
CM Jagan: ఏపీలో అసలు పాలన ఉందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పాలకులు ఏం పనిలేదన్నట్టు.. తమకు ప్రజలు ఏ బాధ్యతలు అప్పగించలేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థులపై కేసులు పెట్టడమో.. లేకుంటే తమ మెడకు చుట్టుకున్న కేసుల నుంచి బయటపడడానికి సమయమంతా కేటాయిస్తున్నారు. అసలు తమను ఏపీ ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారో కూడా తెలియనంతగా ప్రైవేటు వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. సీఎం నుంచి మంత్రులు దాకా ఒకటే పరిస్థితి. తమ శాఖల్లో లోటుపాట్లు, ప్రగతి గురించి మాట్లాడే మంత్రులు ఎంతమంది ఉన్నారు? అదే రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలకు మాత్రం ముందుంటున్నారు. వాటికి కేస్ స్టడీస్ తో పనిలేదు. నోటికి ఎంతొస్తే అంత మాట అనడం, వ్యక్తిగత విమర్శలకు దిగడం అలవాటు పనిగా మార్చుకున్నారు. సీఎం అయితే బటన్ నొక్కడం.. నిధులు లేకుంటే కామ్ గా తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితం కావడమో చేస్తున్నారు.
అన్నివర్గాల్లో అసంతృప్తి..
ప్రస్తుతం ఏపీలో ఒక్క వర్గమూ సంతృప్తిగా లేదు. సొంత పార్టీకి చెందిన సర్పంచ్ లు, కాంట్రాక్టర్లు.. ఇలా ఏవర్గం తీసుకున్నా నిరాశతోనే ఉంది. రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసింది. వందలాది మంది సలహాదారులు ఉన్నా వారు నెలనెలా వేతనాలు, అలవెన్సులు తీసుకునేందుకే పరిమితమవుతున్నారు. అసలు సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో దిక్కు తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాంట్రాక్టర్లు ప్రభుత్వ ఆఫీసుకు వచ్చి .. పనులు చేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నారు. సర్పంచ్‌లదీ అదే పరిస్థితి. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ తరుపున ఎందుకు సర్పంచ్ లం అయ్యామా అని తమ చెప్పుతో తామే కొట్టుకుంటున్నారు. సీఎం క్యాంపు ఆఫీసును నిషేధిత ప్రాంతాల జాబితాలో చేర్చారు. చివరకు ఎమ్మెల్యేలకు సైతం సీఎం అపాయింట్ మెంట్ దొరకనంతగా పాలనను కాస్ట్ లీ చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలేవీ?
అసలు రాష్ట్రం గురించి కానీ.. రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ చర్చ జరగడం లేదు. ప్రజల్లో ఆర్థిక అసమానతలు తొలగించడానికి సంక్షేమ పథకాల ద్వారా నగదు పంపిణీ చేస్తున్నామని అప్పటికీ…ఇప్పటికీ చెప్పుకొస్తున్నారు. సమాజంలో పది శాతం అమలుచేసి.. శతశాతం అమలుచేస్తున్నట్టు చెబుతున్నారు. అసలు రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రస్తావించేవారు కరువవుతున్నారు. వచ్చే పరిశ్రమలు.. రావాల్సిన పరిశ్రమలు… గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయల అభివృద్ధి వంటి వాటిపై చర్చ జరిగేది. కానీ ఇప్పుడు అసలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చే లేదు. టీడీపీ నేతలపై కేసులు.. మీడియాపై కేసులు… కుట్రలు.. తమపై కేసుల్ని ఎలా రక్షించుకోవాలా అన్న ఎజెండాతోనే ముందుకు సాగుతున్నారు. రాష్ట్రమన్న.. రాష్ట్ర ప్రయోజనాలన్నా పట్టించుకోకపోవడం ఏపీ ప్రజల దౌర్భాగ్యం.

చివరకు పార్టీని గాలికొదిలేసి..
ఒక వైపు ఇంటింటికీ వెళ్లి జగనన్న నువ్వే మా నమ్మకం, జగనన్న నీతోనే రాష్ట్ర భవిష్యత్ అని చెప్పండని పురమాయించారు. స్టిక్కర్లు అతికించి ప్రజల మనసులో నాకు గుడి కట్టేలా చేయించండి అంటూ శ్రేణులకు ఆదేశాలిచ్చారు. ఈ నెల 13 నుంచి జగనన్నకు చెప్పుకుందాం అనే కాల్ సెంటర్ ను ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. దాని గురించి కనీసం పట్టించుకోలేదు. అంతెందుకు గత రెండు రోజులుగా సాధారణ పాలనను సైతం గాలికొదిలేశారు. మంత్రులు, ముఖ్య నాయకులను సైతం పట్టించుకోలేదు. తన అస్మదీయులైన కట్టప్పలు, కట్టుబానిసలైన వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామక్రిష్ణారెడ్డి, కొత్తగా టీమ్ లో చేరిన చెవిరెడ్డి భాస్కరరెడ్డిలతో సుదీర్ఘంగా చర్యలు జరుపుతున్నారు. మధ్యలో స్వామిజీలు, జ్యోతిష్యం చెప్పేవారిని రప్పించి కొత్త కష్టాల నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు.