Alaska Meeting Updates: అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో యుద్ధాలన్నీ ఆపేస్తా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకు ఇచ్చిన హామీ ఇది. కానీ.. ఎన్నికల్లో గెలిచి 9 నెలలైంది. అధికారం చేపట్టి ఆరు నెలలు దాటింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ఇజ్రాయెల్–ఇరాన్, హమాస్ యుద్ధం కొనసాగింది. ఇటీవలే సీజ్‌ఫైర్ జరిగింది. ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారత్, పాకిస్తాన్, థాయ్‌లాండ్–కంబోడియా యుద్ధాలు జరిగాయి. ముఖ్య విషయం ఏమిటంటే.. అమెరికా ఇరాన్‌పై దాడి చేసింది. ఈ క్రమంలో తనకు నోబెల్ శాంతి బహుమతి కావాలని మోజు పడుతున్న ట్రంప్.. ఎట్టకేలకు రష్యా–ఉక్రెయిన్ వార్ ఆపేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య అలాస్కాలో జరిగిన ఒక ముఖ్యమైన సమావేశం శుక్రవారం జరిగింది. అయితే ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎటువంటి అధికారిక ఒప్పందం లేకుండానే ముగిసింది. రెండున్నర గంటలకు పైగా సాగిన ఈ చర్చలు, అనేక అంశాలపై దృష్టి సారించినప్పటికీ, శాంతి ఒప్పందం కుదరకపోవడం గమనార్హం. ఈ సమావేశం రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడంలో ఒక అడుగుగా భావించబడినప్పటికీ, పలు సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు.
Also Read: అసిమ్ మునీర్ పాక్ అధ్యక్షుడవుతారా.. ట్రంప్ అనుగ్రహం కోసమే అమెరికా వెళ్లారా?
పురోగతి ఉన్నా.. ఒప్పందం కుదరలే..
సమావేశం అనంతరం ట్రంప్ తన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సమావేశాన్ని ఫలప్రదమైనదిగా అభివర్ణించారు. అనేక అంశాలపై చర్చలు జరిగాయని, కొంత పురోగతి సాధించినప్పటికీ, కొన్ని కీలక సమస్యలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని వెల్లడించారు. అధికారిక ఒప్పందం కుదరాలంటే, అన్ని విషయాలపై రాజీ సాధించి సంతకాలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్సీ్క, యూరోపియన్ యూనియన్ నాయకులతో సంప్రదింపులు జరుపుతానని, అలాగే పుతిన్‌తో మరోసారి సమావేశమవుతానని ట్రంప్ పేర్కొన్నారు.
నిర్మాణాత్మక చర్చలు.. కానీ..
పుతిన్ ఈ సమావేశాన్ని నిర్మాణాత్మకంగా అభివర్ణించారు, ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు తాను నిజాయతీగా ఉన్నానని వ్యక్తం చేశారు. ఈ భేటీ వివాదానికి ముగింపు పలకడానికి ఒక ప్రారంభ దశగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ, ట్రంప్‌తో తన సంబంధాన్ని వ్యాపార లాంటిదిగా పేర్కొన్న పుతిన్, ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్ యుద్ధం జరిగి ఉండేది కాదని వ్యాఖ్యానించారు. అలాగే, రష్యా–అమెరికా సంబంధాలను మెరుగుపరచడంలో ట్రంప్ పాత్రను కొనియాడారు.
Also Read: ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే జంట విమానాశ్రయాలు ఇవే.. భారత్ స్థానం ఇదే!
బంతి జెలన్సీ్క కోర్టులో..
సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధం ప్రధాన అంశంగా ఉన్నప్పటికీ, శాంతి ఒప్పందంపై ఎటువంటి స్పష్టత రాలేదు. ట్రంప్, ఫాక్స్ న్యూస్ ప్రతినిధి సియాన్ హానిటీతో మాట్లాడుతూ, ఒప్పందం కుదరడం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్సీ్క నిర్ణయంపై ఆధారపడి ఉందని తెలిపారు. జెలెన్సీ్కతో చర్చలు జరిపి ఒప్పందం కోసం ప్రయత్నిస్తానని, అయితే ఉక్రెయిన్ నిరాకరించే అవకాశం ఉందని ఆయన సూచించారు. పుతిన్ కూడా జెలెన్సీ్కతో సమావేశానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, కొన్ని షరతులకు అంగీకరించాలని, శాంతి ఒప్పందం సిద్ధమైన తర్వాతే అటువంటి భేటీ సాధ్యమని క్రెమ్లిన్ వెల్లడించింది.
HAPPENING NOW! https://t.co/5OBEWIttVv pic.twitter.com/s9KIftc3ZW
— Dan Scavino (@Scavino47) August 15, 2025
మొత్తంగా ఈ సమావేశం అమెరికా–రష్యా సంబంధాలను మెరుగుపరచడంలో ఒక సానుకూల దశగా కనిపిస్తుంది, అయితే ఉక్రెయిన్ యుద్ధం వంటి సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడంలో ఇంకా అనేక అడ్డంకులు ఉన్నాయి. ట్రంప్, పుతిన్ ఇద్దరూ సమావేశాన్ని నిర్మాణాత్మకంగా అభివర్ణించినప్పటికీ, ఒప్పందం కుదరకపోవడం వల్ల శాంతి చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని స్పష్టమవుతోంది. జెలెన్సీ్క నిర్ణయం ఈ సందర్భంలో కీలకంగా మారింది.