
KCR Birthday Special: తెలంగాణ రాష్ట్రం.. దశాబ్దాల పాటు పోరాటాలు చేసినా.. ఎంతోమంది యువకులు తమ ప్రాణాలను త్యాగం చేసినా దక్కలేదు.. తెలంగాణ పై ఆశలు సన్నగిల్లిన నేపథ్యంలో ఓ ఉద్యమ కెరటం ఎగిసింది. సబ్బండ వర్ణాలను సమ్మిళితం చేసి స్వరాష్ట్ర కాంక్షలు రగిలించింది. ఆ ఉద్యమ సూర్యుడే సీఎం కేసీఆర్. 14 సంవత్సరాలపాటు ఉద్యమాన్ని అత్యంత విజయవంతంగా నడిపిన ధీశాలి. సమాజంలో అన్ని వర్గాలను ఒక తాటిపైకి తెచ్చిన అరుదైన ప్రతిభాశీలి. బహుముఖీన ప్రజ్ఞ, నిరంతర అధ్యయనం, విస్తృత రాజకీయ అనుభవం కలబోసుకున్న అరుదైన జననేత కేసీఆర్ వల్లే తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగింది. స్వ రాష్ట్రం సిద్ధించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక్కసారి నాటి ఉద్యమ గుర్తులను మననం చేసుకుందాం.
ఉద్యమానికి విస్తృత ప్రచారం, ఉద్యమంలోకి జన ప్రవాహం ఈ రెండిటినీ ఒకేసారి సాధించే లక్ష్యంతో చేపట్టిందే రాజీవ్ రహదారి దిగ్బంధనం.. ఉత్తర తెలంగాణకు గుండెకాయలాంటి రాజీవ్ రహదారి ని పోరాట వేదికగా ఎంచుకోవడం వెనుక కేసీఆర్ చాణక్యం దాగి ఉంది.. అంతర్ రాష్ట్ర రహదారిని దిగ్బంధిస్తే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుందని ఆయన ఆలోచన.. అలా 2006 డిసెంబర్ 29న చేపట్టిన ఈ పోరుబాట ఉద్యమానికి నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది.
ఉద్యమాన్ని పలు రూపాల్లో ఉరుకులు పెట్టిన కేసీఆర్ ఇందిరా పార్కు వద్ద 2008 జూలై రెండున ధర్నాకు పిలుపునిచ్చారు. 610 జీవో అమలు కోసం కెసిఆర్ నేతృత్వంలో చేపట్టిన ధర్నా ఇది. ఉద్యోగుల సమస్యలపై ఎంతో అవగాహన ఉన్న కేసీఆర్ ఉద్యమంలోకి వారందరినీ భాగస్వాములను చేసిన సందర్భం ఇది. ఇది ఎంత విజయవంతమైనదంటే అప్పటి సమైక్య పాలకులు, ఢిల్లీ అధినేతలను కదిలించింది.. వెన్నులో వణుకు పుట్టించింది.

సమైక్య పాలనలో అనాధగా మారిన తెలంగాణకు అమ్మ ప్రేమ అందించాలన్న మానవీయ ఆలోచనలో నుంచి ఆకృతి దాల్చిందే తెలంగాణ తల్లి. ఉమ్మడి పాలనలో ఉనికిని గుర్తించని తెలంగాణకు స్పష్టమైన రూపు రేఖలను ఇచ్చి జనం మనసులో ఉన్నత స్థానం కల్పించారు కేసీఆర్. ఆత్మగౌరవ నినాదంతో చేపట్టిన తెలంగాణ ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు కేసిఆర్ ఎంచుకున్న ఎత్తుగడే తెలంగాణ తల్లి.
ఉద్యమం అంటే ఉదయం పూట ఏదో కొద్ది సేపు ఆందోళన చేయడమే అప్పటి దాకా తెలుసు.. ఉద్యమం అంటే చేపట్టిన చోటే వండుకుంటాం, పండుకుంటాం అన్న రీతిలో 2006లో రాజీవ్ రహదారిని దిగ్బందనం చేశారు. ఉద్యమకారులంతా వంటలు వండుకుని తింటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఝలక్ ఇచ్చారు. స్థాయీ భేదం లేకుండా నాటి రాజకీయ ప్రముఖులు మొత్తం రోడ్లపైనే భోజనాలు చేశారు.
ఉద్యమంలో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేసేందుకు కేసిఆర్ ఎంతో కసరత్తు చేశారు.. అన్ని రంగాల దుస్థితిని, అవసరాలను అధ్యయనం చేశారు.. అందుకు అనుగుణంగానే పోరాటాలు నిర్మిస్తూ వచ్చారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం అంత ఆషామాసి వ్యవహారం కాదు. ఈ విషయం బాగా తెలిసిన కేసీఆర్ ఉద్యమకారులకు నిరంతరం ఏదో ఒక యాక్టివిటీ కల్పిస్తూ వచ్చారు. ఓవైపు సమైక్య పాలకులు ఎత్తుగడలతో, ధన బలం, అధికారంతో, రాజకీయ పలుకుబడితో తెలంగాణను అడ్డుకుంటుంటే.. ఉద్యమకారుల్లో భయాన్ని పోగొట్టి, వారిలో చైతన్యాన్ని నింపేందుకు కేసీఆర్ జాగరణ సేనను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కర్ర సాములో శిక్షణ ఇప్పించారు. అవసరమైతే దేనికోసమైనా సిద్ధమనే సంకేతాన్ని పాలకులకు పంపించారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే ఎజెండాగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి 2001 ఏప్రిల్ 27న హైదరాబాదులోని జల దృశ్యంలో ప్రారంభించారు.. డిప్యూటీ స్పీకర్ పదవితోపాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. టిఆర్ఎస్ పార్టీ స్థాపించి… ప్రథమ వార్షికోత్సవాన్ని నల్లగొండ లో 2002 ఏప్రిల్ 26న నిర్వహించారు.. ఇక తెలంగాణ సాధన కోసం కెసిఆర్ చేయని పోరాటం లేదు. సిద్దిపేట నుంచి వరంగల్ దాకా వంద కిలోమీటర్ల దూరం సైకిల్ యాత్ర చేపట్టారు. దారి పొడవునా ప్రజలతో తెలంగాణ అవసరాన్ని చెప్తూ యాత్ర సాంతం విజయవంతంగా సాగింది.. 2003 ఆగస్టు 25న కోదాడ నుంచి హాలియా దాకా కెసిఆర్ పాదయాత్ర చేపట్టారు. తెలంగాణ రుచులను ప్రపంచానికి చాటేందుకు 2007 మార్చి 23న కెసిఆర్ తెలంగాణ సంబరాలు అనే అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు.. దీని తర్వాతే తెలంగాణ సంస్కృతి పట్ల అన్ని వైపులా నుంచి ఆదరణ పెరగడం మొదలుపెట్టింది. ఇలా ఎన్నో అలుపెరుగని పోరాటాలు చేయడం వల్లే తెలంగాణ కల సాకారం అయింది.