ఏపీలోని విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దంటూ గత కొన్ని రోజులుగా ఆందోళనలు సాగుతున్నాయి. ఈ ప్లాంట్ కోసం ఇంతలా అన్ని రాజకీయ పార్టీలు ఎందుకు ఒక్కతాటిపైకి వస్తున్నాయి..? విశాఖలో ఉక్కు కర్మాగారం ఏ పరిస్థితుల్లో ఏర్పడింది..? ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పడడానికి ఎంత మంది ప్రాణత్యాగం చేశారు..? ఆ కాలంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలేంటి..? దాదాపు 60 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఉక్కు కర్మాగారం ఇప్పుడు నష్టాలు రావడానికి కారణాలేంటి..?
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు ఈ నినాదాన్ని మనం పుస్తకాల్లోనే చదివాం. కానీ ఈ నినాదం రావడానికి బలమైన కారణమే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద కర్మగారమైన విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 1971లో శంకుస్థాపన జరిగింది. అయితే ఈ శంకుస్థాపన ఇటుక పడడానికి దేశ వ్యాప్తంగా అనేక ఉద్యమాలు, రాజకీయ పరిణామాలు, ఆందోళనలు సాగాయి.
నాలుగో పంచవర్ష ప్రణాళికలో నాలుగు ఉక్కు కర్మాగారాలు ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అప్పటికే ఉన్న రూర్కెలా(ఒడిశా), భిలాయ్(మధ్యప్రదేశ్.. ఇప్పుడు చత్తీస్ గఢ్), అసన్ సోల్ (పశ్చిమ బెంగాల్) ప్లాంట్ల ను ప్రభుత్వంలో కలిపి నాలుగోదానిని ఏర్పాటు చేయాలని భావించారు. దీనిని బొకారో (బిహార్) లో నెలకొల్పాలని నిర్ణయించారు.
ఈ తరుణంలో 1964లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ‘పంచవర్ష ప్రణాళికల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, ఇప్పుుడు ప్రతిపాదించే స్టీల్ ప్లాంట్ ను రాష్ట్రానికి తీసుకురావాలని’ అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. ఆయన డిమాండ్ కు ప్రతిపక్ష నాయకులు పి. వెంకటేశ్వర్లు, టి. నాగిరెడ్డి, జి. లచ్చన్న, తెన్నేటి విశ్వనాథం, వావిలా గోపాల కృష్ణయ్య లాంటి వారు మద్దతు తెలిపారు.
నాలుగో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశం చూడాలని 1965 జనవరి 27న ప్రభుత్వం బ్రిటిష్ అమెరికన్ స్టీల్ వర్క్స్ ఫర్ ఇండియా కన్సార్షియం(బీఏఎస్ఐసీ) పేరుతో ఒక బృందాన్ని నియమించింది. ఈ బృందం దేశంలోని బైలదిలా, హోస్పేట్, గోవా, నైవీలీ, విశాఖపట్నం లను పరిశీలించింది. మొత్తంగా దక్షిణంలోని విశాఖ పట్నం ఉక్కు పరిశ్రమకు అనువైన ప్రదేశంగా 1965 జూన్ 25న నివేదిక సమర్పించింది.
ఈ నివేదిక సమర్పించిన అనంతరం తేనేటి విశ్వనాథం ఆధ్వర్యంలో అఖిలపక్ష కార్యాచరణ కమిటీ ఏర్పాటైంది. అప్పటికే దీనిపై చర్చ జరుగుతుండగా నివేదిక విషయం బయటికి రావడంతో ప్రజల్లో మరింత చర్చ మొదలైంది. మన రాష్ట్రంలో ఒక భారీ ఉక్కు కర్మాగారం ఏర్పాటైతే ఉద్యోగాకావశాలతో పాటు అభివృద్ధి జరుగుతుందని అఖిలపక్ష నాయకులు తమ ప్రసంగాలు చేశారు. ఈ సమయంలో ప్రధానిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి విశాఖలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
దురదృష్టవశాత్తూ ఆయన 1966 జనవరిలో మరణించారు. దీంతో ఇందిరాగాంధీ ప్రధాని పదవి చేపట్టారు. కానీ నాలుగో పంచవర్ష ప్రణాళికలో విశాఖలో ఉక్కు కర్మగారం ఏర్పాటు సాధ్యం కాదని సెప్టెంబర్ లో ప్రకటించారు. ఇందుకు దేశంలో నెలకొన్న పరిస్థితులు, నిధుల కొరత అని వివరించారు. ఉక్కు కర్మాగారం కోసం మిగతా రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి నిలిపివేస్తున్నామన్నారు.
అగ్గి మీద ఆజ్యం పోసినట్లు అదే సమయంలో తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో సేలంలో ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని ప్రకటించారు. దీంతో ఏపీలో ఆందోళన ఉధృతం దాల్చింది. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన నీలం సంజీవరెడ్డి ఉక్కు శాఖ మంత్రిగా ఉండగా ఆందోళన నేపథ్యంలో ఆయనను విమానయాన శాఖకు మార్చారు.
1966 అక్టోబర్ నెలలో ఉద్యమం మరింత బలపడింది. ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయసాగారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన టి. అమృతరావు 1966 అక్టోబర్ 15న విశాఖపట్నంలో అమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈయనకు మద్దతుగా స్కూళ్లు, కాలేజీలు బంద్ చేశాయి.
1966 నవంబర్ ఒకటో తేదీన విశాఖలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తొమ్మిదేళ్ల బాలుడు కె. బాబురావుతో సహా అనేక మంది చనిపోయారు. దీంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. విజయవాడలో ఆందోళనలో భాగంగా నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసి కాలువలో పడేశారు. ఇలా ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా జరగడంతో ఆయా చోట్ల పోలీసులు జరిపిన కాల్పుల్లో మొత్తంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీంతో కేంద్ర ప్రభుత్వం చలించి మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. 1966 నవంబర్ 3న ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఉపసంఘం గురించి తెలిపి విశ్వనాథం నిరాహార దీక్షను విరమింపజేశారు. అయితే ఆంధ్రుల డిమాండ్ కు తక్షణమే అంగీకరించడం సాధ్యం కాదు. వనరుల లభ్యత, స్టీల్ ప్లాంట్ కోసం ఇతర రాష్ట్రాల డిమాండ్ల నేపథ్యంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఇందిర తెలిపారు.
ప్లాంట్ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్ కు చెందిన 67 మంది ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. 1966 నవంబర్ 17న అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సీపీఐ కి చెందిన నలుగురు లోక్ సభ్యులు కూడా రాజీనామా చేశారు. కానీ వీరి రాజీనామా ప్రభుత్వంపై ప్రభావం చూపలేకపోయాయి.
1967లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 1970 ఏప్రిల్ 17న విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం 6 వేల ఎకరాల స్థలాన్ని సేకరించారు. 1971 జనవరి 20న ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1977లో జనతా ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయడంతో పనులు ప్రారంభమయ్యాయి. రష్యా సహకారంతో నిర్మాణం అయిన విశాఖ ఉక్కు ప్లాంట్ 1990లో ఉత్పత్తిని ప్రారంభించుకుంది. ప్రస్తుతం ఇందులో 16 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు, 17,500 కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. పరోక్షంగా మరో లక్ష మందికి ఉపాధి దొరుకుతుంది.
అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉక్కు ఉత్పత్తికి సొంతంగా ముడి సరుకు తీసుకునే గనులు లేవు. ముడి సరుకు కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో ఈ మధ్య కాలంలో నష్టాల బాటలో నడుస్తుందని అంటున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని చూస్తోంది. అయితే ప్రైవేటీకరణతో కార్మికులు ఉద్యోగాలు కోల్పోతారని, ఎంతో మంది రోడ్డున పడుతారని ఆందోళనలు సాగుతున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..
1964లో భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు చనిపోయారు. ఆ తరువాత దేశ పగ్గాలు చేపట్టిని లాల్ బహదూర్ శాస్త్రి 1966లో అకస్మాత్తుగా కన్నుమూశారు. ఈ సందర్భంగా ఏర్పడిన రాజకీయ సమీకరణాల మధ్య ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి అయ్యారు. ఈమె హయాంలో కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. దేశాన్ని కరువు పీడించింది. ఆకలి చావులు ఏర్పడ్డాయి. బంద్ లు, ఆందోళనలు లాంటివి జరిగాయి. ఇదే సమయంలో 1967లో సాధారణ ఎన్నికలు సమీపించాయి. అందుకే నాడు ఆంధ్రుల పోరాటం కారణంగానే విశాఖ ఉక్కు 70వ దశకంలో ఏర్పాటైంది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Visakha ukku andhra right 32 people killed what happened in 1966
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com