UIDAI: కొంతకాలంగా మనదేశంలో హోటల్స్ పెరిగిపోతున్నాయి. హోటల్స్ లో బస చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. తద్వారా హోటల్ ఆధారిత వ్యాపారాలు అంతకంతకు విస్తరిస్తున్నాయి. మల్టీ నేషనల్ కంపెనీలు కూడా హోటల్ వ్యాపారంలోకి వస్తున్నాయంటే మనదేశంలో లావాదేవీలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
హోటల్స్ లో బస చేసేవారు కచ్చితంగా తమ ప్రూఫ్స్ చూపించాల్సి ఉంటుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు హోటల్స్ లో దిగి.. తమ వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. అందువల్లే కచ్చితంగా హోటల్స్ లో బస చేసేవారు తమ ఐడి కార్డులను చూపించాల్సి ఉంటుంది..
ఐడి ప్రూఫ్ చూపించి హోటల్స్ లో బస చేయడం వరకూ బాగానే ఉన్నప్పటికీ.. కొన్ని సందర్భాలలో ఐడి ప్రూఫ్ చూపించడం అనేది ఇబ్బందికరంగా మారుతోంది. ఐడి ప్రూఫ్ లను ఇతర కార్యకలాపాలకు హోటల్ నిర్వాహకులు వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి విధానాలకు చెక్ పెట్టడానికి కేంద్రం రంగం సిద్ధం చేసింది.
వెరిఫికేషన్ పేరుతో హోటళ్లు, ఇతర ఈవెంట్ నిర్వాహకులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. ఇకపై కేంద్రం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది వెరిఫికేషన్ పేరుతో హోటల్స్ ఈవెంట్ల నిర్వాహకులు కస్టమర్ల ఆధార్ కార్డు సేకరించకుండా యుఐడిఏఐ కొత్త నిబంధనను తీసుకురానుంది. క్యూఆర్ కోడ్ స్కానింగ్ లేదా ఆధార్ యాప్ ద్వారా వెరిఫై చేసే విధంగా మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆధార్ వెరిఫికేషన్ చేసే హోటల్ నిర్వాహకులు కచ్చితంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. యూజర్ల ప్రైవసీకి, ఇతర సమాచారానికి రక్షణ తప్పనిసరిగా కల్పించడానికి అడుగులు వేసినట్టు కేంద్రం చెబుతోంది.
కేంద్రం తీసుకొచ్చిన నిబంధన ద్వారా ఓయో, ఇతర హోటల్స్ లో గదులు బుక్ చేసుకునే వారికి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. మొదట్లో ఓయో రూములలో ఉండే వారికి ఆధార్ నిబంధనలు ఉండేవి.. వెరిఫికేషన్ చిక్కులు కూడా ఉండేవి. కేంద్రం తీసుకొచ్చిన తాజా నిబంధన ద్వారా ఇకపై ఓయో రూములలో ఉండేవారు దర్జాగా వెళ్లొచ్చు.. ఆధార్ ఇబ్బంది లేకుండానే తమ ప్రైవసీ ని ఆస్వాదించవచ్చు.