Viral Video : మనిషి అభివృద్ధి వేటుకు చాలావరకు అడవులు నాశనమయ్యాయి. అలాంటప్పుడు అడవి జంతువులను చూడాలంటే డిస్కవరీ లేదా యానిమల్ ప్లానెటే దిక్కు. అదే డబ్బున్న వాళ్లయితే వైల్డ్ సఫారీ కి వెళ్తారు. వాళ్ళ దేశంలో అడవులు నచ్చకపోతే.. లేదా మరిన్ని విభిన్నమైన జంతువులను చూడాలనుకుంటే.. ఏ ఆఫ్రికానో, కెన్యానో వెళ్తారు. అలా కొందరు యాత్రికులు కెన్యా వెళ్లారు. అక్కడ వైల్డ్ సఫారిని ఎంచుకున్నారు. ఫారెస్ట్ గైడ్ తో కలిసి వాహనంలో అడవిలోకి వెళ్లారు. ఇక అప్పుడు మొదలైంది.. అసలు కథ..
ఆ వాహనం ఓపెన్ టాప్ గా ఉంది.. గైడ్ తో కలిసి ఐదుగురు ఆ వాహనంలో ఉన్నారు. వారు దట్టమైన అడవిలో పర్యటించి ఒకచోట వాహనాన్ని ఆపారు. అంతే నాలుగైదు చీతాలు వారి వాహనం సమీపానికి వచ్చాయి. ముందుగా ఒక చీతా వారి వాహనం ముందు భాగం పైకి ఎక్కింది. అప్పటికి వారు భయపడుతూనే ఉన్నారు. వాహనాన్ని ముందుకు వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. అలా వెళ్తే వేటాడుతాయని గైడ్ సైగలు చేస్తున్నాడు. ఒక చీతా వాహనం పై భాగంలోకి ఎక్కగానే.. మరొకటి దానినే అనుసరించింది. ఇలా నాలుగు వరకు ఆ వాహనంలోకి వచ్చేసాయి. అందులో ఉన్నవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. రెండు చీతాలయితే వాహనం పై భాగం లోకి ఎక్కి సయ్యాటలాడాయి. రెండు చీతాలు వాహనం లోపలికి వచ్చాయి. అదృష్టవశాత్తు వారిని ఏమీ చేయలేదు. కొద్దిసేపటికి గైడ్ వాహనాన్ని ముందుకు కదల్చడంతో అవి కిందకి దూకాయి.
ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు కాని.. ఇన్ స్టా లో Ngorongro tourism festival అనే ఐడి లో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు 29,000 మంది లైక్ చేశారు. 936 మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ నమోదు చేసింది.. ఆ వీడియో చూసినవారు రకరకాలుగా స్పందిస్తున్నారు. వైల్డ్ సఫారీ అంటే ఇదే అని కొందరు.. చావు నోట్లో తలపెట్టి బయటికి వచ్చారని మరికొందరు.. ఇలాంటి అనుభూతి ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా దక్కదని ఇంకొందరు కామెంట్స్ చేశారు.