
LSG Vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16వ ఎడిషన్లో ప్రతి మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. అన్ని జట్లు బలంగా కనిపిస్తున్నాయి. ఏ జట్టు ఎప్పుడు ఏ జట్టును ఓడిస్తుందో కూడా తెలియని పరిస్థితి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడిన మొదటి మ్యాచ్ లో ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో తాజాగా మరో ముగ్గురు ప్లేయర్లు చేరుతున్నారు. తొలి మ్యాచ్ ల్లో ఓటమి పాలైన హైదరాబాద్ జట్టు ఆ ముగ్గురి ప్లేయర్ల రాకతో విజయాల బాట పడుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.
ఐపీఎల్ లో ఘోర ఓటమితో ఈ సీజన్ ను ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో కీలక మ్యాచ్ కు సిద్ధమవుతోంది. శుక్రవారం రాత్రి లక్నోలో జరిగే తమ రెండో మ్యాచ్ లో ఆదిత్య లక్నో సూపర్ జెయింట్స్ తో కీలక మ్యాచ్ ఆడబోతోంది. ఉప్పల్ మైదానంలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్రైజర్స్ జట్టు హైదరాబాద్ ఏకంగా 72 పరుగులు తేడాతో ఓడింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో ఈ జట్టు పూర్తిగా అభిమానులను నిరాశపరిచింది. ఆ మ్యాచ్ కు రెగ్యులర్ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ తోపాటు దక్షిణాఫ్రికాకు చెందిన మరో ఇద్దరు ప్లేయర్లు హెన్రిచ్ క్లాసిన్, మార్కో జాన్షెన్ లేకపోవడంతో సన్ రైజర్స్ ఓటమి పాలైంది.
బరిలో ఒక దిగబోతున్న కీలక ప్లేయర్లు..
శుక్రవారం జరగనున్న లక్నోతో మ్యాచ్ లో దక్షిణాఫ్రికాకు చెందిన ఈ ముగ్గురు కీలక ప్లేయర్లు బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. నెదర్లాండ్స్ తో వన్డే సిరీస్ ముగించుకొని భారత్లో ఈ ముగ్గురు ప్లేయర్లు అడుగుపెట్టారు. వీరి రాకతో అయినా సన్రైజర్స్ రాత మారుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా దక్షిణాఫ్రికా త్రయం అందుబాటులోకి రావడంతో ఈ మ్యాచ్ కు సన్ రైజెర్స్ హైదరాబాద్ జట్టులో పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. నిబంధనలు ప్రకారం తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లే ఉండాలి. మొదటి పోరులో హైదరాబాద్ జట్టు హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, ఆదిల్ రషీద్, ఫారుఖీ బరిలోకి దిగారు. అయితే శుక్రవారం నాటి మ్యాచ్ లో ఫారుఖీ, గ్లెన్ ఫిలిప్ స్థానంలో మార్క్రమ్ హార్డ్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ బరిలో దిగే అవకాశం ఉంది. మరోవైపు గత మ్యాచ్ లో సీఎస్కే చేతిలో ఓడిన లక్నో ఈ మ్యాచ్ లో గెలవాలన్న కసితో బరిలో దిగుతోంది.

చివరి స్థానంలో హైదరాబాద్ జట్టు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో ఆడిన ఒక్క మ్యాచ్ లో ఘోర పరాభవంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. తాజాగా జట్టులో మార్పులు చోటు చేసుకుంటుండడంతో ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, పంజాబ్ జట్టు రెండో స్థానంలో, కేకేఆర్ జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది.
మంచి ఫామ్ లో ఉన్న మార్క్రమ్..
హైదరాబాద్ జట్టుకు ఈ మ్యాచ్ నుంచి సారధిగా వ్యవహరించనున్న మార్క్రమ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. నెదర్లాండ్స్ తో జరిగిన సిరీస్ లో భారీగానే పరుగులు చేశాడు. దీంతో హైదరాబాద్ జట్టు ఈ సారధి పైనే భారీగా ఆశలు పెట్టుకుంది. తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగల సత్తా మార్క్రమ్ సొంతం. అటువంటి ప్లేయర్ జట్టుతో చేరడం, మరీ ముఖ్యంగా కెప్టెన్ గా వ్యవహరిస్తుండడంతో ఆ జట్టుకు కొండంత బలం చేకూరినట్టయింది.