America Nuclear Bomb History: వెనుకటికి తో వ్యక్తి ఊరందరికీ నీతులు చెప్పేవాడు. ముఖ్యంగా కూరల్లో ఉల్లిపాయలు వేసుకోవద్దని చెప్పేవాడు. దానివల్ల అనవసరమైన సమస్యలు ఎదురవుతాయని వివరించేవాడు. తను మాత్రం కూరల్లో ఉల్లిపాయలు వేయకుండా తన ఇల్లాలి మీద మండిపడేవాడు. అదేంటి ఊరందరినీ ఉల్లిపాయలు తినవద్దని చెప్పి.. మీరు ఎందుకు తింటున్నారు అని ఆమె అడిగితే.. “పిచ్చి మొహమా.. అది ఊరి వాళ్లకు.. నాకు కాదు” అంటూ ఆమెకు సమాధానంగా చెప్పేవాడు.
పై ఉపోద్ఘాతం కేవలం ఒక ఉదాహరణ మాత్రమే కాదు.. అమెరికా వ్యవహార శైలికి.. ప్రపంచం మీద ఆ దేశం సాగిస్తున్న పెత్తనానికి బలమైన నిదర్శనం. అమెరికాలో ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్షుడు మారిపోతాడు. కానీ అమెరికా ప్రయోజనాల విషయంలో వారి వ్యవహార శైలి ఏ మాత్రం మారదు. పైగా యుద్ధాలు చేయడంలో.. గిట్టని దేశాలను తొక్కి పెట్టడంలో అమెరికా తర్వాతే ఎవరైనా. అందువల్లే అమెరికా అంటే చాలు కొన్ని దేశాలు భయపడిపోతుంటాయి. ఆంక్షలు విధిస్తుందని వణికి పోతుంటాయి. ఇటీవల కాలంలో పరిస్థితిలో కాస్త మార్పు వచ్చినప్పటికీ.. మెజారిటీ దేశాలకు అమెరికా అంటే ఇప్పటికీ భయమే. ఎందుకంటే తన ప్రయోజనాల కోసం అమెరికా ఏదైనా చేస్తుంది. ఎంతకైనా తెగిస్తుంది. ఎక్కడ దాకా అయినా ప్రయాణం చేస్తుంది. ప్రపంచం మొత్తం తన కాళ్ళ కింద ఉండాలని.. ప్రపంచం నెత్తిమీద తను ఉండాలని అమెరికాను పాలించే పాలకులు కోరుకుంటారు. అందువల్లే ప్రతి ఏడాది ఆ దేశానికి సంబంధించి మిలిటరీకి విపరీతమైన బడ్జెట్ కేటాయిస్తుంటారు. ఇక ఆయుధాల తయారీ గురించి.. బాంబుల రూపకల్పన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తున్నదని.. అది ప్రపంచానికి మంచిది కాదని ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక సందర్భాల్లో చెప్పారు. అందువల్లే తాము ఆ దేశం మీద దాడి చేస్తున్నామని ప్రకటించారు. ఇరాన్ అధ్యక్షుడు తక్షణమే లొంగిపోవాలని.. ఆయన వల్ల ప్రపంచం ముప్పు ఎదుర్కొంటుందని ట్రంప్ కల్లబొల్లి కబుర్లు చెప్పారు. వాస్తవానికి ఈ ప్రపంచంలో అతిపెద్ద అణు బాంబులు ఉన్న రెండవ దేశం అమెరికానే.. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో తొమ్మిది దేశాల వద్ద మాత్రమే న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. అందులో రష్యా వద్ద 5,580 న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. ఆ తర్వాత అమెరికా వద్ద 5044 న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. చైనాలో 500, ఫ్రాన్స్ లో 290, యూకే లో 225, భారత దేశంలో 172, పాకిస్తాన్లో 170, ఇజ్రాయెల్ లో 90, నార్త్ కొరియాలో 50 బాంబులు ఉన్నాయి.
వాస్తవానికి న్యూక్లియర్ బాంబులు తయారు చేయకూడదని.. న్యూక్లియర్ బాంబుల వల్ల ప్రపంచం నాశనం అవుతుందని రష్యా ఇంతవరకు ఎన్నడూ చెప్పలేదు. చెప్పే అవకాశం కూడా లేదు. ఎందుకంటే రష్యా స్టాండ్ మొదటి నుంచి ఒకే విధంగా ఉంటుంది. కానీ అమెరికా అలా కాదు.. దాని ప్రయోజనాలకు అనుగుణంగా మారిపోతూ ఉంటుంది. అందువల్లే ఆ దేశం మీద ప్రపంచ అధినేతలకు ఒక స్థిరమైన అభిప్రాయం ఉండదు. అమెరికా తన వద్ద న్యూక్లియర్ బాంబులు ఉన్నప్పటికీ.. తనను తాను సర్వ పరిత్యాగి దేశం లాగా చెప్పుకుంటుంది. ఇక ఉత్తరకొరియాలో న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తున్న నేపథ్యంలో అమెరికా ఏకంగా ఆంక్షలు విధించింది. ప్రపంచ దేశాలు కూడా తన బాటలోనే నడవాలని స్పష్టం చేసింది. అయితే దీనిని కొన్ని దేశాలు వ్యతిరేకించాయి.. తనను వ్యతిరేకించిన దేశాలపై అమెరికా ఆంక్షలు విధించింది. వాటిని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. ఇక ప్రపంచంలో అణుబాబు అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధం. జపాన్ దేశంలో హిరోషిమా, నాగసాకి పట్టణాలపై ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా అణుబాంబులు వేస్తే ఏకంగా 1.29 లక్షల మంది చనిపోయారు.