. దీంతో అటు ఎన్‌ఆర్‌ఐలతోపాటు ఇటు భారతీయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. భారత విదేశాంగ శాఖ కూడా ఈ విషయాన్ని అమెరికా దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అమెరికా కాంగ్రెస్ స్పందించింది. హిందూ ఆలయాలపై వరుస దాడులపై వివరణ ఇవ్వాలని ఐదుగురు యూఎస్ కాంగ్రెస్ సభ్యులు అమెరికా న్యాయ శాఖకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ప్రార్ధన స్థలాల వద్ద విధ్వంసకర చర్యల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ప్రమీలా జయపాల్, రోఖన్నా, రాజా కృష్ణమూర్తి, శ్రీతానేదార్, అమీ బేరాలు రాశారు.
అమెరికన్ల ఆవేదన..
హిందూ ఆలయాలపై దాడలతో అమెరికాలోని హిందువులు ఆందోళన చెందుతున్నారు. న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా వరకు పలు మందిరాలపై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో విచారణ ఏ స్థితిలో ఉందో తెలియజేయాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఆలయాలపై దాడులకు పాల్పడుతున్న అనుమానితులకు సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. వరుస దాడులతో చాలామంది హిందువులు భయం భయంగా జీవనం సాగిస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం అందరికీ సమాన రక్షణను కల్పించడానికి తగిన ఫెడరల్ పర్యవేక్షణ ఉందా? అని వారు ఆ లేఖలో ప్రశ్నించారు.
ఖలిస్తాన్ అనుకూల నినాదాలు..
ఇదిలా ఉండగా జనవరిలో కాలిఫోర్నియాలోని హేవార్డ్‌లోని ఒక ఆలయంపై దాడులు చేసిన దుండగులు ఖలిస్తా అనుకూల నినాదాలు చేశారు. ఇలాంటి ఉదంతమే నెవార్క్‌లోని మరో దేవాలయంలో కూడా జరిగింది. అమెరికాలోని హిందువులనే లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ దాడుల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నించారు. దీనిపై సంబంధిత విభాగం ఏప్రిల్ 4వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ఆ లేఖలో కోరారు.