
Jagan- Adani: ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులు దేవుడెరుగు. మొన్నటికి మొన్న విశాఖలో జరిగిన ఏపీ గ్లోబల్ సమ్మిట్ లో రూ.13 లక్షల పెట్టుబడులు వచ్చాయని జగన్ సర్కారు ఆర్భాటంగా ప్రకటించింది. దేశ దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించారు. అయితే అవి ఎంతవరకు కార్యరూపం దాల్చుతాయో కానీ.. వైసీపీ ప్రచారానికి వాడుకుంది. సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఈ సమ్మిట్ తో విద్యార్థులు, యువత తమ నీడకు వచ్చేస్తారని భ్రమించింది. కానీ కర్ర కాల్చి వాతపెట్టినట్టు పట్టభద్రులు విలక్షణ తీర్పు ఇచ్చారు. సాక్షాత్ సమ్మిట్ కు వేదికగా నిలిచి ఉత్తరాంధ్రలో సైతం యాక్సెప్ట్ చేయలేదు. దీంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. అందుకే తన అస్మదీయ పారిశ్రామికవేత్త అదానీని తాడేపల్లి ప్యాలెస్ కు రప్పించి నాలుగు గంటల పాటు చర్చించారు.
జగన్ సర్కారుతో అదానీ గ్రూపునకు ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో వేల ఎకరాల భూములను అదానీ గ్రూపు సంస్థలు ఈజీగా కొనేస్తున్నాయి. అందుకు వైసీపీ సర్కారు సహకారమే కారణం. అయితే గ్లోబల్ సమ్మిట్ కు తన ప్రతినిధులను పంపించిన అదానీ ఇప్పుడు నేరుగా సీఎంను కలిసి నాలుగు గంటల పాటు చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన తాడేపల్లి వచ్చి.. వెళ్లిన తరువాత ఈ విషయం వెలుగులోకి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకే వచ్చారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. ఉన్నత కుటుంబాల్లో వివాహాలకు స్వయం ఆహ్వానాలు ఉండవు. అంతా ప్రతినిధుల ద్వారా తతంగాన్ని జరిపిస్తారు. అయితే ఈ లెక్కన అదానీ వచ్చి నాలుగు గంటల పాటు ఏం చర్చించారన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది.
హిండెన్ బెన్ రిపోర్టు తరువాత అదానీ గ్రూపు సంస్థల చరిత్ర మసకబారింది. అంతర్జాతీయంగా పరిస్థితి దిగజారింది. అయితే దానిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో అదానీ సీఎం జగన్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అదానీ గ్రూపులకు ఏపీ అగ్రతాంబూలం ఇస్తోంది. అడిగిందే తడవుగా భూములు కేటాయిస్తోంది. అంతా అయిపోతుందనుకుంటున్న తరుణంలో అదనంగా భూములు అప్పగిస్తోంది. విశాఖలో ఇచ్చిన 160 ఎకరాలను తాకట్టు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కష్టాల్లో నిండా మునిగి ఉండడంతో తాడేపల్లి వచ్చి జగన్ కలిసి ఏ సాయం అడిగి ఉంటారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించే మార్గం కోసం అదానీ జగన్ ను ఆశ్రయించారన్న వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే మాత్రం ఇప్పుడు కొత్తగా ఎక్కడ ఏ భూములు కేటాయిస్తారా? అన్న సెటైర్లు పడుతున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో పోర్టులు, ఇతరత్రా ప్రాజెక్టులకుగాను అదానీ గ్రూపునకు భారీగా భూ సంతర్పణ చేశారు. అందులో అదానీ సొంత అవసరాల కోసం వినియోగించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే అటువంటి అవసరాల కోసమే అదానీ జగన్ ను కలిసి ఉంటారన్న టాక్ వినిపిస్తోంది. పిల్లల పెళ్లి పిలుపు కోసం వచ్చి నాలుగు గంటల పాటు చర్చించే అవసరం అదానీకి లేదు. కానీ కష్టాలు, నష్టాల్లో ఉన్నాను గట్టెక్కించండి అని అడిగేందుకు వచ్చి ఉంటారన్న టాక్ అయితే మాత్రం సర్వత్రా వినిపిస్తోంది.