
Donkey And Camel Milk: పాలు అనగానే మనకు ఆవు, గేదె పాలు మాత్రమే గురొ‍్తస్తాయి. కానీ ఈ మధ్య గాడిద, ఒంటె, గుర్రం పాలు కూడా ప్రాచుర‍్యం పొందుతున్నాయి. అయితే గేదె, ఆవు పాలలా వీటిని ఉపయోగించలేం. నేరుగా ఆవులు, గేదెల నుంచి పితికి తెచ్చి విక్రయించే వారి దగ్గర కొనే పాలకు ఎక్కువగా ఆప్షన్లు ఉండవు. ప్యాకెట్ పాలు అయితే టోన్డ్, డబుల్ టోన్డ్, ఫుల్ క్రీమ్ ఇలా రకరకాల ఆప్షన్లు ఉంటాయి. ఎన్ని ఆప్షన్లు ఉన్నా విరివిగా దొరికే పాలలో ప్రధాన రకాలు ఆవు, గేదె పాలే. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. గాడిద, ఒంటె, మేక పాలు కూడా ఈ రెండింటి సరసన చేరుతున్నాయి. ఆవు, గేదె పాల స్థానాన్ని ఆక్రమించే పరిస్థితి ఇంకా లేకపోయినా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే సదుపాయం రావడంతో కొన్ని ఇతర జంతువుల పాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో వీటికి డిమాండ్ పెరుగుతోంది. చిన్నపిల్లలకు ఈ పాలు పడితే మంచిదంటూ చాలామంది కొనుగోలు చేస్తున్నారు. ఇక ఒంటె పాల విషయానికొస్తే తెలుగు రాష్ట్రాలలో లేనప్పటికీ రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలలో ఒంటె పాల వినియోగం ఉంది. అమూల్ వంటి సంస్థలు వీటిని బాటిళ్లలో నింపి ఆన్‌లైన్‌లోనూ అమ్ముతుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని నగర ప్రాంతాల్లో దొరుకుతున్నాయి. ఇక ఢిల్లీ వంటి ప్రాంతాలలో మేక పాలను ఆన్‌లైన్లో విక్రయించే సంస్థలు ఉన్నాయి. మేక పాలు కూడా కొత్తదేమీ కాదు. దేశంలోని అనేక ప్రాంతాలు, వివిధ కులాలలో మేకపాలను విరివిగా వినియోగించే అలవాటు ఉంది. తెలుగు రాష్ట్రాలలోనూ మేక పాల వినియోగం ఉంది. మహాత్మాగాంధీ కూడా తాను మేక పాలు తాగినట్లు తన ఆత్మకథలో రాసుకున్నారు.
పాలలో ఏం ఉంటుంది?
పాలలో ప్రధానంగా మాంసకృత్తులు ఉంటాయి. పాస్ఫరస్, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ బీ2( రిబోఫ్లెవిన్), విటమిన్ బీ12, పొటాషియం, జింక్, కోలిన్, మెగ్నీషియం, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. మాంసకృత్తులు ఉండడంతో కండర నిర్మాణానికి, కాల్షియం ఉండడంతో ఎముకల పటిష్టతకు మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. ఏ పాలు ఎందుకు వాడతారో, వినియోగం ఎక్కడ ఎక్కువగా ఉందో తెలుసుకుందాం..
మేక పాలు..
మేక పాలు – ఆవుపాలు పడని వారికి ప్రత్యామ్నాయం. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో మేక పాల వినియోగం ఉంది. భారత్, అమెరికా కేంద్రంగా పనిచేసే మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘గ్రాండ్ వ్యూ రీసెర్చ్’ నివేదిక ప్రకారం.. 2022లో ప్రపంచ వ్యాప్తంగా మేక పాల మార్కెట్ విలువ 12.45 బిలియన్ డాలర్లు(సుమారు రూ. లక్ష కోట్లు). ఆవు, గేదె పాల కంటే మేక పాలలో లాక్టోజ్ తక్కువగా ఉండడంతె ఇది సులభంగా జీర్ణమవుతుందని, లాక్టోజ్ అరిగించుకోలేని వాళ్లు మేక పాలు వినియోగిస్తుంటారని ఈ నివేదిక పేర్కొంది. ఇక ప్రపంచంలోని మేక పాల వినియోగంలో నేరుగా వినియోగం 63.7 శాతం ఉంటే చీజ్, పెరుగు, ఇతర ఉత్పత్తుల రూపంలో సుమారు 36 శాతం వినియోగం ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, తుర్కియే, అమెరికా, కెనడా, మెక్సికో, జర్మనీ, యూకే, ఇటలీ, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా తదితర దేశాలలో మేక పాల వినియోగం ఉన్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మేక పాల వ్యాపారంలో అత్యధికంగా ఆసియా పసిఫిక్ దేశాలలోనే 52.7 శాతం రెవెన్యూ వస్తున్నట్లు పేర్కొన్నారు.
గాడిద పాలు..
ఇక గాడిదపాలు ఔషధంగా పనిచేస్తాయన్న ప్రచారం ఉంది. అందం పెంచుతాయని మహిళలు నమ్ముతారు. ‘గ్రాండ్ వ్యూ రీసెర్చ్’ మార్కెట్ అధ్యయనం ప్రకారం.. 2021లో ప్రపంచవ్యాప్తంగా 23.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.190 కోట్లు) మేర గాడిద పాలు, పాల ఉత్పత్తుల వ్యాపారం జరిగింది. ముఖ్యంగా బ్రిటన్, జర్మనీ వంటి యూరప్ దేశాల్లో గాడిద పాల ఉత్పత్తుల వినియోగం అధికంగా ఉందని ఈ నివేదిక పేర్కొంది. గాడిద పాల పొడి, గాడిద పాలతో చేసిన సబ్బులు, క్రీములు వంటి చర్మ సౌందర్య ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరగడంతో వినియోగం పెరిగి గాడిద పాలకు డిమాండ్ పెరిగినట్లు ఈ నివేదిక పేర్కొంది. 2022-28 మధ్య వార్షిక వృద్ధి రేటు 9.9 శాతం ఉండొచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. అయితే, ప్రపంచ మార్కెట్లో 65 శాతం గాడిద పాలు పొడి రూపంలోనే విక్రయమవుతోంది. మేక పాలలో ఉన్నట్లే లాగే ఇందులోనూ లాక్టోజ్ తక్కువగా ఉండడం వల్ల ఆవు, గేదె పాలను అరిగించుకోలేని సమస్య ఉన్నవారికి ఇది మంచిదని అధ్యయనాలు చెప్తున్నాయి. గాడిద పాలలో సూక్ష్మజీవులు తక్కువగా ఉండడం వల్ల మిగతా పాల కంటే ఇది ఎక్కువ నిల్వ ఉంటుంది. ప్రాచీన కాలంలో గ్రీకులు పిల్లలకు గాడిద పాలు పట్టేవారని, రోమన్లు గాడిద పాలను సౌందర్య సాధనంగా వాడేవారని చరిత్ర చెప్తోంది. క్లియోపాత్రా తన అందం పెంచుకోవడానికి గాడిద పాలలో స్నానం చేసేవారనీ చెప్తారు.
ఒంటె పాలు..
ఒంటె పాలు.. ఇటీవల వీటి వినియోగం కూడా పెరుగుతోంది. ఈ పాలలో రోగాలను నయం చేసే శక్తి ఉందని నమ్ముతారు. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఒంటె పాలలో సుమారు 3 శాతం కొవ్వు పదార్థాలు ఉంటాయి. అయితే, ప్రాంతం బట్టి ఈ శాతం మారుతుంది. మిగతా జంతువుల పాలతో పోల్చితే ఒంటె పాలలో షుగర్, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి. ఇందులో పొటాషియం, ఐరన్, కాపర్, మెగ్నీషియం, విటమిన్ సి, కాల్షియం వంటి ఖనిజాలతో పాటు ఏ, బీ, సీ, డీ, ఈ, విటమిన్లు ఉంటాయి. కాల్షియం, కేలియం కూడా ఉంటాయి. డాటా బ్రిడ్జ్ మార్కెట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా ఒంటె పాల మార్కెట్ 6.64 బిలియన్ డాలర్లు(సుమారు రూ.54 వేల కోట్లు). పాశ్చురైజ్ చేసిన పాలు, ఫ్లేవర్డ్ మిల్క్, చీజ్‌తో పాటు ఇన్ఫాంట్ ఫార్ములా రూపంలోనూ ఒంటె పాలు ప్రపంచవ్యాప్తంగా విక్రయమవుతోంది. అమెరికా, కెనడా, మెక్సికో, జర్మనీ, స్వీడన్, పోలాండ్, డెన్మార్క్, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ సహా ఇతర అనేక యూరప్ దేశాలు.. ఆసియాలో చైనా, జపాన్, భారత్, దక్షిణ కొరియా సహా ఇతర దేశాలు.. అరబ్ దేశాలు, లాటిన్ అమెరికా దేశాలలోనూ ఒంటె పాలకు గిరాకీ పెరుగుతోందని డాటా బ్రిడ్జ్ మార్కెట్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది.
ఆటిజం నివారిస్తుందని..
ఆటిజంతో బాధపడేవారికి ఒంటె పాలు మంచిదని, డయాబెటిస్ రోగులకూ ఒంటె పాలు మంచిదని చెప్తున్నప్పటికీ శాస్త్రీయంగా దీన్ని పూర్తిగా బలపరిచే ఆధారాలు ఇంకా లభించలేదు. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్న ఓ బాలుడి తల్లి సహా మరికొందరు ఆటిజం చిన్నారుల తల్లులు, ఒంటె పాలు తాగించడం వల్ల తమ ఆటిజం పిల్లలలో కొంత మెరుగుదల కనిపించిందని చెప్పినట్లు నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అనుబంధ ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసన్’లో వారి అనుభవాలను పొందుపరిచారు.
మధుమేహం నియంత్రణ..
మధుమేహ రోగులలో బ్లడ్ సుగర్ మోతాదు ఒంటె పాల వల్ల తగ్గినట్లు కొన్ని అధ్యయనాలు సూచించాయి. అయితే, ఇందులో ఎక్కువగా టైప్ 1 డయాబెటిస్ రోగులపైనే అధ్యయనాలు జరిగాయి. దీనిపైనా మరింత లోతైన, సమగ్రమైన అధ్యయనాలు జరగాల్సి ఉంది.

గుర్రం పాలు..
గుర్రం పాలలో బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గించే గుణం ఉందని ప్రచారంలో ఉంది. యూరప్‌లోని కొన్ని ప్రాంతాలలో, మధ్య ఆసియాలోనూ గుర్రం పాల వినియోగం ఉంది. ఇతర జంతువుల పాల కంటే ఇది జీర్ణకారి అని చెప్తారు. కజక్‌స్థాన్, కిర్గిజిస్థాన్, అజర్‌బైజాన్, అర్మేనియా ప్రాంతాలలో ఈ పాల వినియోగం ఎక్కువగా ఉంది. కజక్‌స్థాన్‌లోని నజర్‌బయేవ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు గుర్రం పాలపై అధ్యయనం చేశారు. ‘ఫంక్షనల్ ఫుడ్స్ ఇన్ హెల్త్ అండ డిసీజ్’ మ్యాగజీన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయన పత్రంలో వారు గుర్రం పాలలో అల్బూమిన్ అధికంగా ఉండడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంచేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. గుర్రంపాలలోని లైసోజైమ్, లాక్టోఫెర్రిన్‌ల కారణంగా జీర్ణవ్యవస్థకు మంచిదని ఈ అధ్యయనం సూచించింది. రొమ్ము క్యాన్సర్ వంటివి నివారించే లక్షణం ఉందని ఈ అధ్యయనం సూచించింది.