
Jagan- Yellow Media: ఏపీ సీఎం జగన్ ఇటీవల తన విమర్శల్లో ఎక్కువగా ‘దుష్ట చతుష్టయం’ అన్న పదాన్ని ప్రయోగిస్తున్నారు. చంద్రబాబు, పవన్ లతో పాటు ఎల్లో, పచ్చ మీడియాగా పిలిచే అధినేతలందర్నీ సంభోధిస్తూ ఈ పద ప్రయోగం చేస్తున్నారు. తనకు మీడియా సపోర్టు లేదంటూనే ప్రత్యేకంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5ను మాత్రమే నిందిస్తున్నారు. ఈ మూడు యాజమాన్యాలు తప్పించి మిగతావన్నీ తనకు అనుకూలమనే సంకేతాలను జగన్ ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. అందుకే ప్రభుత్వ ప్రకటనలను తన సొంత మీడియా సాక్షితో పాటు అనుకూల మీడియాకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఇటీవల ఈనాడులో స్పష్టమైన మార్పు ఒకటి కనిపిస్తోంది. ప్రభుత్వ అనుకూలవైఖరి ఒకటి బయటపడింది. ఇప్పుడిదే ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
విశాఖ కేంద్రంగా వైసీపీ సర్కారు ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని.. అందుకు సంబంధించి ఒప్పందాలు సైతం పూర్తిచేసినట్టు ప్రకటించారు. అయితే ఇందులో లోపాలను వెతికే పనిలో ఎల్లో మీడియా ఉంది. ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికన వ్యతిరేక కథనాలు వచ్చాయి. వచ్చిన పరిశ్రమలన్నీ పాతవేనని.. కనీసం ఏడాదికి కోటి రూపాయల ఆదాయం లేని సంస్థలు వందల కోట్లు ఎలా పెట్టుబడి పెడతాయంటూ కథనాలు వచ్చాయి. పులివెందులతో పొలిటికల్ లింకులు ఉన్న కంపెనీలే వచ్చాయంటూ ఎద్దేవా చేస్తూ కథనాలు రాశారు. ముఖేష్ అంబానీతో పాటు 14 మంది డైరెక్టర్స్ రాకపై రాజకీయ కోణంలో జరిగిందేనంటూ అనుమానించారు. ఎక్కడా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ లో ప్రభుత్వ అనుకూల వైఖరి కనిపించలేదు. టీవీ5 కూడా అదే వ్యతిరేకత చూపింది.
అయితే అనూహ్యంగా ఈనాడులో మాత్రం సమ్మిట్ పై అనుకూల కథనాలు నడిచాయి. ప్రభుత్వ పెద్దల నుంచి పరిశ్రమల ప్రతినిధుల కామెంట్స్ వరకూ అన్నింటినీ ప్రాధాన్యతాక్రమంలో చూపించారు. సమ్మిట్లో చేసుకున్న ఒప్పందాలు, పెట్టుబడుల సారాంశాన్ని వివరించారు. అయితే సడెన్ గా రామోజీరావు స్ట్రాటజీ మార్చడంపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల ముందు కూడా జగన్, రామోజీరావు మధ్య రాజీ కుదిరిందన్న ప్రచారం సాగింది. ఓ బంధుత్వం విషయంలో ఇద్దరు దగ్గరరయ్యారన్న టాక్ నడిచింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రామోజీ తన పంథానే కొనసాగించారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు కొనసాగాయి.

తాజాగా ఈనాడు ప్రభుత్వ అనుకూలత హాట్ టాపిక్ అయ్యింది. అయితే దీని వెనుక రామోజీ ఏదో అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నట్టు అనుమానాలున్నాయి. ప్రస్తుతానికి సమ్మిట్ ను సక్సెస్ గా చూపి.. తరువాత దీనిపై లోటుపాట్లను సీరియల్ గా ప్రచురించే అవకాశముందని.. వైసీపీప్రభుత్వ డొల్లతనాన్ని బయటపెట్టేందుకు సమ్మిట్ నే కార్నర్ చేసుకోనున్నారని జర్నలిస్టు వర్గాలు భావిస్తున్నాయి. రామోజీరావు వెనక్కి తగ్గే చాన్సే లేదని.. ఇది వ్యూహంలో భాగమేనని అనుమానిస్తున్నారు.