CM Jagan: ఏపీ ప్రభుత్వ పబ్లిసిటీ పిచ్చి అంతా ఇంతా కాదు. గత మూడున్నరేళ్లుగా వందలాది కోట్ల రూపాయలను పబ్లిసిటీకి ఖర్చు చేసింది. అయితే ఇలా ఖర్చుపెట్టిన మొత్తంలో అత్యధికం జగన్ కుటుంబ ఖాతాల్లోకి వెళ్లింది. సాక్షి మీడియాకే సింహభాగం వెచ్చించారు. అటు పబ్లిసిటీతో పాటు దండిగా ఆదాయం సమకూర్చుకున్నారన్న మాట. తన చేతిలో అసలు మీడియా అనేదే లేదని.. మీరే నా బలం, బలగం అంటూ జగన్ ప్రజల మీద పడుతుంటారు. వారిని తన అదుపులో ఉంచుకోవాలని సెంటిమెంట్ అస్త్రం ప్రయోగిస్తుంటారు. ప్రజాధనాన్ని తన మీడియాకి అప్పనంగా కట్టబెడుతుండడాన్ని కప్పి పుచ్చుకునేందుకేనని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. అయినా బెదరకుండా నిస్సిగ్గుగా తన పని తాను కానిచ్చేస్తుంటారు.

అయితే తాజాగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి లెఫ్టనెంట్ గవర్నర్ గట్టి ఝలక్ ఇచ్చారు. ప్రజాధనంతో ప్రచారం చేసుకోవడమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రకటన ముసుగులో ఆప్ పార్టీ ప్రచారం చేసుకుంటున్నారని ..వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని.. ఆ మొత్తాన్ని తిరిగి కట్టాలని పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులిచ్చారు. ఢిల్లీ డైరెక్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ విభాగం పేరిట రూ.163 కోట్ల రికవరీకి నోటీసులు జారీచేశారు. ఈ ప్రకటన ఖర్చులు తక్షణం రికవరీ చేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లెఫ్టనెంట్ గవర్నర్ ఆదేశించారు. నగదు కట్టకుంటే తక్షణ చర్యలకు ఉపక్రమిస్తామని కూడా హెచ్చరించారు.
అయితే ఈ లెక్కన చూస్తే ఏపీలో జగన్ సర్కారు వేల కోట్లలో చెల్లించాల్సి ఉంటుంది. గత మూడున్నరేళ్లలో ప్రచారానికి ఖర్చుచేసినది అంతా ఇంతా కాదు. బటన్ నొక్కిన ప్రతిసారి మీడియాకు పతాక శీర్షికల్లో ప్రకటనలు ఇవ్వడం ఏపీ ప్రభుత్వానికి ఆనవాయితీ. పథకాలు ప్రవేశపెట్టినా, సభలు, సమావేశాలు ఏర్పాటుచేసిన సాక్షికి బోలెడంత ఆదాయమే. ఒక్క జగన్ మీడియాకే వందల కోట్లను ప్రచార రూపంలో కట్టబెట్టేశారు. ప్రభుత్వ ప్రచారానికి ఖర్చుచేసిన ప్రతీ పైసా.. వైసీపీ కోసమే అన్నట్టుగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతీ ప్రకటన వైసీపీ రంగునే పోలి ఉంటుంది. విపక్షాలపై విమర్శలు.. తప్పుడు ఆరోపణల్లా యాడ్స్ ఉంటాయి. గత ప్రభుత్వం.. ఇప్పటి ప్రభుత్వమని అందులో సరిపోల్చుతుంటారు. గతంలో ఉన్నది ప్రజా ప్రభుత్వమేనని ఒప్పుకోరు.

అటు ప్రభుత్వం తరుపున ఏర్పాటుచేసే బహిరంగ సభలు ఎన్నికల సమావేశాల మాదిరిగా ట్రీట్ చేస్తారు. మరోసారి తనను ఎన్నుకోవాలని కోరడంతో పాటు రాజకీయ విమర్శలు చేస్తారు. ఈ లెక్కన వైసీపీ నుంచి వేల కోట్ల రూపాయలు రికవరీ చేయాల్సి ఉంటుంది. అయితే ఒకటి మాత్రం చెప్పగలం. ప్రభుత్వాల ప్రచార ఆర్భాటానికి ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ ఇచ్చిన నోటీసు చెంపపెట్టు వంటిది. ఈ నోటీసులు ఆధారంగా భవిష్యత్ లోనైనా జగన్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది.