BJP- TDP And Janasena: ఏపీ రాజకీయం తెలంగాణ నుంచి మొదలవుతుందా ?. తెలంగాణ గడ్డ పై పొడిచే పొత్తులు ఆంధ్రప్రదేశ్ కు చేరుకుంటాయా ?. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమని వినిపిస్తున్న వేళ.. బీజేపీ కూడ కూటమిలో చేరుతుందా ? అంటే తెలంగాణ రాజకీయ పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి.

ఒకవైపు తెలంగాణలో జనసేన, బీజేపీ పొత్తు కొనసాగుతోంది. మరోవైపు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన తెలంగాణ బీజేపీలో కనిపిస్తోంది. ఇటీవల తెలంగాణ బీజేపీ ఇన్చార్జీ తరుణ్ చుగ్ వ్యాఖ్యలు అందుకు బలం చేకూర్చుతున్నాయి. జనసేన,టీడీపీ, బీజేపీ త్రయం తెలంగాణలో ఎన్నికలకు వెళ్తే విజయావకాశాలు మెండుగా ఉంటాయనేది బీజేపీ నేతల విశ్లేషణ. హైదరాబాద్ నగరం, ఖమ్మం, నల్గొండలోని టీడీపీ ఓటు బ్యాంకుతో పాటు, పవన్ ఇమేజ్ కలిసొస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో పునర్వైభవం కోసం పనిచేస్తున్న టీడీపీ కూడ ఈ అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తోంది.
తెలంగాణలో బీజేపీ, జనసేన, టీడీపీల పొత్తు ఏర్పడితే.. అది ఏపీ ఎన్నికల వరకు కూడ కొనసాగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ, జనసేనల వల్ల బీజేపీ లాభం చేకూరితే, ఏపీలో బీజేపీ వల్ల టీడీపీ, జనసేనలకు లాభం చేకూరే అవకాశం ఉందనేది రాజకీయ వర్గాల అంచనా. పరస్పర సహకారం అవసరమైన నేపథ్యంలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశం పై మూడు పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

ఇప్పటికే ఏపీలో టీడీపీ, జనసేనల పొత్తు ఖాయమన్న సూచన కనిపిస్తోంది. బీజేపీని తెలంగాణ, ఏపీలో కలుపుకుపోవాలని టీడీపీ భావిస్తోంది. దానికి ప్రధాన కారణం బీజేపీ ఓటు బ్యాంకు కాదు.. కేంద్రంలో అధికారంలో ఉండటం. 2019 ఎన్నికల్లో బీజేపీ ఓట్ల పరంగా కంటే ఎన్నికల నిర్వహణలో టీడీపీని దెబ్బతీసింది. ఈ అనుభవాన్ని గుర్తించుకొనే టీడీపీ అధినేత బీజేపీతో పొత్తు కోసం పావులు కదుపుతున్నారు. మరోవైపు బీజేపీ ఏపీలో వైసీపీతో సఖ్యతగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ … టీడీపీ, జనసేన వైపు వెళ్తుందా ? లేదా అన్న అంశం పై సందిగ్ధత నెలకొంది. బీజేపీ తన స్వప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేసే అవకాశం ఉంది. తెలంగాణలో పొత్తు కుదిరితే ఏపీలోనూ ఆ పొత్తు కొనసాగించే అవకాశం ఉందనేది విశ్లేషకుల అంచనా.