ఇది కరోనా కాలం. ఇదే చేస్తామని పట్టుబడితే కుదరదు. ఏ రంగంలో అయినా పట్టువిడుపులు ఉంటాయి. పరిస్థితులకు తగ్గట్టు మెట్టు దిగాలి. ఈ సూత్రం సినీ పరిశ్రమకు బాగా వర్తిస్తుంది. అందుకే తమ బొమ్మను థియేటర్లోనే చూపిస్తామని మడికట్టుకు కూర్చున్న దర్శక, నిర్మాతలు ఇప్పుడు బెట్టు విడుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలను ఒక్కొక్కటిగా ఓటీటీలో వదులుతున్నారు. మొన్నటిదాకా చిన్న సినిమాలు మాత్రమే ‘బుల్లి తెర’పై కనిపించగా.. ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా ఆ వరుసలో ఉన్నాయి. ఈ విషయంలో బాలీవుడ్ ఇప్పటికే ఓ అడుగు ముందుండగా టాలీవుడ్ ఇప్పుడిప్పుడే ఓటీటీల దిశగా అడుగు వేస్తోంది.
Also Read: కులాంతర ప్రేమకథతో అల్లు అరవింద్ ఫెయిల్ !
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, అదితి రావు హైదరి, నివేథా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వి’ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాత దిల్ రాజు దాదాపు 30 కోట్లకు అమెజాన్‌కు డిజిటల్ రైట్స్ అమ్మేశాడని సమాచారం. మరోవైపు అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ కూడా వచ్చే నెలలో ఓటీటీలో రిలీజ్ కానుందని సమాచారం. ఇది థియేటర్లో చూపించాల్సిన సినిమా అన్న నిర్మాతలు ఇప్పట్లో సినిమా హాళ్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో వెనక్కుతగ్గారు. ఈ మూవీని కూడా అమెజాన్ రూ. 25 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం.
Also Read: పూజా హెగ్డేకి 2 కోట్లు కావాలట !
రెండు పేరున్న, భారీ ప్రాజెక్టులు ఓటీటీల బాట పట్టడంతో ఇప్పటికే షూటింగ్స్ పూర్తి చేసుకున్న సినిమాలు కూడా అదే బాట పట్టక తప్పని పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో రామ్ హీరోగా నటించిన ‘రెడ్’ మూవీ కూడా ఓటీటీలో రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కిశోక్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య, స్రవంతి రవికిశోర్ నిర్మించారు. ఈ మూవీ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ పెద్ద ఆఫర్తో ముందుకొచ్చిందని సమాచారం. కానీ, హీరో రామ్, నిర్మాత రవికిశోర్ ఆ ఆఫర్ను తిరస్కరించారట. దానికి కారణం లేకపోలేదు. ‘రెడ్’ హిందీ డబ్బింగ్ రైట్స్, తెలుగు శాటిలైట్ రైట్స్‌తోనే పెట్టిన బడ్జెట్ రికవరీ అయింది. దాంతో, ఆర్థిక పరంగా నిర్మాతపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఇప్పటికే పెట్టుబడి మొత్తం తిరిగి రావడంతో థియేటర్లలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని హీరో రామ్ భావిస్తున్నాడని సమాచారం. సొంత ప్రొడక్షన్ హౌజ్ కావడంతో రిలీజ్ విషయంలో అస్సలు రాజీపడొద్దని అతను భావిస్తున్నాడు. అందుకే ‘రెడ్’ డిజిటల్ రిలీజ్‌కు రెడ్ సిగ్నల్ వేశాడట.