IT Crisis: కరోనాతో ఐటీ సెక్టార్‌లో మొదలైన లే ఆఫ్‌ల పర్వం ఇంకా కొనసాగుతోంది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఐటీ, టెక్, స్టార్టప్ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఆ సంఖ్య భారీగానే ఉంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని కంపెనీలూ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. గూగుల్, యాపిల్, టెస్లా లాంటి పెద్ద కంపెనీలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
80 వేల మందికి ఉద్వాసన..
ఈఏడాది ఇప్పటి వరకు 80 వేల మందిని ప్రపంచ వ్యాప్తంగా ఐటీ కంపెనీలు తొలగించాయి. ఒక్క ఏప్రిల్ నెలలోనే ఏకంగా 20 వేల మందిని ఇంటికి పంపించారు. ఇందులో ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ 600 మందిని తొలగించింది. వీరిలో చాలా మంది స్మార్ట్ కారు, స్మార్ట్ వాచ్ డిస్‌ప్లే వంటి ప్రత్యేక ప్రాజెక్టుల్లో విధులు నిర్వహిస్తున్నవారే. భారీగా ఖర్చు సహా వివిధ కారణాలతో ఈ ప్రాజెక్టులను యాపిల్ పక్కన పెట్టింది. ఇక ఈకామర్స్ సంస్థ అమేజాన్ కూడా తన క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వందల మంది ఉద్యోగులను తొలగించింది. ఇంటెల్ సంస్థ సేల్స్, మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్ నుంచి 62 మందిని తొలగించింది. ఆర్థిక సమస్యల కారణంగా బైజూస్ ఏప్రిల్‌లో 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.
టెస్లా కూడా..
ఇక ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌మస్క్ సారథ్యంలోని విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్తా ప్రపంచ వ్యాప్తంగా ఆ కంపెనీల్లో పనిచేస్తున్న 10 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఓలా క్యాబ్స్ 10 శాతం ఉద్యోగులను ఇంటికి పంపించింది. టెక్, ఇంజినీరింగ్, ప్రొడక్ట్ టీమ్‌కుచెందిన సుమారు 200 మంది ఉద్యోగులను తొలగించింది. హెల్త్ టెక్ స్టార్టప్ హెల్తీఫైమీ 150 మంది ఉద్యోగులను తొలగించింది. వర్ల్‌పూల్ 1000 మందిని, టెలినార్ 100 మంది చొప్పున తొలగించాయి.