
మనం ఎంతో కష్టపడి పని చేసి సంపాదించిన సొమ్ముతో కొన్న వస్తువు దూరమైతే ఆ బాధ వర్ణానాతీతం. ఆ వస్తువు దొరికే వరకు మన మనస్సు ధ్యాస అంతా ఆ వస్తువుపైనే ఉంటుంది. ఆ వస్తువు దొరకకపోతే మాత్రం రోజులు గడిచినా ఆ వస్తువు జ్ఞాపకాలు మనల్ని వదలవు. చివరకు ఆ వస్తువు ఏదో ఒక విధంగా మనల్ని చేరితే మాత్రం ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిది. తాజాగా 20 ఏళ్ల క్రితం పొలంలో పడిపోయిన కమ్మలు చిక్కడంతో బామ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
కేరళలోని కాసర్‌గఢ్ జిల్లాలోని ఈడంపూడి గ్రామానికి చెందిన నారాయణి అనే బామ్మ 20 సంవత్సరాల క్రితం బియ్యం అమ్మితే వచ్చిన డబ్బుల ద్వారా చెవి కమ్మలను కొనుగోలు చేసింది. కష్టార్జితంతో కొనుక్కొన్న కమ్మలు కావడంతో వాటిపై మమకారం పెంచుకుంది. అయితే వరి పొలంలో పని చేసే సమయంలో ఊహించని విధంగా కమ్మలు పొలంలో పడిపోయాయి. ఆ కమ్మల కోసం ఎంతో సమయం వెతికి నారాయణి నిరాశతో ఇంటికి వెళ్లిపోయింది.
ఇష్టంతో కొనుగోలు చేసిన కమ్మలు మిస్ కావడంతో నారాయణి చాలా బాధ పడింది. 20 సంవత్సరాల తరువాత అదే పొలంలో మట్టిని తవ్వే సమయంలో బేబీకి రెండు కమ్మలు దొరికాయి. బేబీ ఆ కమ్మలు నారాయణి కూతురుకు చూపించగా ఆ కమ్మలు బామ్మవే అని నారాయణి కూతురు చెప్పింది. ఆ కమ్మలను కూతురు నారాయణికి అందించగా కష్టపడి సంపాదించిన సొమ్ము తన దగ్గరకు చేరడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. అప్పట్లో ఆ కమ్మల విలువ 4400 రూపాయలు కాగా ఇప్పుడు 40 వేల రూపాయలు కావడం గమనార్హం.