Viral Video : ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. జనవరి 12న ప్రారంభం అయిన ఈ కుంభమేళా ఫిబ్రవరి 26వరకు జరుగుతుంది. దాదాపు 45రోజుల పాటు భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ప్రయాగరాజ్ కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ప్రతి రాష్ట్రం నుంచి భారీ సంఖ్యలో ప్రయాగరాజ్ చేరుకుంటున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి కుంభమేళకు వాహనాలు క్యూ కడుతున్నాయి. రైళ్లు, బస్సులు, కార్లు ఇలా ప్రజలు ఏది దొరికితే దానిలో ఓ ఉద్యమంలా వెళ్తున్నారు. ఇప్పటి వరకు కుంభమేళాలో సుమారు 50 కోట్ల మంది పుణ్య స్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం గణాంకాలను విడుదల చేసింది.
ఈ సారి వచ్చిన కుంభమేళా చాలా విశిష్టల ఉందని చెబుతున్నారు. 144 ఏళ్ల తర్వాత రావడంతో ఈ కుంభమేళకు ఇంత విశిష్టత నెలకొంది. ఇక దేశ నలుమూలల నుంచి విచ్చేస్తున్న భక్తులతో యూపీ రోడ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసి పోయాయి. కుంభమేళలో రోజుకో ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి. ఈ కుంభమేళాలో చాలా మంది వైరల్ అయ్యారు. అలాంటి వారిలో చోటా బాబా, పూసలు అమ్ముకునే మోనాలిసా లాంటి వారు ఉన్నారు. మోనాలిసాను మనోళ్లు ఎంత ఫేమస్ చేశారో తెలిసిందే. ఏకంగా తనకు బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కూడా వచ్చేసింది. ఇలా ప్రతీ రోజూ కుంభమేళాకు సంబంధించిన ఏదో ఒక విచిత్ర ఘటన నెట్టింట్లో వైరల్ అవుతుంది. తాజాగా మరో ఆసక్తికరమైన వీడియో నెట్టింట్లో ట్రెండ్ అవుతుంది.
ఈ క్రమంలోనే ఓ యువకుడు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు వచ్చాడు. నదిలోకి దిగి మంచిగా మూడు సార్లు మునిగాడు. అయితే అంతటితో ఆగకుండా తన చేతిలోని ఫోన్ కూడా ప్రత్యేకంగా నీటిలో ముంచేశాడు. సాధారణంగా ఫోన్‌కు నీరు తగిలితేనే పాడైపోతుందేమోనని భయపడతాం. అలాంటిది ఆ కుర్రాడు ఎంచక్కా ఫోన్‌ను నీటిలో ముంచడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఇదంతా అక్కడే ఉన్న మరో వ్యక్తి తన ఫోన్ కెమెరాలో చిత్రీకరించాడు. దీంతో ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట్లో ట్రెండ్ అయింది. ఫోన్ కు స్నానం చేయించడం ఏంటి బాసూ అంటూ ఫన్నీగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆ ఫోన్ ఎన్ని పాపాలు చూసిందో అందుకే ఇలా ముంచుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.