
CM Jagan: ప్రతి అంశంపై జగన్ ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తున్నారు. తనపై ఒంటికాలిపై ఎగిరిపడేందుకు ఎప్పుడు అలర్ట్‌గా ఉండే పచ్చ మీడియాను కూడా ట్రాప్ చేసినట్లు కనబడుతుంది. ఎన్నికల్లో గెలుపునకు మీడియా పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. ముందుగానే లీకేజీలు ఇచ్చి, దానిపై రాద్ధాంతం చేయించి ఆ తరువాత తనకు అనుకూల వాతావరణం సృష్టించుకోవడమే ప్రధాన ఎత్తుగడ. తనకు ఏ విధమైన మీడియా అండ లేదని ఇటీవల జగన్ అనడం ఇందులో భాగమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయనే పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్న జగన్ కు, పచ్చ మీడియా సంస్థలు తలనొప్పిగా తయారయ్యాయి. వ్యతిరేకతను ఏ పరిస్థితుల్లోను సహించని ఆయన, ఆయా మీడియా సంస్థల నోళ్లను కట్టేసేందుకు చేసిన ప్రయత్నాలు వర్కవుట్ అవడం లేదు. ఈ మధ్య కాలంలో రామోజీరావును వరుసగా టార్గెట్ చేస్తున్నారు. మార్గదర్శిపై బురద జల్లే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పలుమార్లు సీబీఐ రామోజీని ప్రశ్నించింది. ప్రభుత్వంపై అసమ్మతి పెరుగుతున్న నేపథ్యంలో, ఆ విధమైన వార్తలు ప్రజల్లోకి వెళ్లకూడదని ఆయన భావిస్తున్నట్లు కనబడుతున్నారు. ఆంధ్రజ్యోతి మాత్రం తనపని తాను చేసుకుపోతోంది.
వైసీపీ ప్రభుత్వం ముందస్తుకు వెళ్తున్నట్లు లీకేజీలు ఇవ్వడం కూడా జగన్ వ్యూహంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన ఆయన ప్రధాని మోడీ దగ్గర స్పష్టమైన హామీ తీసుకొని ముందస్తుకు రాబోతున్నట్లు మీడియా సంస్థలు కథనాలు వండివార్చుతున్నాయి. మంత్రి వర్గ విస్తరణ చేయబోతున్నట్లు ఇబ్బడిముబ్బడిగా వార్తలు వస్తున్నాయి. వీటన్నింటిని జగన్ పటాపంచలు చేస్తూ, తాను ఇప్పట్లో ఎన్నికలకు రాబోనని స్పష్టం చేశారు. తనపై బురద జల్లడమే కొన్ని మీడియా సంస్థలు పనిగా పెట్టుకున్నాయని, వాటిని నమ్మవద్దంటూ అంటున్నారు.

వీటన్నింటిన్ని క్రోడీకరించి మొత్తంగా జగన్ సెంటిమెంట్ పండిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో వ్యతిరేకత అంశాన్ని కప్పిపుచ్చేందుకు మైండ్ గేమ్ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇదే అంశం బాగా పనిచేసింది. తనను ఏకాకిని చేసి అందరూ దాడి చేస్తున్నారని, సింహం సింగిల్ గా వస్తుందనే ప్రకటనలు చేయడం ఇందులో భాగమేనని స్పష్టమవుతోంది. ప్రజలు అభివృద్ధి, సంక్షేమం కంటే భావోద్వేగాలను చూసి మనసు మార్చుకుంటారనే దానిపై జగన్ కు స్పష్టత ఉంది. రాబోవు ఎన్నికల్లో ఓట్లను విదిల్చే ప్రతి అంశం కీలకమే. ఆ మేరకు మీడియాతో పాటు ప్రజలు తన ట్రాప్ లో పడేయడటంలో జగన్ విజయం సాధిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.