Rice : హరిత విప్లవం తర్వాత కొర్రలు, అండ కొర్రలు, సామలు, అరిగెలు, ఊదలు, సజ్జలు, జొన్నలు, పచ్చ జొన్నలు పండించడం తగ్గిపోయి.. వరి, గోధుమలు సాగు చేయడం పెరిగిపోయింది. ఇక వరిలోనూ సన్నధాన్యాలు సాగు చేయడం పరిపాటిగా మారింది. సన్నధాన్యంలోనూ రకరకాల వంగడాలను శాస్త్రవేత్తలు సృష్టించడంతో దిగుబడి పెరిగింది. ఇదే సమయంలో దంపుడు, ముడి వాడకం పడిపోయింది. రైస్ మిల్లులో పట్టించడం.. పాలిష్ ఎక్కువ వేయించడం వల్ల విలువైన ఫైబర్ తౌడు, నూకల రూపంలో బయటికి పోవడం మొదలైంది. అంతంతమాత్రంగా పోషకాలు ఉన్న అన్నం తినడం పారిపాటయింది. దీనివల్ల శరీరానికి ఫైబర్ అందక.. కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే అందడంతో షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం మొదలైంది. అందువల్లే మధుమేహ రోగుల సంఖ్య పెరుగుతుంది.. ఇది అంతకంతకు పెరుగుతోందే తప్ప.. ఏమాత్రం తగ్గడం లేదు.
ఇటీవల కాలంలో ఆరోగ్య స్పృహ
ఇటీవల కాలంలో జనాలలో కాస్త ఆరోగ్య స్పృహ వచ్చింది. అందువల్లే వారు తినే తిండిలో మార్పు వచ్చింది. ఫలితంగా తెల్ల బియ్యం స్థానంలో ముడి బియ్యాన్ని వాడుతున్నారు. అవసరమైతే ధాన్యాన్ని మిల్లింగ్ చేసేటప్పుడు సింగిల్ కోటింగ్ ఉండేలా చూసుకుంటున్నారు. దీనివల్ల తవుడు బయటికి వెళ్లడం లేదు. నూకలు కూడా ఏర్పడటం లేదు. దీంతో కార్బోహైడ్రేట్లతోపాటు పీచు పదార్థం కూడా లభిస్తోందని వినియోగదారులు చెబుతున్నారు. వాస్తవానికి ఉడికించిన బియ్యాన్ని వాడినప్పుడు అందులో అధిక ఫైబర్ ఉంటుంది. ధాన్యాన్ని ఉడికించి మిల్లింగ్ చేస్తారు. ఆ ప్రక్రియలో కొన్ని రసాయనాలను ధాన్యానికి పట్టిస్తారు.. అలాంటప్పుడు ఆ వచ్చే బియ్యంలో ఎంతో కొంత రసాయన అవశేషాలు ఉంటాయి. అవి జీర్ణ వ్యవస్థకు మంచిది కాదు. ఇలాంటి బియ్యాన్ని దీర్ఘకాలం వాడటం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని వైద్యులు చెబుతున్నారు.. ధాన్యం ఉడికించే క్రమంలో ఎటువంటి రసాయనాలు కలపకుంటే.. అది ఆరోగ్యానికి మంచిదని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే ఆ బియ్యంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
ముడి బియ్యం అందువల్లే ఖరీదు
ముడి బియ్యం అనేవి ఎక్కువ ఖరీదు ఉంటాయి. సాధారణ బియ్యంతో పోలిస్తే వీటికి ధర ఎక్కువగా ఉంటుంది. ధాన్యాన్ని బాగా ఎండిన తర్వాత మిల్లింగ్ చేస్తారు. సింగిల్ కోట్ లో మాత్రమే పాలిసింగ్ చేస్తారు. అప్పుడు ఆ ధాన్యంపై పొట్టు మాత్రమే వెళుతుంది. మిగతావన్నీ అందులోనే ఉంటాయి. అయితే ధాన్యాన్ని విపరీతంగా ఎండబెట్టిన తర్వాత ఈ మిల్లింగ్ చేస్తారు. ధాన్యాన్ని అలా ఎండబెట్టకుంటే ముడి బియ్యం తీయడం సాధ్యం కాదు. ఒకవేళ ఎండబెట్టకుండా ధాన్యంతో ముడి బియ్యాన్ని కనుక సేకరించినట్టయితే.. అవి అనతి కాలంలోనే పురుగు పడతాయి. తినడానికి ఏమాత్రం ఆస్కారం ఉండదు. అందువల్లే ముడి బియ్యం మిల్లింగ్ చేస్తున్నప్పుడు.. బాగా ఎండిన ధాన్యాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. తేమ కోల్పోవడం వల్ల ఆ ధాన్యం ఎక్కువగా తూగుతుంది. అందువల్లే ధర ఎక్కువగా ఉంటుంది.
ప్రాచుర్యంలో నన్నారి బియ్యం
ఇటీవల కాలంలో నన్నారి బియ్యం కూడా ప్రాచుర్యం పొందాయి. వీటిలో కార్బోహైడ్రేట్ కంటే పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.. అందువల్లే మధుమేహ రోగులు ఈ బియ్యాన్ని ఎక్కువగా తింటున్నారు. మధుమేహ రోగులు పెరుగుతున్న నేపథ్యంలో చాలావరకు ముడి బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటున్నారు. ఇక ఇటీవల కాలంలో సన్నాల రకంలోనూ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటోంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆర్ ఎన్ ఆర్, జైశ్రీరామ్, కూనారం సాంబ వంటి రకాలలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ పరిమాణంలో ఉంటోంది. అందువల్లే మధుమేహరోలు ఈ రకాలను ఎక్కువగా తింటున్నారు. తెలంగాణ ప్రాంతంలో పై రకాలు రికార్డు స్థాయిలో పండుతున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. తెలంగాణ బ్రాండ్ పేరు మీద ఈ బియ్యాన్ని వ్యాపారులు విక్రయిస్తున్నారు. అయితే ఈసారి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ బ్రాండ్ పేరుతో ఈ బియ్యాన్ని విక్రయించడానికి ఏర్పాట్లు చేస్తోంది.