మనలో చాలామంది పెంపుడు జంతువులను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. కొందరు కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడితే మరికొందరు పిల్లులను పెంచుకుంటూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆ పెంపుడు జంతువులే మన ప్రాణాలు పోవడానికి కారణమవుతూ ఉంటాయి. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా తాజాగా పిల్లి నాకడం వల్ల 80 సంవత్సరాల బామ్మ మృతి చెందింది.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 80 ఏళ్ల బామ్మకు పిల్లులను పెంచుకోవడం అంటే మహా ఇష్టం. ఆ ఇష్టం వల్ల ఒక పిల్లిని పెంచుకుంటూ ఆ పిల్లికి మింటీ అనే పేరు పెట్టింది. అయితే మింటీ కొన్ని రోజుల క్రితం గోళ్లతో బామ్మను గీరింది. పిల్లి గీరిన భాగాన్ని బామ్మ అనుకోకుండా నాలుకతో నాకింది. కొన్ని రోజులపాటు బాగానే ఉన్న బామ్మ అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైంది.
బామ్మను ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం కోమాలోకి జారుకున్న బామ్మ చికిత్సకు కోలుకోలేక 9 రోజుల చికిత్స అనంతరం మృతి చెందింది. వైద్యులు పిల్లులు, కుక్కలు గీరిన సమయంలో వాటి లాలాజలంలోని బ్యాక్టీరియా శరీరంపై ఉంటుందని.. ఆ గాయాలను నాకితే శరీరంలోని రక్తంలోకి బ్యాక్టీరియా చేరి కోమాలోకి వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. కొన్ని నెలల క్రితం పెంపుడు కుక్క నాకడం వల్ల ఒక మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే.