
SI Srinivas Couple: ఆయన ఒక ఎస్సై, ఆమె అతని భార్య. అన్యోన్యంగా సాగుతున్న సంసారం.. పిల్లలు కూడా జీవితంలో స్థిరపడ్డారు. అతడు కూడా మరికొద్ది సంవత్సరాలలో పదవీ విరమణ చేస్తాడు. ఇలాంటి సమయంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది. రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలి? పిల్లల పెళ్లిళ్లు, వారికి పుట్టబోయే పిల్లలు, జరగాల్సిన కార్యక్రమాల గురించి వారిద్దరి మధ్య చర్చకు వస్తాయి. మరి అలాంటి సంసారంలో ఆర్థిక గొడవలు చిచ్చురేపాయి.. కుటుంబ సంబంధాలు విభేదాలకు కారణమయ్యాయి. ఫలితంగా రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ పట్టణంలో ఎస్ఐ శ్రీనివాస్, అతడి భార్య ఆత్మహత్యల ఘటన చర్చనీయాంశంగా మారింది. కాసర్ల శ్రీనివాస్ జనగామ సబ్ ఇన్ స్పెక్టర్ గా గత ఎనిమిది సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. వారు ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఉంటున్నారు. శ్రీనివాస్ దంపతులు జనగామలో ఉంటున్నారు. అయితే బుధవారం రాత్రి ఇద్దరి మధ్య కుటుంబ, ఆర్థిక సంబంధిత విషయాలపై గొడవ జరిగింది. ఒకానొక దశలో శ్రీనివాస్ తన భార్యపై చేయి చేసుకున్నాడని స్థానికులు అంటున్నారు. అర్ధరాత్రి దాకా ఇద్దరూ గొడవ పడుతూనే ఉన్నారని చెబుతున్నారు. అయితే గురువారం తెల్లవారుజామున శ్రీనివాస్ భార్య స్వరూప బాత్ రూమ్ లో ఉరి వేసుకుని మరణించారు. ఉదయం నిద్ర లేచిన శ్రీనివాస్ బాత్ రూమ్ కి వెళ్లి చూశారు. భార్య విగత జీవిగా కనిపించడంతో కన్నీరు మున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న స్నేహితులు, బంధువులు శ్రీనివాస్ ఇంటికి వచ్చి పరామర్శించారు.

అనంతరం జనగామ ఏసిపి దేవేందర్ రెడ్డి, ఇంచార్జ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగబాబు శ్రీనివాస్ నివాసానికి చేరుకుని అతని భార్య మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని అతడికి చెప్పారు. అప్పటివరకు పడక గదిలో ఉన్న శ్రీనివాస్.. వెంటనే వాష్ రూమ్ కి వెళ్తున్నాను చెప్పాడు. లోపలికి వెళ్లి ఒక్కసారిగా తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్నాడు. కాల్పుల శబ్దం విని అప్పటికే శ్రీనివాస్ ఇంట్లో ఉన్న ఏసీపీ, ఇన్చార్జి సీఐ బాత్ రూమ్ కి వెళ్లి చూడగా ఎస్సై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
అయితే శ్రీనివాస్ కుటుంబానికి సంబంధించి మొన్నటి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. ఇటీవల కొంతమంది బంధువులకు శ్రీనివాస్ ఆర్థికంగా సహాయం చేశాడు. అయితే ఇది అతని భార్యకు నచ్చలేదు. దీనివల్ల శ్రీనివాస్ ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరిగిపోయాయి. దీంతో భార్యకు శ్రీనివాస్ కు గొడవలు జరుగుతున్నాయి. బుధవారం అవి తారాస్థాయికి చేరాయి. మాటా మాటా పెరగడంతో శ్రీనివాస్ అతని భార్యపై చేయి చేసుకున్నాడు. దీనిని అవమానంగా భావించిన ఆమె గురువారం ఉదయం బాత్రూంలో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య ఆత్మహత్యను జీర్ణించుకోలేని శ్రీనివాస్ సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని కన్నుమూశాడు. అయితే ఇటీవల ఓ పాఠశాలలో 10 విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. విద్యార్థులు పరీక్షలో ఫెయిల్ అయినంత మాత్రాన ఆత్మహత్య చేసుకోవద్దని వారికి ధైర్యవచనాలు చెప్పాడు. కానీ చివరికి అతడే సర్వీస్ రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకోవడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఇక ఈ భార్యాభర్తల ఆత్మహత్య కేసు పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.