Wife killing her husband : మేఘాలయ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దానిని మర్చిపోకముందే నాగర్ కర్నూలు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. దీనిని మర్చిపోకముందే ఉమ్మడి అనంతపురం జిల్లాలో మరో కిరాతకం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దారుణాలు. అయితే ఈ ఘటనలలో భర్తలు అంతమయ్యారు. భార్యలు అంతం చేశారు. ప్రియుళ్ల మోజులో పడి.. సంసార జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నారు. చివరికి పాపం పండి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇంతటి దారుణాలు జరుగుతున్నప్పటికీ.. కనివిని ఎరగని స్థాయిలో ఘోరాలు చోటుచేసుకుంటున్నప్పటికీ కొంతమంది భార్యలు మారడం లేదు. పైగా అంతకుమించి అనే స్థాయిలో దారుణాలకు పాల్పడుతున్నారు. సినిమాలను మించి ప్లాన్లు చేస్తూ.. పోలీసులకు సైతం చెమటలు పట్టిస్తున్నారు.
సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య..
యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం.కాటేపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో స్వామి అనే వ్యక్తి మృతి బైక్ పై వెళ్తున్న స్వామిని ఢీ కొట్టి కారు.
అయితే.. రోడ్డు ప్రమాదం ఘటన విచారణలో బయటపడ్డ అసలు నిజం.
కారుని రెంట్ కు తీసుకుని భార్యే స్వామిని… pic.twitter.com/akXSVYBEao— ChotaNews App (@ChotaNewsApp) July 15, 2025
మేఘాలయ తరహా లోనే తెలంగాణ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఈ ఘటనను స్థానికులు రోడ్డు ప్రమాదం అనుకున్నారు. పోలీసులు కూడా అదే భావించారు. రోడ్డు ప్రమాదం గానే కేసు నమోదు చేశారు. చివరికి వివాహేతర సంబంధం వల్ల జరిగిన దారుణమని పోలీసుల విచారణలో తేలింది. యాదాద్రి భువనగిరి జిల్లా కాటేపల్లి లో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుమీద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని స్వామి అని పోలీసులు గుర్తించారు. ప్రారంభంలో దీనిని రోడ్డు ప్రమాదమనే పోలీసులు భావించారు. సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేశారు.
కేసు విచారణలో మృతుడి భార్య తీరు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో ఆమె ఫోన్ కాల్ డాటాను పోలీసులు సేకరించారు. విచారణను ముమ్మరం చేశారు. స్వామి చనిపోయేంతవరకు అతని భార్య ఒక నెంబర్ లో గంటల తరబడి ఫోన్ మాట్లాడింది. ఆ నెంబర్ ను పోలీసులు ఎంక్వయిరీ చేయగా.. అది ఆమె ప్రియుడిదని తేలింది. అంతేకాదు ఆమె తన తమ్ముడితో కూడా మాట్లాడింది. దీంతో పోలీసులకు మరో అనుమానం మొదలై విచారణ మొదలుపెట్టారు. దీంతో వారి విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్వామి భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో భర్త అడ్డు తొలగించుకుంటే అతనితో సంతోషంగా ఉండవచ్చని ఆమె భావించింది. ఇందులో భాగంగానే స్వామిని అంతం చేయడానికి ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రణాళికలో స్వామి భార్యకు ఆమె సొంత సోదరుడు కూడా సహాయం చేశాడు. కారును కిరాయికి తీసుకొని స్వామి వెళ్తున్న రూట్లో వెళ్లారు. స్వామి రైట్ రూట్ లోనే వెళుతున్నప్పటికీ.. కారును అత్యంత వేగంగా రాంగ్ రూట్లో డ్రైవ్ చేసి స్వామిని ఢీ కొట్టారు. కారు ఢీకొట్టిన వెంటనే పలుమార్లు అతని మీద నుంచి పోనిచ్చారు. దీంతో స్వామి అక్కడికక్కడే చనిపోయాడు. అయితే స్వామి భార్య, ఆమె సోదరుడు, మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది.