
Amaravati- YCP: ఏపీ రాజధాని అంశం ఒక కొలిక్కి తీసుకువచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన ప్రభుత్వం, తమకు అనుకూలమైన తీర్పు వస్తుందని భావిస్తున్నారు. దీంతో త్వరగా తేల్చాలని ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ప్రభుత్వ తరుపు న్యాయవాది కోరారు. ఈ నెలాఖరులో తుది తీర్పు వస్తుందని ఆశాభావంతో ఉన్నట్లు చెబుతున్నారు.
విభజన అనంతరం గత టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రాజధానిని కట్టాలని నర్ణయించారు. ఇందుకు కోసం శివరామకృష్ణన్ కమిటీ వేసింది. పలు ప్రాంతాల అధ్యయనం అనంతరం అమరావతి అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటుందని తేల్చి చెప్పింది. ఆ మేరకు పనులు ప్రారంభించి సచివాలయం, అసెంబ్లీ, హై కోర్టులను తాత్కాలికంగా నిర్మించారు. వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించారు. సీఆర్డీఏను ఏర్పాటు చేసి భూములిచ్చిన వారికి నెల నెల పరిహారం అందేలా ఏర్పాట్లు చేశారు. ప్రపంచ అత్యద్భుతమైన 6 భవిష్య నగరాల జాబితాలో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి చోటు దక్కించుకోవడం విశేషం. ‘‘ 6 మోస్ట్ ఫ్యూచరిస్ట్ సిటీస్ బీయింగ్ బిల్డ్ అరౌండ్ ది వరల్డ్’’ శీర్షికతో ‘‘అర్కిటెక్చర్ డైజెస్ట్’’ అనే మ్యగజైన్ ఈ విషయాన్ని పేర్కొంది.
ఆ తరువాత ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని భ్రమరావతిగా పేర్కొంది. సీఆర్డీఏను రద్దు చేసింది. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. దీంతో అమరావతికి భూములిచ్చిన వారందరూ ఆందోళనలో మునిగిపోయారు. నాలుగేళ్ల నుంచి రాజధాని ఇక్కడే ఉండాలంటూ పోరాటం చేస్తున్నారు. హై కోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారించిన హై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రానికి రాజధాని నిర్ణయం అయిపోయిందని, సీఆర్డీఏ చట్ట ప్రకారమే నడుచుకోవాలని సూచించింది. 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేసి 3 నెలల్లో రైతులకు సౌకర్యాలతో కూడిన ప్లాట్లను అభివృద్ది చేసి ఇవ్వాలని ఆదేశించింది.

హైకోర్టు తీర్పుతో ఖంగుతున్న వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హై కోర్టు తీర్పును తప్పుపట్టిన సుప్రీం ధర్మాసనం స్టే విధించింది. ఏపీ హై కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు పరచాలని అమరావతి రైతులు కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని అధికార పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేసుల విచారణ త్వరిగతిన చేపట్టాలని ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి పలుమార్లు కోర్టును కోరుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల చివరిలో కేసు కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం వైజాగ్ లో పెట్టుబడుల కోసం గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ జరుగుతుంది. విశాఖనే రాజధానిగా పేర్కొంటున్నారు. ఒకవేళ వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే అమరావతి రైతుల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. బీడుగా మారిన భూములను వెనక్కి తీసుకొని ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. అమరావతి రైతుల కోసం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోదలచుకుందో ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు.