Homeఆంధ్రప్రదేశ్‌AP Free Bus Review First Day: ఏపీలో ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకం తొలిరోజు.....

AP Free Bus Review First Day: ఏపీలో ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకం తొలిరోజు.. స్పందన ఎలా ఉందంటే?

AP Free Bus Review First Day: సాధారణంగా కుటుంబ జీవితంలో మహిళల పాత్ర కీలకం. కుటుంబంలో ఆదాయాన్ని తెచ్చేది పురుషులే అయినా.. ఆర్థిక క్రమశిక్షణ, కుటుంబ అవసరాలు, వచ్చే ఆదాయం బట్టి ఖర్చులు లెక్కలు వేసేది మహిళలే. ఇప్పుడు పురుషులతో పాటు మహిళలు కూడా సమానంగా పనిచేస్తున్నారు. కుటుంబ అవసరాలకు తోడుగా నిలుస్తున్నారు. అయితే ఏ పని చేయాలన్నా.. ఎక్కడికి వెళ్లాలన్నా రవాణా ముఖ్యం. కానీ రవాణా ఖర్చులు చూస్తుంటే మాత్రం చాలా దారుణంగా ఉంటున్నాయి. ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టి.. ఎక్కడికైనా వెళ్లాలంటే మాత్రం జేబులో 100 రూపాయలకు తక్కువ కాకుండా ఉండాల్సిందే. ఇటువంటి తరుణంలో మహిళలకు ఆర్టీసీ( APSRTC) బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని రూపొందించింది. ఐదు రకాల బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణం అందిస్తోంది. ఆగస్టు 15 సందర్భంగా నిన్ననే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ బస్ స్టేషన్ లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు మహిళలతో బస్సుల్లో ప్రయాణించి వారితో ముచ్చటించారు.

Also Read:   స్త్రీ శక్తి పథకం.. ఏయే బస్సుల్లో..ఏయే కార్డులు చూపించాలంటే?

మహిళల్లో సంతృప్తి..
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉచిత ప్రయాణ పథకం( free travelling scheme) పై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ పథకం అమలు చేస్తారా? లేదా? అనే అనుమానాలు ఉండేవి. రోజురోజుకు జాప్యం జరుగుతుండడం.. పొరుగు రాష్ట్రాల్లో ఉచిత పథకం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడం.. కొన్ని రకాల ప్రతికూలతలు వంటి వాటి దృష్ట్యా ఏపీలో అమలు చేయడం కష్టమేనన్న కామెంట్స్ వినిపించాయి. కానీ సీఎం చంద్రబాబు మాత్రం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ లలో ఉచిత ప్రయాణం కొనసాగనుంది. అయితే కొత్త జిల్లాల పరిధిలో లేదా ఉమ్మడి జిల్లాల పరిధిలో మాత్రమే ఈ పథకం అమలు చేస్తారని అంచనా వేశారు కానీ.. సీఎం చంద్రబాబు మాత్రం రాష్ట్రం మొత్తం ఈ పథకం వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు.

చిన్నపాటి గందరగోళం..
నిన్ననే ఈ పథకం ప్రారంభించక.. ఈరోజు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. మహిళల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. తొలిరోజు చాలా రూట్లో మహిళల వద్ద టిక్కెట్టు డబ్బులు తీసుకున్నారని తెలుస్తోంది. అయితే మహిళలకు అవగాహన లేకపోవడంతోనే ఎక్కువగా గందరగోళానికి గురైనట్లు సమాచారం. పల్లె వెలుగుతో పాటు అల్ట్రా పల్లె వెలుగు వరకు మహిళలు చాలా సులువుగా గుర్తించగలరు. ప్రీమియర్ సర్వీసులుగా ఉన్న ఇతర బస్సుల విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ ఉంది. ఎక్స్ప్రెస్ ల మాదిరిగా అల్ట్రా డీలక్స్, సూపర్ డీలక్స్ లు ఉంటాయి. పొరపాటున ఎక్స్ప్రెస్ అనుకొని ఆ బస్సుల్లో ఎక్కిన వారు ఉచిత ప్రయాణాన్ని కోల్పోయారు. అందుకే ఈ గందరగోళానికి తెర దించేందుకు.. ఉచిత ప్రయాణ పథకం వర్తించే బస్సుల పై స్టిక్కర్లు అతికిస్తున్నారు.

Also Read: ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. వారికి మాత్రం 15 రోజుల తర్వాతే!

పేద, మధ్యతరగతి కుటుంబాలకు మేలు
స్త్రీ శక్తి పథకం ( sthree Sakthi scheme )పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా సహాయపడుతుందని భావిస్తోంది ప్రభుత్వం. ఉద్యోగాల కోసం బస్సుల్లో తిరిగే మహిళలు, ఉపాధి కోసం వెళ్లే మహిళలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థినిలు.. ఇలా వారికి చార్జీల భారం తప్పుతుంది. చాలామంది మహిళలు సుదూర ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను సందర్శిస్తుంటారు. ఆ రూపంలో సైతం వారికి ఉపయోగపడనుంది ఉచిత ప్రయాణ పథకం. ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి నాలుగు వేల రూపాయల వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా ఏపీఎస్ఆర్టీసీకి నెలకు రూ. 161. 83 కోట్లు, ఏడాదికి రూ.1942 కోట్లు ఖర్చు అవుతోంది. ఈ పథకం ద్వారా 87.62 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతారని అంచనా వేస్తోంది. మొత్తానికైతే తొలిరోజు ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకం పై మహిళల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కానీ ఉచిత ప్రయాణ పథకం మూలంగా తాము ఉపాధి కోల్పోయామన్న ఆవేదన ఆటో డ్రైవర్లలో కనిపిస్తోంది. చాలా చోట్ల తమను ఆదుకోవాలని కోరుతూ నిరసనలు కూడా కొనసాగాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular