
Rajanagaram: పట్టుమని పదహారేళ్లు లేరు.. మూతి మీద సరిగ్గా మీసాలు కూడా రాలేదు. కానీ అమ్మాయిల కోసం అప్పుడే ఫైటింగులు మొదలుపెట్టారు. పట్టపగలు క్లాసురూములోనే కత్తితో దాడి చేసుకునేవరకూ వెళ్లింది. ఇంత చిన్న వయసులోనే ఇలా ప్రేమలు, కక్షలు నింపుకునేంతగా ఆ పసిమనుసులు ఎందుకు మారాయి? సినిమాల ప్రభావమా? లేక సమాజ ఆధునిక ధోరణినా తెలియదు కానీ పిల్లల్లో ఈ హింసాత్మక ధోరని ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది.
ప్రేమ వ్యవహారాలు ఈ మధ్య కాలంలో గాడి తప్పుతున్నాయి. ప్రేమ అంటూ ఒకరినొకరు ఇష్టపడడం.. తర్వాత అవసరాలు తీరిపోయాక దారుణాలకు తెగపడడం చూస్తున్నాం. అసలు ప్రేమంటే తెలియని వయసులో కొందరు ప్రేమ కోసం పిచ్చెక్కిపోతుంటారు. మరి కొందరు అదే ప్రేమ కోసం ఎంతటికైనా తెగించేందుకు సిద్ధపడుతుంటారు. అటువంటి ఘటన చోటుచేసుకుంది తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో. ఓ అమ్మాయి ప్రేమ కోసం తొమ్మిదో తరగతి విద్యార్థిపై కత్తితో దాడి చేసిన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది.
మారుతున్న కాలానికి అనుగుణంగానే ప్రేమ వ్యవహారాల్లోనూ మార్పు వచ్చింది. ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయికి ప్రేమ గురించి చెప్పడానికి రోజులు పట్టేది. ఇప్పుడు ఎప్పుడు చూస్తున్నారో.. ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియనంతగా వేగంగా వ్యవహారాలు నడిచిపోతున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో పిల్లలు కూడా ప్రేమ అంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆ ప్రేమ కోసం చిన్న వయసులోనే ఫైటింగ్ చేసేందుకు సిద్ధపడుతున్నారు. తెలిసీ తెలియని వయసులో పుట్టిన ప్రేమలతో.. ప్రాణాలను తీసేందుకు, అవసరమైతే ప్రాణాలను ఇచ్చేందుకు కూడా వెనుకడుగు వేయడం లేదు. గత కొంత కాలంగా ప్రేమ వల్ల హత్యలు పెరిగిపోయాయి. రాజానగరంలో జరిగిన ఘటన ఇంచుమించుగా అటువంటిదే కావడం గమనార్హం..
దాడికి యత్నించిన తొమ్మిదో తరగతి విద్యార్థి..
రాజానగరం జిల్లా పరిషత్ హై స్కూల్లో 9వ తరగతి చదివే ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాజా నగరానికి చెందిన లోడగల ఉదయ్ శంకర్ అనే విద్యార్థి.. అదే తరగతి చదువుతున్న తూర్పు గానుగూడెంకు చెందిన పింక్ హరి సాయి అనే విద్యార్థి పై దాడి చేశాడు. ఉపాధ్యాయులు అందరూ చూస్తుండగానే పరీక్ష హాల్లో కత్తితో హరి సాయిపై దాడికి పాల్పడ్డాడు ఉదయ్ శంకర్. ఈ ఊహించని ఘటనతో ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు హరి సాయి. రక్తపు మడుగులో ఉన్న హరి సాయిని వెంటనే రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఉపాధ్యాయులు.

ప్రేమ వ్యవహారమే వివాదానికి కారణంగా తేల్చిన పోలీసులు..
ఇద్దరూ మైనర్లు, పైగా చిన్న వయసు కుర్రాళ్ళు. హత్య చేసుకునే అంత తగువులు ఏముంటాయి అని అంతా ఆశ్చర్యపోయారు. ఈ విషయంపై పోలీసులకు ఉపాధ్యాయుల సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఉదయ శంకర్ ను అదుపులోకి తీసుకొని విచారణ సాగించారు. ఈ విచారణలో ఆసక్తికరమైన విషయం పోలీసులకు తెలిసింది. ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారమే వీరిద్దరి మధ్య వివాదానికి కారణమైందని తెలిసింది. వివాదం పెరిగి హత్య చేసే అంత స్థాయికి కక్ష గా మారిందని పొలీసులు ఈ సందర్భంగా గుర్తించారు. ఇకపోతే ప్రస్తుతం హరి సాయికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
పిల్లలపై దృష్టి సారించాల్సిన అవసరం..
ఈ తరహా ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో యుక్త వయసుకు వస్తున్న పిల్లలపై తల్లిదండ్రులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలను ఓ కంట కనిపెట్టకపోతే.. ఈ తరహా దారుణాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం పెరగడం, సామాజిక మాధ్యమాలు విపరీతంగా వినియోగిస్తుండడంతో.. పిల్లల్లో విపరీత ధోరణులు పెరుగుతున్నాయని, ఇది ఆందోళన కలిగించే అంశం అని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లలపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.