America: అమెరికాలో భారతీయుల మరణాలు కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు హత్యలు, అనుమానాస్పద మరణాలు జరిగాయి. తర్వాత పోలీస్ వాహనం ఢీకొని ఓ యువతి దుర్మరణం చెందింది. ఇక తాజాగా ఏప్రిల్ 1న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రాకు చెందిన గీతాంజలి(32) ఆమె కూతురు హానిక మరణించింది. భర్త కొడుకు గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే మరో యాక్సిడెంట్ తెలుగు విద్యార్థిని బలి తీసుకుంది.
చదువు కోసం వెళ్లి..
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లల జిల్లా పర్చూరు మండలం బోడవాడకు చెందిన ఆచంట రేవంత్(22) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బీటెక్ పూర్తి చేసిన రేవంత్ ఎంఎస్ చదివేందుకు గతేడాది డిసెంబర్‌లో అమెరికా వెళ్లాడు. మాడిసన్ ప్రాంతంలోని డకోట స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. భారత కాలమాన ప్రకారం మంగళవారం(ఏప్రిల్ 2న) తెల్లవారుజామున ముగ్గురు స్నేహితులతో కలసి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు కారులో వెళ్లాడు.
కారు అదుపుతప్పి..
పొగమంచు, వాతావరణంలో మార్పు కారణంగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులతోపాటు రేవంత్ గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రేవంత్ మృతిచెందాడు. ఈమేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో బోడవాడలో విషాదం అలుముకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.