
Nischalananda Saraswati: భారతదేశంలో కులాల పుట్టుకు ఈనాటిది కాదు. వేల ఏళ్లక్రితం నాటిది. మనుషుల అవసరాల కోసం ఈ కులవ్యవస్థ పుట్టింది. కాలక్రమేణా అది వివిధ రూపాలు మార్చుకుని భారతదేశ ఆత్మగా మారిపోయింది. దీనిని తొలగించ సాధ్యంకానంత బలంగా వేళ్లూనుకుంది. దేవుడు కులవ్యవస్థను సృష్టించలేదన్నది జగమెరిగిన సత్యం. దేవుడి పేరు మీద మనుషులే సృష్టించారన్నది వాస్తవం. ఇప్పుడు కులవ్యవస్థ పుట్టుక పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
కుల వ్యవస్థ పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కులవ్యవస్థను దేవుడు సృష్టించలేదని, పండితులే సృష్టించారని తేల్చిచెప్పారు. గతంలో కూడా మోహన్ భాగవత్ ఇదే విధంగా కామెంట్ చేశారు. ఈనాటి సమాజంలో కులం, వర్ణాలను పాటించాల్సిన అవసరంలేదని హితవు పలికారు. అదొక ప్రాచీన ఆలోచనా విధానమని కూడా చెప్పారు. అయితే మోహన్ భగవత్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సర్వస్వతి ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యల పై నిశ్చలానంద సరస్వతి అభ్యంతరం వ్యక్తం చేశారు.
చత్తీస్ఘడ్ లోని జగదల్ పూర్ జిల్లాలో జరిగిన మతపరమైన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ వ్యాఖ్యల పై స్పందించారు. వర్ణవ్యవస్థ బ్రాహ్మణులు ఇచ్చిన వరమని చెప్పారు. మొదటి బ్రాహ్మణుడి పేరు బ్రహ్మ అని చెప్పారు. గ్రంధాలను అధ్యయనం చేయాలని సూచించారు. శాస్త్రాలు, కళలు బ్రాహ్మణుల ద్వారే వివరించబడ్డాయని తెలిపారు. విద్య, రక్షణ, ఇతర సేవలు ఎప్పుడూ సమానంగా ఉండాలని చెప్పారు. సనాతన వ్యవస్థను అంగీకరించకపోతే, ఇక ఏ వ్యవస్థ ఉండాలి ? అంటూ ఆర్ఎస్ఎస్ ను ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ కు పుస్తక జ్ఞానం లేదని విమర్శించారు.
భారతదేశంలోని ప్రజలు నేటికీ బ్రాహ్మణుల వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరించుకుంటారని తెలిపారు. ప్రపంచ సమస్యలు, ఐక్యరాజ్యసమితి సమస్యలు కూడా బ్రాహ్మణుల వద్దకు వస్తే పరిష్కారం అవుతాయని తెలిపారు. అమెరికా లాంటి దేశాలలో కూడా వర్ణవ్యవస్థలేదని, అలాంటి దేశాల్లో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర కులాలకు ప్రత్యామ్నాయం సృష్టించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యల పై నిశ్చలానంద సరస్వతి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయని చెప్పవచ్చు.

ఆర్ఎస్ఎస్ హిందూమతోద్ధారణకు పుట్టిన సంస్థగా చెబుతారు. ఆర్ఎస్ఎస్ కు ఎన్నో అనుబంధ సంఘాలు ఉన్నాయి. బీజేపీ మాతృసంస్థ కూడా ఆర్ఎస్ఎస్సే. అలాంటి ఆర్ఎస్ఎస్ పై ఈ స్థాయిలో విరుచుకుపడటం ఆశ్చర్యం కలుగక మానదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యల వెనుక మరో అర్థం ఉంది. కులవ్యవస్థ కారణంగా హిందూమతం రోజురోజుకు కుచించుకుపోతోంది. దళిత వర్గాలు క్రిస్టియానిటీని స్వీకరిస్తున్నాయి. ఈ వలసలను ఆపాలనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ చీఫ్ కుల వ్యవస్థ పై వ్యాఖ్యానించారని చెప్పవచ్చు. కులవ్యవస్థ అమలుతో హిందూమతంలో సార్వజనీన భావన ఉండదు. తద్వార హిందూ మత పునాదులు దెబ్బతింటాయి.