
YouTube New CEO: ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ వీడియో ప్లాట్ ఫామ్ యూట్యూబ్. దాని కొత్త సారథిగా భారత సంతతి అమెరికన్ నీల్ మోహన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయన యూట్యూబ్ లోనే చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుత సీఈవో సుసాన్ వోజ్కీకి స్థానాన్ని ఆయన భర్తీ చేయబోతున్నారు. అంతకు ముందు నీల్ మైక్రో సాప్ట్, స్టిచ్ ఫిక్స్ అండ్ జీనోమిక్స్, బయోటెక్నాలజీ కంపెనీ ఆయన 23 అండ్ మీ వంటి సంస్థల్లో పని చేశారు.
సుసాన్ గడచిన తొమ్మిది సంవత్సరాలుగా యూట్యూబ్ కు నేతృత్వం వహిస్తున్నారు. ఇకపై కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత అభిరుచులపై దృష్టి సారించేందుకు పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ఉద్యోగులకు పంపిన మెయిల్ లో ఆమె తెలిపారు. గతంలో గూగుల్ లోని యాడ్ ప్రొడక్ట్స్ విభాగంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన సుసాన్.. 2014లో యూట్యూబ్ సీఈవోగా నియమితులయ్యారు.. గూగుల్ ప్రారంభ ఉద్యోగుల్లో సుసాన్ కూడా ఒకరు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ లో 25 ఏళ్లుగా ఆమె పనిచేస్తున్నారు.. అంత క్రితం ఇంటెల్, బెయిన్ అండ్ కో లో పనిచేశారు.

ఇక సుసాన్, మోహన్ చాలాకాలంగా పనిచేస్తున్నారు. ఆమెకు అత్యంత నమ్మకమైన వ్యక్తుల్లో ఒకరుగా ఉన్నారు.. యూట్యూబ్ కూడా ఆల్ఫాబెట్ గ్రూప్ సంస్థే. గూగుల్ తో పాటు ఆల్ఫా బెట్ కు కూడా భారత వ్యక్తి సుందర్ పిచాయ్ సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.. గ్రూపునకు ఆదాయపరంగా చాలా కీలకమైన యూట్యూబ్ పగ్గాలు కూడా భారత సంతతి వ్యక్తికి లభించడం విశేషం. గత ఏడాది యూట్యూబ్ యాడ్ సేల్స్ ఆదాయం 2,920 కోట్ల డాలర్లకు చేరుకుంది.. ఆల్ఫాబెట్ గ్రూప్ రెవిన్యూ మొత్తంలో పది శాతం కంటే అధికం ఇది. గూగుల్, మైక్రో సాప్ట్, అడోబ్ లాంటి సంస్థలకు భారతీయులే సారథ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి యూట్యూబ్ కూడా చేరింది. ఇక మిగిలింది అమెజాన్, ఆపిల్..మాత్రమే… వాటి కూడా త్వరలో ఏ భారతీయుడో సారథ్యం వహించే అవకాశాలు లేకపోలేదు.