US IT Layoffs: ఇన్నాళ్లపాటు పనిచేయించుకున్నాయి. పని గంటలను పెంచి మరీ పని చేయించుకున్నాయి. ఇప్పుడు మెడ పట్టుకొని బయటికి గెంటి వేస్తున్నాయి. పని చేయించుకున్న సంస్థలు.. పనిలేదని దారుణంగా వ్యవహరిస్తున్నాయి. ముందస్తు హెచ్చరిక లేకుండా.. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా.. దయచేసి మీరు వెళ్ళండి అంటూ నిర్దయగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లపాటు పనిచేసిన ఉద్యోగులు కన్నీళ్ల పర్యంతమవుతూ సంస్థలను వదిలి వెళ్తున్నారు.
కొంతకాలంగా అమెరికన్ ఐటీ కంపెనీలు ఉద్యోగుల మీద ఎటువంటి దయ చూపించడం లేదు. పైగా దారుణంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. గడిచిన ఐదు సంవత్సరాలుగా లక్షల మంది ఉద్యోగాలను తొలగించాయి కంపెనీలు. అది సరిపోదు అన్నట్టు తాజాగా 4,000 మంది ఉద్యోగులను తొలగించాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అమెరికన్ ఐటీ కంపెనీల మీద ఐటి ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి.. మొత్తంగా ఉద్యోగులు లేకుండా పనిచేసే విధంగా అమెరికన్ కంపెనీలు వ్యవహరిస్తున్నాయని ఐటి ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా కేంద్రంగా పనిచేసే ప్రముఖ నెట్వర్కింగ్ సంస్థ సిస్కో మరోసారి ఉద్యోగుల కోతలను మొదలుపెట్టింది. ఈ త్రైమాసికల్లో ఏకంగా 4000 మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇది ఆ కంపెనీ మొత్తం సిబ్బందిలో ఐదు శాతం కంటే తక్కువ. దీర్ఘకాలంలో వృద్ధిని సాధించాలని.. అనేక రంగాలపై పెట్టుబడులు పెట్టాలని ఆ కంపెనీ భావిస్తోంది. అందువల్లే ఉద్యోగుల మెడ మీద కత్తి పెట్టింది. ఈ కంపెనీకి మూడవ త్రైమాసికంలో 12 శాతం వృద్ధి లభించింది. అంతేకాదు 15.8 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరింది. అయినప్పటికీ ఈ కంపెనీ ఉద్యోగుల విషయంలో కోతలను కొనసాగిస్తూనే ఉంది.
సిస్కో వ్యవహారం ఇలా ఉంటే.. మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలో పనిచేసే లింక్డ్ ఇన్ కూడా వందల సంఖ్యలో ఉద్యోగులను బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది. మొత్తంగా కంపెనీ ఉద్యోగుల్లో ఐదు శాతం మందిని బయటికి పంపించాలని ప్లాన్ రూపొందించింది. ఈ లెక్కన 875 మంది ఉద్యోగులు తమ కొలువులను కోల్పోతున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని.. సంస్థ గతంగా బలోపేతం అవ్వడానికి ఈ మార్పులు చేస్తున్నట్టు లింక్డ్ ఇన్ ప్రకటించింది. మరోవైపు వాల్ మార్ట్ కూడా 1000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం కనిపిస్తోంది.
ఒకవేళ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవడానికి ఇష్టపడకపోతే.. వారిని వేరే విభాగాలకు బదిలీ చేసే అవకాశం ఉంది. అమెరికాలో పరిస్థితులో ఏమాత్రం బాగోలేకపోవడం.. భవిష్యత్తు లక్ష్యాలను దృఢంగా నిర్ణయించుకోవడం.. మ్యాన్ పవర్ ను సాధ్యమైనంతవరకు తగ్గించుకోవడానికి అమెరికన్ కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. అందువల్ల ఈ స్థాయిలో కోతలు అమలు చేస్తున్నాయి. అయితే ఈ కోతలు ఇక్కడితోనే ఆగవని.. వచ్చే రోజుల్లో ఇంకా ఎక్కువ స్థాయిలో ఉంటాయని తెలుస్తోంది.