Bimbisara History: నందమూరి హీరో కళ్యాణ్ తాజాగా తీస్తున్న సినిమా ‘బింబిసారుడు’. చారిత్రక నేపథ్యమున్న ఈ మూవీని చాలా కష్టపడి కళ్యాణ్ రామ్ తెరకెక్కిస్తున్నాడు. మన దేశాన్ని పాలించిన ఒక రాజు కథను ప్రజలకు పరిచయం చేస్తున్నాడు. అసలు ఎవరీ బింబిసారుడు.. ఏ కాలంలో మన దేశాన్ని పాలించారు. ఈయన ఏం సాధించారు? ఎందుకు ఈయన చరిత్ర సినిమా కథగా మలిచారన్నది ఆసక్తి రేపుతోంది. ఈ క్రమంలోనే ‘బింబిసారుడు’ చరిత్రపై స్పెషల్ స్టోరీ
ఉత్తర భారతదేశంలో సువిశాలమైన మగధ సామ్రాజ్యాన్ని స్థాపించిన మహావీరుడు బింబిసారుడు. ఇతడు క్రీ.పూ. 558వ సంవత్సరంలో హర్యాంక వంశంలో జన్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇతడి తండ్రి భట్టియా అనే ఒక గ్రామ అధికారి కావడం విశేషం. బింబిసారుడు క్రీ.పూ. 543లో 15 సంవత్సరాల వయసులో రాజ్యాన్ని స్థాపించాడు. పరిపాలనలో ప్రక్షాళన తీసుకొచ్చాడు. మహాజనపదాలు, జనపదాలు అనే విభాగాలుగా రాజ్యాన్ని విభజించి పాలించాడు. మహాజనపదాలలో 16 రాజ్యాలు ఉండేవి. బింబిసారుడు పరిపాలనలో ప్రత్యేకత చాటాడు. అందుకే చారిత్రక పురుషుడిగా ఖ్యాతికెక్కాడు.
తన సామ్రాజ్యాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు. అవంతి, కోసల, వత్స, మగధ రాజ్యాలుగా చేసుకుని పరిపాలన సాగించాడు. దక్షిణ బిహార్ ప్రాంతమే ఒకప్పటి మగధ సామ్రాజ్యం. మగధ సామ్రాజ్యాన్ని పాలిస్తున్న బింబిసారుడు మొదట తన తండ్రిని ఓడించిన అంగ సామ్రాజ్య రాజు బ్రహ్మదత్తను ఓడించి ఆ రాజ్యానికి ఆజాతశత్రువును గవర్నర్ గా నియమిస్తాడు. అక్కడి నుంచి సామ్రాజ్య విస్తరణ జరుగుతుంది. అంగరాజ్య ఆక్రమణతో వాణిజ్య సంబంధాలు ఏర్పడ్డాయి. ఫలితంగా బింబిసారుడు తన రాజ్యాన్ని విస్తరించాలని భావించాడు.
దేశంలోని శక్తివంతమైన దేశాలపై బింబిసారుడు కన్నేస్తాడు. యుద్ధాలతో అందరిని లొంగదీసుకునేవాడు. అలా లొంగని వారిని వివాహ బంధంతో దగ్గర చేసుకునేవాడు. అలా కోసల రాజు కుమార్తె మహా కోసల సోదరి కోసల దేవిని వివాహం చేసుకుని తన రాజ్యంతో సంబంధాలు కలుపుకున్నాడు. ఇలా బింబిసారుడు రాజ్య విస్తరణకు ప్రత్యేక దృష్టి పెట్టేవాడు. ఏదైనా రాజ్యం కావాలంటే వారితో యుద్ధం చేసైనా లేదా సంధి చేసుకుని అయినా రాజ్యాన్ని తన గుప్పిట్లో పెట్టుకునేవాడు.
కోసలదేవిని వివాహం చేసుకోవడం ద్వారా కాశీని కట్నంగా పొందాడు. దీంతో సంపద పెరిగింది. దీంతో సామ్రాజ్య విస్తరణ కాంక్ష మరింత బలపడింది. దీంతో చుట్టుపక్కల రాజ్యాలను తమ వశం చేసుకునేందుకు నిర్ణయించుకున్నాడు. తరువాత వైశాలి ప్రాంతానికి చెందిన జైన రాజు చేతక కుమార్తె అయిన విచ్చాలి రాజకుమారి చెల్లనను వివాహం చేసుకున్నాడు. మూడో భార్యగా పంజాబ్ లోని మద్రా వంశానికి చెందిన క్షేమను పెళ్లి చేసుకున్నాడు. ఇలా బింబిసారుడు ఏకంగా 500 మంది భార్యలను చేసుకున్నట్లు బౌద్ధమత గ్రంథమైన మహావగ్గ తెలిపింది. జైన గ్రంథాలు అతడిని సైనిక్ అని కీర్తించాయి. సైనిక్ అంటే యుద్ధానికి సిద్ధమైన సైన్యాన్ని కలిగి ఉండటమే.
ఎన్ని రాజ్యాలు జయించినా ఇంకా రాజ్య కాంక్ష పోలేదు బింబిసారుడికి. దీంతో అవంతి రాజ్యంపై దండెత్తాలని ఆశ పడ్డాడు. అవంతి రాజధాని ఉజ్జయినిపై కన్ను వేశాడు. కానీ దాన్ని పాలించే ప్రద్యోతుడు కూడా సమర్థుడైన రాజే. దీంతో ఇద్దరి మధ్య యుద్ధం జరిగినా ఎవరు విజయం సాధించలేదు. దీంతో ప్రద్యోతుడితో స్నేహం చేశాడు. ఒకసారి ప్రద్యోతుడు జబ్బు బారిన పడితే తన ఆస్థాన వైద్యుడిని పంపించి జబ్బు నయం చేయించాడు. అలాంటి స్నేహహస్తం అందించే బింబిసారుడి ఘనత చెప్పుకోవాల్సిందే.
బింబిసారుడి కాలంలోనే గౌతమబుద్ధుడు, వర్థమాన మహావీరుడు సంచరించారని చెబుతారు. వారి కాలంలోనే బింబిసారుడి గురించి అనేక విషయాలు తెలిశాయి. అయితే కొందరేమో బింబిసారుడు బౌద్ధ మతస్తుడు అని మరికొందరు జైన మతస్తుడు అని చెబుతుంటారు. మగధ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి అజాతశత్రువు తన తండ్రి బింబిసారుడిని ఖైదీగా చేశాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. కుమారుడు ఆజాతశత్రువు తనను ఖైదీగా చేయడాన్ని జీర్ణించుకోలేని బింబిసారుడు చెరసాలలోనే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. మొత్తానికి యావత్ దేశాన్ని జయించిన బింబిసారుడు చివరకు విషం తాగి చావడం అన్నది కథ.
ఈ కథను సినిమాగా తీయాలని కళ్యాణ్ రామ్ సాహాసోపేత నిర్ణయం తీసుకున్నాడు. కథ అయితే ఇదే.. మరి దీన్ని కళ్యాణ్ రామ్ ఏ మేరకు తీశాడు.. ఎంతవరకూ సక్సెస్ సాధించాడన్నది వేచిచూడాలి.
Also Read:NTR- Koratala Siva: సెకండ్ హాఫ్ పై ఎన్టీఆర్ అసంతృప్తి..అయోమయం లో పడిన కొరటాల శివ