Viral Video : కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా సువర్ణపురం ప్రాంతంలోని శివుడిని దర్శించుకోవడానికి భక్తులు వెళ్లారు. తెల్లవారుజామునే దీపాలు వెలిగించడానికి వారు వెళ్ళగా.. ఊహించని దృశ్యం వారికి ఎదురైంది. భక్తులు ఆలయంలో పలికి వెళ్ళగానే మూడు ఎలుగుబంట్లు అక్కడ కనిపించాయి. దీంతో భక్తులు వెనుతిరి గారు.. శ్రీకాకుళం జిల్లా మందస మండలం సువర్ణ పురం ప్రాంతంలో చారిత్రాత్మకమైన శివాలయం ఉంది. కార్తీక మాసం సందర్భంగా ఈ ఆలయంలో ప్రతిరోజు పూజలు ఘనంగా జరుగుతాయి. శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు దీపాలు వెలిగించడానికి తెల్లవారుజామున ఆలయానికి వెళ్లారు.. ఆలయంలోకి వారు ప్రవేశిస్తుండగానే మూడు ఎలుగుబంట్లు కనిపించాయి. దీంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. అవి అటు ఇటు తిరగడంతో భక్తులు వణికి పోయారు. ఆ తర్వాత ఆ ఎలుగుబంట్లు సమీపంలోని చెరుకు, అనాస పండ్లతోటల్లోకి వెళ్లాయి. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. మూడు ఎలుగుబంట్లు ఆలయంలోని నంది చుట్టూ తిరిగాయి.
అక్కడికి ఎందుకు వచ్చినట్టు..
సువర్ణపురం ప్రాంతం అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉంటుంది. మందస మండలంలో సువర్ణపురం చెరుకు, అనాస పండ్ల తోటలకు ప్రసిద్ధి. కొన్ని గ్రామాలలో పనస టోటలు కూడా సాగవుతాయి. ఈ తోటలు ప్రస్తుతం విపరీతమైన కాపుతో ఉన్నాయి. ఈ కాయలను తినడానికి ఎలుగుబంట్లు అటవీ ప్రాంతాల నుంచి వచ్చి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. అయితే ఈ ఎలుగు బంట్ల నుంచి తమ పండ్ల తోటలను కాపాడుకునేందుకు రైతులు చుట్టూ విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తుంటారు. అప్పుడప్పుడు ఈ ఫెన్సింగ్ తగిలి అటవీ జంతువులు చనిపోయిన సంఘటనలున్నాయి. అయితే ఆ ఎలుగుబంట్లు ఈ ఆలయానికి రావడం సంచలనంగా మారింది. గతంలో ఎన్నడూ అటవీ జంతువులు ఆలయానికి వచ్చిన దాఖలాలు లేవు. చుట్టు ప్రహరీ ఉన్నప్పటికీ అవి దూకి వచ్చి ఆలయంలోకి ప్రవేశించినట్టు స్థానికులు చెబుతున్నారు. “కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలోకి మూడు ఎలుగుబంట్లు వచ్చాయి. శివుడు ఎదురుగా ఉన్న నంది విగ్రహం పక్కనే చాలా సేపు ఉన్నాయి. అటు ఇటు తిరిగాయి. భక్తులు కొట్టిన టెంకాయలను తిన్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి చాలాసేపటికి వెనుతిరిగి వెళ్లిపోయాయి. వాటిని చూస్తే భయం వేసింది. ఎదురు తిరుగుతాయని అనిపించింది. వాటిని చూసిన మేము మా కెమెరాలలో చిత్రీకరించాం.. ఈ వీడియోలను అటవీశాఖ అధికారులకు పంపించాం. వారు గ్రామంలో దండోరా వేయించారు.. సాయంత్రం దాటితే ఎవరూ బయటికి వెళ్ళకూడదని అందులో పేర్కొన్నారని” స్థానికులు అంటున్నారు. ఎలుగుబంట్లు సంచరించిన నేపథ్యంలో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
శివాలయంలో ఎలుగుబంట్లు హల్చల్
శ్రీకాకుళం జిల్లా మందస మండలం సువర్ణపురం గ్రామంలో ఒకేసారి మూడు ఎలుగుబంట్లు సంచారం
కార్తీక పౌర్ణమి నేపథ్యంలో శివాలయంలో భక్తులు పూజలు చేస్తుండగా నంది విగ్రహం వద్ద ఎలుగుబంట్లు ప్రత్యక్షం
భక్తులను హడలెత్తించిన ఎలుగుబంట్లు pic.twitter.com/RnGFTpvC8D
— TV9 Telugu (@TV9Telugu) November 15, 2024