Vivrant Sharma: ఆ 23 ఏళ్ల జమ్ము, కాశ్మీర్ యువకుడు.. క్రికెట్ వైపు వెళ్తుంటే తల్లిదండ్రులు వారించారు. “తోటి పిల్లలు చక్కగా చదువుకుంటుంటే నువ్వేంటి క్రికెట్ అంటూ వెళ్తున్నావని” వారించారు. కానీ ఇప్పుడు ఐపీఎల్ లో అతడికి పలికిన ధర చూస్తే నోరు వెళ్ళబెడతారు కావచ్చు.. కేరళ రాష్ట్రంలోని కొచ్చి నగరంలో ఐపీఎల్ 2023 ఎడిషన్ కి సంబంధించి వేలంపాట జరుగుతున్నది.. ఇందులో జమ్మూ కాశ్మీర్ కు చెందిన వివ్రాంత్ శర్మ ప్రత్యేక ఆకర్షణ నిలిచాడు.₹ 20 లక్షల బేస్ ధరతో వేలంలోకి ప్రవేశించి ఏకంగా ₹2.6 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వెళ్ళిపోయాడు.

ఏమిటి ఇతడి గొప్పతనం
వివ్రాంత్ ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్. పైగా ఓపెనర్ కూడా. 2022 విజయ్ హజారే ట్రోఫీలో అతడు వీర విహారం చేశాడు. ఉత్తరాఖండ్ జట్టుపై 124 బంతుల్లో 154 పరుగులు చేశాడు.. ఈ ఇన్నింగ్స్ అతడి కెరియర్ ను కీలక మలుపు తిప్పింది. జమ్ము కాశ్మీర్ క్రికెట్ చరిత్రలో తన తొలి నాకౌట్ బెర్త్ ను సంపాదించడంలో సహాయపడింది. అంతేకాదు టోర్నమెంట్లో అంతకుముందు, రంజి ట్రోఫీ డిపెండింగ్ ఛాంపియన్ ప్రదేశ్ పై జమ్మూ కాశ్మీర్ జట్టు తరఫున 343 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు వివ్రాంత్ 62 బంతుల్లో 69 పరుగులు చేశాడు. ఈ 50 ఓవర్ల టోర్నమెంట్లో 56.42 సగటుతో 395 పరుగులు చేసి జట్టు తరుపున రెండవ అత్యధిక స్కోరర్ గా నిలిచాడు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లోనూ..
వివ్రాంత్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లోనూ.. సత్తా చాటాడు.. రెండు అర్థ శతకాలు సాధించాడు. 145.45 స్ట్రైక్ రేట్ తో 128 పరుగులు చేశాడు.. ఇతడు ఎలాంటి బౌలర్ బౌలింగ్ నైనా ఊచ కోత కోయగలడు.. ముఖ్యంగా కవర్ డ్రైవ్ లు ఆడటంలో ఇతడికి ఇతడే సాటి. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలకమైన ఇన్నింగ్స్ ఆడి గెలిపించిన సందర్భాలు బోలెడు.. ఇతడు చేస్తున్న బ్యాటింగ్ స్టైల్ నచ్చి సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ ఏరికోరి ఇతడికి ₹2.6 కోట్ల ధర పెట్టింది. మరి ఈ 23 ఏళ్ల జమ్మూ కాశ్మీర్ సంచలనం ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టుకు ఎలా ఆడతాడో వేచి చూడాలి.