
Minister Malla Reddy: రాజకీయాల్లో ఉన్న నేతల ప్రసంగాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. వారు అటు ఇటు తిప్పి తమ సొంత డబ్బా కొట్టుకుంటారు. తాను కష్టపడి పైకి వచ్చానని చెబుతుంటారు. ఏ కష్టం చేశావని అడిగితే సరైన సమాధానం ఉండదు. కానీ చిన్న చిన్న పనులు చేసి అంత పెద్ద స్థాయికి రావడం వీలు కాదు. ఎందుకంటే ఎంత కష్టపడినా న్యాయంగా సంపాదించే వాడు అందలాలు ఎక్కిన సందర్బాలు లేవు. అదేదో మన లక్కు కలిసొస్తే తప్ప సాధ్యం కాదు. కానీ మన నేతలంతా మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పలు సందర్భాల్లో తాను పాలమ్మి ఈ స్టేజికి వచ్చానని ప్రతి సమావేశంలో చెప్పడం ఆయన నైజం. ఇంకా డ్యాన్సులు చేస్తూ కూడా తన జీవిత కథ వివరించడం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓ సభలో మంత్రి మల్లారెడ్డి తన ఎదుగుదల గురించి మరోమారు స్పీచ్ అందుకున్నాడు. తన కష్టమే ఇక్కడి వరకు తీసుకొచ్చిందని చెబుతూ వచ్చారు.
తనకు ఎవరి పైసా అక్కర్లేదు. తన దగ్గరే కావాల్సినంత డబ్బు ఉంది. అది కూడా న్యాయబద్ధంగా సంపాదించానని చెప్పడం అలవాటే. ఇది విన్న ఓ మహిళ మంత్రి మల్లారెడ్డికి ఫోన్ చేసి మీరు అంత డబ్బు సంపాదించడానికి ఏం చేశారు? అందులో రహస్యం ఏమిటో తనకు చెప్పాలని కోరింది. దీంతో ఆయన తన గత వీడియోలు చూడలేదా? అందులో అన్ని వివరంగా ఉన్నాయని ఫోన్ కట్ చేసినట్లు సమాచారం.

ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఎందుకలా ప్రశ్నించింది? మంత్రి నుంచి ఏం కోరుకుంటోంది? అనే వివరాలు తెలియడం లేదు. మొత్తానికి మంత్రి మల్లారెడ్డి మాటలకు ఘాటైన ప్రశ్న వేసి ఇరుకున పెట్టేసింది. తెలంగాణ ప్రజలందరు మీ బిడ్డలు కాదా? బిడ్డల దగ్గర రహస్యాలు ఉండొద్దు కదా అంటూ చురకలంటించింది. ఇలా మంత్రికి తనదైన శైలిలో ప్రశ్నలు వేసిన మహిళకు నిజంగా హాట్సాఫ్ అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వీరి మాటల ఆడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.