https://oktelugu.com/

Summer Heat : మే మరింత మండిపోతుందట.. 123 ఏళ్ల తర్వాత ఇలా జరుగుతోందట..

అక్కడక్కడ గాలి దుమారాలతో కూడా వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందట. అందువల్ల జనం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు ఉదయం లేదా సాయంత్రం సమయంలో పనులు పూర్తి చేసుకోవాలని చెబుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 3, 2024 9:40 pm
    Summer heat

    Summer heat

    Follow us on

    Summer Heat : ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అని తేడా లేదు. ఎండలు బీభత్సంగా కొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇవాల్టితో పోల్చితే నిన్నే నయం అని అనుకోవాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే మేఘాలయ వరకు రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో బయటికి రావాలంటేనే ప్రజలు వణికి పోతున్నారు. ఏప్రిల్ నెల అలా ఉందంటే.. మే లో సూర్యుడు జనాలకు చుక్కలు చూపిస్తున్నాడు. ఉదయం 9 దాటితే చాలు రోడ్లమీద అనధికార కర్ఫ్యూ వాతావరణం నెలకొంటోంది. ఇక దేశవ్యాప్తంగా వడ దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. మే నెల ప్రారంభమై శుక్రవారం నాటికి మూడు రోజులు. ఈ మూడు రోజుల్లోనూ ఎండలు రికార్డు స్థాయిలో దంచి కొట్టాయి. అయితే వచ్చే రోజుల్లోనూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    123 ఏళ్ల తర్వాత

    ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విపరీతంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఇలా నమోదు కావడం ఇది రెండవ సారట. 1901 సంవత్సరం లో ఏప్రిల్ నెలలో తొలిసారిగా ఇదే స్థాయిలో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయట. వాస్తవానికి ఏప్రిల్ నెలలో వడగాలులు వీచడం అనేది ఉండదు. మే ప్రథమార్థం లేదా ద్వితీయార్థంలో వడగాలులు వీచడం పరిపాటి. కానీ ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే వడగాలులు విపరీతంగా వీచాయి.. ఇక ప్రస్తుత మే నెలలో కూడా విపరీతంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయట. వడగాలులు వీస్తాయట. దేశవ్యాప్తంగా 11 రోజులపాటు హీట్ వేవ్స్ కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ” ఏప్రిల్ ఐదు నుంచి ఏడు వరకు, 15 నుంచి 30 వరకు అధిక ఉష్ణోగ్రతలు, వడగాలు నమోదయ్యాయి. సగటు ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ గా నమోదయింది.. ఈశాన్య భారత దేశంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 28.12 డిగ్రీల సెల్సియస్ గా నమోదయింది.. 1901 తర్వాత మళ్లీ ఈ స్థాయిలో ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే తొలిసారి. 1980 నుంచి దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజస్థాన్ లోని దక్షిణ ప్రాంతం, మధ్యప్రదేశ్లోని పశ్చిమ ప్రాంతం, మహారాష్ట్రలోని విదర్భ, మరాఠవాడ, గుజరాత్ లోని ఖచ్ ప్రాంతంలో 8 నుంచి 11 రోజులపాటు వేడి గాలులు వీస్తాయని”భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్ర పేర్కొన్నారు.

    ఇక రాజస్థాన్ లోని తూర్పు, దక్షిణ ప్రాంతం, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, చత్తీస్ గడ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశాలోని మారుమూల ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లోని గంగానది పరివాహక ప్రాంతం, జార్ఖండ్, కర్ణాటకలోని ఉత్తర ప్రాంతంలోని మారుమూల ప్రదేశాలు, బీహార్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో వేడిగాలులు, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయట. అక్కడక్కడ గాలి దుమారాలతో కూడా వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందట. అందువల్ల జనం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు ఉదయం లేదా సాయంత్రం సమయంలో పనులు పూర్తి చేసుకోవాలని చెబుతున్నారు.