
Rushikonda Green Mat: నవ్విపోదురుగాక..నాకేంటి సిగ్గు అన్నట్టుంది వైసీపీ సర్కారు నిర్వాకం. తాను ఏది చేసినా ఒప్పు అన్నట్టుంది ప్రభుత్వ వ్యవహార శైలి. విశాఖకే తలమానికంగా ఉన్న రిషికొండను అడ్డగోలుగా తవ్వేసిన ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేస్తోంది. ఇంటా బయటా విమర్శలు వ్యక్తమయ్యేసరికి బుకాయింపు పర్వానికి దిగుతోంది. రిషికొండపై గ్రీన్ మ్యాట్ వేసి అదేదో లోక కళ్యాణానికి అన్నట్టు చూపే ప్రయత్నం చేస్తోంది. అనుకూల మీడియాలో ప్రచారం కూడా మొదలుపెట్టేసింది. అది గ్రీన్ మ్యాట్ కాదు.. జియో మ్యాట్ అంటూ కొత్త పల్లవి అందుకుంది. అసలు అక్కడ నిబంధనలేవీ అధిగమించలేదని.. పద్ధతి ప్రకారం అన్నీ చేస్తున్నట్టు చెప్పే ప్రయత్నాలు ప్రారంభించింది.
విశాఖకు మణిదీపం రుషికొండ. బీచ్ ఒడ్డున ఉండే ఈ కొండ పర్యాటక ప్రాంతం. సాగరనగరానికి ఒక ల్యాండ్ మార్కు. పచ్చటి తివాచీ పరిచినట్టు ఉంటుంది. రిసార్ట్స్ తో పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. విశాఖ వచ్చే పర్యాటకులు ఎక్కువ మంది రుషికొండను సందర్శిస్తే కానీ వెళ్లరు. అటువంటి రుషికొండను అడ్డగోలుగా తవ్వేశారు. ఆనవాళ్లు లేకుండా చేశారు. రిసార్ట్స్ ను కూలగొట్టి నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే అనుమతులకు మించి తవ్వకాలు చేపడుతున్నారని న్యాయస్థానాల్లో పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఐదుగురు పర్యావరణ అధికారులతో కమిటీకి ఆదేశించింది. పర్యావరణ, అటవీశాఖలకు సమగ్ర సర్వేకు ఆదేశాలిచ్చింది. అక్రమ తవ్వకాల విషయం నిగ్గుతేల్చాలని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో రిషికొండపై పచ్చటి మ్యాట్ వేసి కవర్ చేసే పనిలో పడింది జగన్ సర్కారు. దీనిపై విపక్షాలు, ప్రజాసంఘాలు, పర్యావరణ పరిరక్షణ సంస్థలు విమర్శల దాడి ప్రారంభించేసరికి మల్లగుల్లాలు పడుతోంది. రుషికొండపై కొన్ని చోట్ల పరిచింది గ్రీన్ మ్యాట్స్ కాదని, అక్కడ మట్టిలో ఉన్న ఖనిజ లవణాలు వెళ్లిపోకుండా ఈ జియో మ్యాటింగ్ సహాయపడతాయని, అందుకే ఈ మ్యాటింగ్ పరచాల్సిన అవసరం ఏర్పడిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక కొన్నిరోజుల్లో మిగతా స్థలంలో కూడా ఈ జియో మ్యాటింగ్ పరుస్తామని కూడా అధికారులు తెలిపారు. రుషికొండ పరిరక్షణ కోసమే ఇదంతా చేస్తున్నామని అధికార యంత్రాంగం చెబుతోంది.

ఏదైనా స్థలంలో తవ్వకాలు జరిపినప్పుడు ఆ మట్టిలో ఉండే ఖనిజ లవణాలు చేజారిపోకుండా జియో మ్యాట్ పరుస్తారని.. అందులో భాగంగా పరిచిందే తప్ప.. అందులో ఉద్దేశపూర్వకంగా ఏదీ చేయలేదని.. అసలు అక్కడ తప్పు అనేది ఏదీ జరగలేదని చెప్పుకురావడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపైనే పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. వైసీపీ సర్కారు అతి తెలివితేటలను నెటిజెన్లు మండిపడుతున్నారు, తాటి చెట్టు ఎక్కావు? ఎందుకంటే పశువుల మేత కోసం అన్నట్టు బాగనే కవర్ చేస్తున్నారని సటైర్లు వేస్తున్నారు. రిషికొండను ఎందుకు తవ్వారంటే ఖనిజ సంపదనకు కాపాడడానికి అన్నట్టుంది ప్రభుత్వ వ్యహారమని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికైతే సాగర నగరంలో రిషికొండ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మ్యాట్స్ వేసి వైసీపీ సర్కారు మరోసారి తన పరువును తానే తీసుకుంది.