NTR Fans : ఎన్టీఆర్ కోసం అభిమానుల సంచలన పిలుపు..

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూనియర్ కు ఆహ్వానం లేకపోవడంపై ఆయన అభిమానులు హర్ట్ అయ్యారు. కావాలనే పక్కన పెట్టారని ఆరోపిస్తున్నారు.

Written By: Dharma, Updated On : April 29, 2023 10:28 am
Follow us on

NTR Fans : తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ కాక మరోసారి రేగింది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూనియర్ కు ఆహ్వానం లేకపోవడంపై ఆయన అభిమానులు హర్ట్ అయ్యారు. కావాలనే పక్కన పెట్టారని ఆరోపిస్తున్నారు. కుటుంబమంతా జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టడంపై కలత చెందారు. తమ నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబుతో పాటు బాలక్రిష్ణకు తమ నిరసన సెగ చూపించారు. టీడీపీ వ్యవస్థాపకుడు , మాజీ సీఎం ఎన్టీ రామారావు శతజయంతి వేడుకలు విజయవాడలో నిర్వహించారు. ముగింపు వేడుకలకు సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. చంద్రబాబు, బాలక్రిష్ణతో పాటు టీడీపీ నాయకులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు.

జూనియర్ కు అందని ఆహ్వానం..
అయితే జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాకపోవడంతో కలకలం చోటుచేసుకుంది. ఆయన అభిమానులు ఫొటోలు, పోస్టర్లతో సమావేశంలో హల్ చల్ చేశారు.తొలుత ఆహ్వాన పత్రికల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరును చేర్చారని.. కానీ కృష్ణా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు కలుగజేసుకోవడంతో తొలగించారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. తమ హీరోకు మరోసారి అవమానం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎంతగానో అభిమానించే నటుడు ఎప్పటికీ తమ గుండెల్లో ఉంటారని, ఆయనకు ఇలాంటి ఆహ్వానాలు అక్కర్లేదని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్‌ను దూరంగా ఉంచినంత మాత్రాన తాము నిరాశకు గురి కావాల్సిన పని లేదని అన్నారు. తాము ఎప్పటికీ నందమూరి కుటుంబ అభిమానులమేనని, ఎవరికి వారు తమ ప్రాంతాల్లో సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు.

రజనీ కీలక ప్రసంగం..
కాగా వేడుకలకు హాజరైన సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక ప్రసంగం చేశారు. ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సినీ,రాజకీయ రంగాలను శాసించిన ఓన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ అంటూ కీర్తించారు. ఆయన కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. చంద్రబాబుతో తనకు మూడు దశాబ్దాల స్నేహం ఉందని చెప్పారు. విజన్ ఉన్న నాయకుడిగా కొనియాడారు. ఆయన విజన్ ఫలితాలను నేడు ప్రపంచం చూస్తుందని అభినందించారు. హైదరాబాద్ రూపురేఖలు మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని కొనియాడారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలవాలని.. ఆయన గెలిస్తే ఏపీ రూపురేఖలు మారిపోతాయని చెప్పారు.

ఫ్యాన్స్ కీలక నిర్ణయం
అయితే తమ అభిమాన నాయకుడికి ఆహ్వానం లేకున్నా.. వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి చేశారు. జూనియర్ ఫొటోలతో ముద్రించిన జెండాలతో హల్ చల్ చేశారు. . స్టేజీ ఎదురుగా జూనియర్ ఎన్టీఆర్ జెండా, ఫోటోలను ప్రదర్శించారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాల చేశారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ఆయన మనవడు, తమ అభిమాన నటుడిని పిలవకపోవడం పట్ల అభిమానులందరూ తీవ్ర నిరాశలో ఉన్నారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు నున్న గణేష్, కావూరి కృష్ణ అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కార్యక్రమం ఓ రాజకీయ సదస్సుగా భావిస్తోన్నామని వ్యాఖ్యానించారు. ఊరూ వాడా ఘనంగా నిర్వహించాలని ఓ ప్రకటన విడుదల పిలుపునిచ్చారు. మొత్తానికైతే తెలుగుదేశంలో మరోసారి రచ్చకు జూనియర్ ఎన్టీఆర్ కారణమయ్యారు.