https://oktelugu.com/

Russia: పుతిన్ పై విమర్శలు..బ్లాగర్ ఆత్మహత్య.. అసలేం జరిగింది?

మొరజోవ్ ఆత్మహత్య దేశంలో కలకలం రేపుతుంటే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తనకేమీ పట్టనట్టు ఆకాశంలో చక్కర్లు కొట్టారు. అణు బాంబులను మోసుకెళ్లగల యుద్ధ విమానంలో గురువారం పుతిన్ ప్రయాణించారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 24, 2024 / 08:39 AM IST
    Follow us on

    Russia: ఎవరైనా తప్పు చేస్తే విమర్శిస్తాం. నేరం చేస్తే ఎండగడతాం. ప్రజాస్వామ్య దేశాల్లో తప్పు చేసింది చివరికి దేశాధ్యక్షుడైనా సరే ఖచ్చితంగా నిలదీస్తాం. కానీ ఇలా నిలదీస్తే ప్రాణాలు పోతున్నాయి. కొందరు ఆత్మహత్య చేసుకుంటే.. మరికొందరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతున్నారు. ఒకరిద్దరు కాదు ఇప్పటికి చాలా మంది ఇలానే చనిపోయారు.. ఇటీవల రష్యా ప్రతిపక్ష నేత నావల్ని కూడా ఇలానే చనిపోయారు. ఆయన మృతి ఇప్పటికీ అనుమానాస్పదమే. అతడు చనిపోయి రోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు రష్యా ప్రభుత్వం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. తాజాగా ఈ జాబితాలోకి రష్యా యుద్ధ బ్లాగర్ ఆండ్రి మొరజోవ్ చేరారు.

    మొరజోవ్.. ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ప్రారంభించినప్పుడు పుతిన్ కు ఎంతో అనుకూలంగా ఉండేవాడు. ఈ బ్లాగర్ రష్యా సైన్యంలోనూ విధులు నిర్వహించే వాడు. ఉక్రెయిన్ పై జరిగిన యుద్ధంలోనూ పాల్గొన్నాడు. అయితే ఇటీవల అతడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చర్చకు దారితీసాయి. అవి తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా ఆద్విద్కా తో జరిగిన యుద్ధంలో 16,000 మంది రష్యన్ సైనికులు కోల్పోయారని అతడు పెట్టిన పోస్ట్ వివాదాస్పదమైంది..ఇది రష్యా ఆర్మీ జనరల్స్ కు కోపం తెప్పించింది. ఇది పుతిన్ దాకా వెళ్లినట్టు తెలిసింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆర్మీ అధికారులు 44 సంవత్సరాల మొరజోవ్ పై ఒత్తిడి తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో పెట్టిన ఆ పోస్టును తొలగించేలా చేశారు. అయితే అనంతరం మొరజోవ్ ఎవరికీ కనిపించకుండా పోయాడు. కొంత కాలానికి ప్రత్యక్షమయ్యాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అతడు.. చైతన్య రహితంగా మారాడు.

    ఏం జరిగిందో తెలియదు కానీ టెలిగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ప్రకటించాడు. తుపాకీతో కాల్చుకొని మొరజోవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని మొరజోవ్ తో సన్నిహిత పరిచయం ఉన్న న్యాయవాది పెష్కోవ్ ధ్రువీకరించాడు. మొరజోవ్ మృతితో రష్యాలో మరోసారి కలకలం చెలరేగింది. దీనిపై ఆ దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయి. నావల్ని మృతికి సంబంధించి వివాదం ఇంకా సద్దుమణిగక ముందే మొరజోవ్ మృతి చెందడం.. అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోందని అంతర్జాతీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

    మొరజోవ్ ఆత్మహత్య దేశంలో కలకలం రేపుతుంటే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తనకేమీ పట్టనట్టు ఆకాశంలో చక్కర్లు కొట్టారు. అణు బాంబులను మోసుకెళ్లగల యుద్ధ విమానంలో గురువారం పుతిన్ ప్రయాణించారు. దానికి కో పైలట్ గా వ్యవహరించారు. టీయూ – 160 ఎం సూపర్ సోనిక్ బాంబర్ విమానంలో ఆయన 30 నిమిషాల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టారు. 71 సంవత్సరాల వయసులో పుతిన్ యుద్ధ విమానంలో ప్రయాణించడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెలలో రష్యాలో ఎన్నికలు, తనను గుడ్లురుమి చూస్తున్న పశ్చిమ దేశాలకు హెచ్చరికలు జారీ చేయాలనే ఉద్దేశంతోనే పుతిన్ ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.