Janasena And TDP- BRS: ఏపీలో రాజకీయ పునరేకీకరణ జరగనుందా? విపక్షాలన్నీ ఏకతాటిపైకి రానున్నాయా? మహా కూటమిగా ఏర్పడననున్నారా? కొత్తగా ఏపీలో ఎంటరైనా బీఆర్ఎస్ ను కలుపుకోనున్నారా? బలమైన అధికార పక్షానికి ఎదుర్కొవాలంటే సర్వశక్తులూ ఒడ్డాలని డిసైడ్ అయ్యారా? చంద్రబాబుతో పవన్ చర్చల సారాంశం ఇదేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు, పవన్ ల భేటీ అనంతరం ఇరువురి నేతల మాటల్లో ఇదే ధ్వనించిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోనివ్వనని చెబుతూ వస్తున్న పవన్.. అందుకు అవసరమైతే అందర్నీ కలుపుకొని ముందుకెళతానని చాలాసార్లు ప్రకటించారు. అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నారు. ఒక అడుగు ముందుకేసి చంద్రబాబును కలిశారు. అటు మిత్రపక్షం బీజేపీ హైకమాండ్ నేతలతో చర్చిస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ విషయంలో ఎలా ముందడుగు వేయాలని చంద్రబాబుతో చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి.

చంద్రబాబు, పవన్ లు మాట్లాడే క్రమంలో మహా కూటమి ప్రస్తావన వచ్చింది. ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ ను గద్దె దించేందుకు టీఆర్ఎస్, వామపక్షాలతో కలిసి మహా కూటమి ఏర్పాటుచేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. అటు తరువాత విభేదాలు రావండంతో విడిపోయామని చెప్పుకొచ్చారు. కానీ బీఆర్ఎస్ తో కలుస్తామని కానీ.. కలవబోమని కానీ చెప్పలేదు. అధికార వైసీపీ పక్షం మాదిరిగా వారికంతా సీన్ లేదని కానీ..ప్రజలను నమ్మరు అని కానీ చంద్రబాబు అనలేదు. పైగా ఎన్నికల వ్యూహాల్లో భాగంగా పొత్తులు ఉంటాయని చెప్పుకొచ్చారు. అటు పవన్ కూడా ఎక్కడా బీఆర్ఎస్, కేసీఆర్ గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. పైగా ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీని సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో జనసేన నేతల చేరికను కూడా పరోక్షంగా ప్రస్తావించారు. పార్టీలు అన్నాక చేరికలు ఉంటాయని లైట్ తీసుకున్నారు. ఎక్కడా నెగిటివ్ కామెంట్స్ కు తావివ్వలేదు.
ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీపై చంద్రబాబు, పవన్ లు స్పందిచకపోవడానికి చాలా కారణాలున్నాయి. ఈ ఏడాదిలో కానీ బీఆర్ఎస్ బలపడితే ఆ పార్టీని కలుపుకొని ముందుకెళ్లాలని చూస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ముందస్తుగానే జాగ్రత్తపడుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ జనసేన, టీడీపీ ఓటు బ్యాంకుపైనే ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ ఎంట్రీ జనసేనను బలహీనం చేసేందుకేనన్న టాక్ నడుస్తోంది. అటు కాపు నాయకులను చేర్చుకోవడం ద్వారా బలపడాలన్నది బీఆర్ఎస్ కాన్సెప్ట్. అటు జనసేనకు కాపు ఓటర్లే బలం. ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో జనసేనకు బలం ఎక్కువ అన్న అంచనాలున్నాయి. సరిగ్గా ఆ రెండు ప్రాంతాలపైనే బీఆర్ఎస్ దృష్టిపెట్టింది. ఈ ఏడాదిలోకానీ బీఆర్ఎస్ బలంగా చొచ్చుకుపోతే అది జనసేన, టీడీపీ కూటమిలపై ప్రభావం చూపుతుంది. అందుకే చంద్రబాబుతో పవన్ ప్రత్యేకంగా ఈ అంశంపైనే చర్చించినట్టు తెలుస్తోంది. అందుకే బీఆర్ఎస్ విషయంలో ఇరువురు నేతలు అచీతూచీ వ్యవహరించారు.

అదే సమయంలో పవన్ మరో అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ పెద్దలతో అంతా కులంకుశంగా మాట్లాడతానన్నారు. అయితే టీడీపీతో కలిసేందుకు బీజేపీ ముందుకు రావడం లేదు. చాన్స్ తక్కువ అన్నట్టు ప్రచారం సాగుతోంది. అటు జనసేనతోనూ బీజేపీ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోంది. అందుకే పవన్ బీఆర్ఎస్ విషయంలో సానుకూలంగా మారినట్టు వార్తలు వస్తున్నాయి. అటు ఓటు షేరింగ్ కూడా బీజేపీకి ఏపీలో అంతంతమాత్రమే. పైగా బీజేపీ వైసీపీకి సానుకూలంగా వ్యవహరిస్తుందన్న అనుమానం ఒకటుంది. అయితే ఇన్ని పరిణామాల మధ్య ఏపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోతున్నాయి.