
Niimishamba Goddess : మనదేశంలో నదీ ప్రాంతాల్లో దేవాలయాలు వెలిశాయి. సంప్రదాయం ప్రకారం నదీ తీర ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించి దేవుళ్లను కొలుస్తుంటారు. నదుల దగ్గరే ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. అందుకే గంగ, గోదావరి, కృష్ణ, కావేరి లాంటి నదుల ప్రాంతాల్లో ఎన్నో చారిత్రక ఆలయాలు ఉన్న సంగతి అందరిక తెలిసిందే. నదుల తీరాల్లో ఎన్నో పేరెన్నిక గల దేవాలయాలు నిర్మించారు. ఎన్నో రాజ్యాలు ఆవిర్భవించాయి. ఈ నేపథ్యంలో కావేరి నదీ తీరాన వెలిసిన ఓ ఆలయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ జరిగిన విశేషాలు మనం ఓసారి తెలుసుకుందాం.
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సాగు, తాగు నీటికి ఆధారం కావేరి నది. ప్రజల అవసరాలు తీర్చడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. వైష్ణవులకు శ్రీరంగక్షేత్రం, శైవులకు తంజావూర్ లు ఈ నదీ తీరంలోనే ఉండటం గమనార్హం. పార్వతీ దేవి అవతారమైన నిమిషాంబ ఆలయం గురించి ఇక్కడ ప్రస్తావించుకోవాలి. కర్ణాటకలోని శ్రీరంగ పట్నానికి రెండు కిలోమీటర్ల దూరంలో గంజాం అనే ఊళ్లో నిమిషాదేవి ఆలయం ఉంది. దీని ప్రత్యేకతలు తెలిస్తే మనం ఒకసారైనా దర్శించుకోవాలని కోరుకుంటాం.

పూర్వం ముక్తకుడు అనే రుషి ఉండేవాడు. అతడు సాక్షాత్తు శివుని అంశగా చెబుతారు. ముక్తక రుషి లోకకల్యాణార్థం ఓ యాగం చేయాలని భావిస్తాడు. అయితే రాక్షసులు దాన్ని అడ్డుకోవాలని చూస్తారు. దీని వల్ల ఎక్కడ రాక్షసులకు నష్టం జరుగుతుందోనని భయంతోనే అలా అడ్డుకుంటారు. దీంతో యాగాన్ని చెడగొట్టేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తారు. రాక్షసులను అడ్డుకోవడం ఆ రుషి వల్ల కాకపోవడంతో అతడు పార్వతీ దేవిని వేడుకుంటాడు. అప్పుడు ఆమె యజ్ణగుండంలో నుంచి ఉద్భవించి రాక్షస సంహారం చేసిందని చెబుతారు.

దీంతో అక్కడ నిమిషా దేవికి ఆలయం నిర్మించారని ప్రతీతి. పూర్వం శ్రీరంగపట్నం కర్ణాటక రాజ్యానికి రాజధానిగా ఉండేదట. ఒడియార్లనే రాజులు దీన్ని రాజధానిగా చేసుకుని పాలించేవారు. 400 ఏళ్ల క్రితం కృష్ణ రాజ ఒడియార్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. అమ్మవారిని విగ్రహంతో పాటు శ్రీ చక్రాన్ని కూడా ఆరాధించడం విశేషం. అమ్మవారి ఆలయం పక్కనే శివుడినికి ఉపాలయం ఉంది. ఇక్కడ ఈశ్వరుడిని మౌక్తికేశ్వరుడిగా పిలుస్తారు. నిమిషాదేవిని గాజులు, దుస్తులు, నిమ్మకాయ దండలతో పూజిస్తారు.