Homeఅంతర్జాతీయంAMA President Bobby Mukkamala: ఏఎంఏ అధ్యక్షుడిగా తెలుగోడు.. 178 ఏళ్ల చరిత్రలో తొలిసారి..

AMA President Bobby Mukkamala: ఏఎంఏ అధ్యక్షుడిగా తెలుగోడు.. 178 ఏళ్ల చరిత్రలో తొలిసారి..

AMA President Bobby Mukkamala: అమెరికాలో మల్టీ నేషనల్‌ సంస్థలకు భారత సంతతి వ్యక్తులు అధిపతులుగా కొనసాగుతున్నారు. గూగుల్‌ సీఈవోగా సుందర్‌ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా సత్య నాదెళ్ల వంటివారు ఉన్నారు. అయితే 178 ఏళ్ల అమెరికా మెడికల్‌ అసోసియేషన్‌ చరిత్రలో తొలిసారి ఓ తెలుగోడు అధ్యక్షుడు అయ్యాడు. డాక్టర్‌ బాబీ ముక్కామల అమెరికా మెడికల్‌ అసోసియేషన్‌(ఏఎంఏ) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతి అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు. తెలుగు సంతతికి చెందిన ఈ ఒటోలారిన్జాలజిస్ట్, మిచిగాన్‌లోని ఫ్లింట్‌లో వైద్య సేవలు అందిస్తూ, వ్యక్తిగత, వృత్తిపరమైన సవాళ్లను అధిగమించి ఈ ఘనత సాధించారు.

తెలుగు వారసత్వం..
డాక్టర్‌ ముక్కామల ఆంధ్రప్రదేశ్‌ నుంచి వలస వచ్చిన వైద్యులైన అప్పారావు, సుమతి దంపతుల కుమారుడు. తల్లిదండ్రుల సేవాగుణాన్ని అనుసరించి, ఆయన ఫ్లింట్‌లో సమాజ సేవలో నిమగ్నమై ఉన్నారు. ఆయన భార్య నీతా కులకర్ణి, ఒబ్‌స్టెట్రీషియన్‌–గైనకాలజిస్ట్‌గా, ఆయనతో కలిసి సమాజ సేవలో భాగస్వామ్యం అవుతున్నారు. వీరి కుటుంబం తెలుగు సంస్కృతి, వైద్య సేవల సమ్మేళనానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది.

ఆరోగ్య సవాల్‌ను అధిగమించి..
2024 నవంబర్‌లో డాక్టర్‌ ముక్కామలకు 8 సెం.మీ. బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. మాయో క్లినిక్‌లో అవేక్‌ క్రానియోటమీ శస్త్రచికిత్స ద్వారా 90% ట్యూమర్‌ను తొలగించారు. ఈ సంక్లిష్ట ఆరోగ్య సమస్యను ఎదుర్కొని, ఆయన తన వైద్య వృత్తిని కొనసాగించడమే కాక, ఏఎంఏ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. రోగిగా తన అనుభవం ఆయనకు ఆరోగ్య వ్యవస్థలోని లోపాలను గుర్తించే అవకాశం కల్పించింది. ఇది ఆయన నాయకత్వంలో సంస్కరణలకు దారితీసింది. డాక్టర్‌ ముక్కామల ఏఎంఏ అధ్యక్షుడిగా వైద్యుల కొరత, పని ఒత్తిడి, ఆరోగ్య సేవల్లో అసమానతలను పరిష్కరించే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఏఎంఏ సబ్‌స్టాన్స్‌ యూస్‌ అండ్‌ పెయిన్‌ కేర్‌ టాస్క్‌ ఫోర్స్‌ చైర్‌గా, ఓపియాయిడ్‌ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ సంక్షోభం అమెరికాలో లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో, ఆయన నాయకత్వం రోగులకు సురక్షితమైన చికిత్సలను అందించేందుకు దోహదపడింది.

Also Read: తానా మహాసభల్లో కళా కాంతుల పండుగ: ధీమ్‌ తానా ఫైనల్స్‌ విజేతలకు ఘన సన్మానం

సామాజిక సేవలో బాబి..
ఫ్లింట్‌ నీటి సంక్షోభం సమయంలో, డాక్టర్‌ ముక్కామల కమ్యూనిటీ ఫౌండేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ ఫ్లింట్‌ చైర్‌గా, సీసం (లెడ్‌) విషప్రభావం నుంచి∙పిల్లలను కాపాడేందుకు కృషి చేశారు. ఈ సంక్షోభం ఫ్లింట్‌ సమాజంపై తీవ్ర ప్రభావం చూపిన సందర్భంలో, ఆయన సేవలు సమాజానికి ఆదర్శంగా నిలిచాయి. అదనంగా, ఆయన భార్య నీతా కులకర్ణితో కలిసి 2012లో యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగాన్, ఫ్లింట్‌లో ఎండోవ్డ్‌ హెల్త్‌ ప్రొఫెషన్స్‌ స్కాలర్‌షిప్స్‌ స్థాపించారు, ఇది ఆరోగ్య రంగంలో యువ ప్రతిభలను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular