Soul: పుట్టుక అబద్ధం. చావు నిజం. మనిషి జీవితం గురించి రెండు మాటల్లో చెప్పాలంటే పై వాక్యాలు అచ్చు గుద్దినట్టు సరిపోతాయి. నిజంగా మనిషి చనిపోయాక ఏమవుతుంది? సినిమాల్లో చూపించినట్టు మన శరీరం నుంచి ఆత్మ బయటకు వెళ్లిపోతుందా? అది స్వర్గ, నరకాలకు వెళ్తుందా? అసలు స్వర్గ, నరకాలనేవి ఉన్నాయా? మన ఆత్మల్ని తీసుకెళ్లడానికి యమభటులో.. లేక స్వర్గం నుంచి దేవతలో వచ్చి తీసుకెళ్తారా? ..చాలామందికి వచ్చే సందేహాలివి. మరణానంతర జీవితంపై మనిషి ఆసక్తి ఈనాటిది కాదు. ఈ అంశంపై శాస్త్రజ్ఞులు, వైద్యుల అధ్యయనాలూ కొత్తవి కావు. మృత్యువు అంచుల దాకా వెళ్లొచ్చిన కొందరు.. ఆ సమయంలో తమ ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చిందని, గాఢాంధకారం అలముకొని ఉన్న సొరంగంలాంటి దాంట్లోంచి ప్రయాణిస్తే ఎక్కడో చివర కాంతిపుంజం కనపడిందని చెప్పిన కథనాలు చాలానే వచ్చాయి. వీటిని ‘నియర్ డెత్ ఎక్స్‌పీరియెన్సెస్’ అంటారు. అలాంటి అనుభవం కలిగిన 5 వేల మందికిపైగా వ్యక్తులపై అధ్యయనం చేసిన అమెరికన్ వైద్యుడు (రేడియేషన్ ఆంకాలజిస్ట్) డాక్టర్ జెఫ్రీ లాంగ్.. మరణానంతర జీవితం కచ్చితంగా ఉందని.. అందులో ఏ మాత్రం సందేహం లేదని బల్లగుద్ది చెబుతున్నారు.
వైద్య విద్యను అభ్యసించే సమయంలో..
వైద్య విద్యను అభ్యసించే సమయంలోనే.. ఈ అంశంపై ఆసక్తి పెంచుకున్న డాక్టర్ జెఫ్రీ 1998లో ‘నియర్-డెత్ ఎక్స్‌పీరియెన్స్ రిసెర్చ్ ఫౌండేషన్’ను స్థాపించారు. కోమాలో ఉన్నవారు, క్లినికల్లీ డెడ్ అయినవారు, హృదయ స్పందనలు ఆగిపోయి.. వైద్యుల ప్రమేయంతో బతికి బట్టకట్టినవారిలో ఈ తరహా ‘నియర్ డెత్ ఎక్స్‌పీరియెన్స్’లు ఎక్కువగా ఉంటాయని ఆయన చెబుతున్నారు. ఆ సమయంలో వారందరికీ కలిగే అనుభవాలు దాదాపు ఒక్కటిగానే ఉంటాయని తన అధ్యయనంలో వెల్లడైనట్టు జెఫ్రీ చెబుతున్నారు. తాను అధ్యయనం చేసినవారిలో దాదాపు 45 % మందికి ‘ఔటాఫ్ బాడీ ఎక్స్‌పీరియెన్స్’.. అంటే శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చి తనను తాను చూసుకోవడం, చుట్టూ జరిగే వాటిని చూడగలగడం, అక్కడ ఉండే వ్యక్తుల మాటలు వినగలగడం వంటి అనుభవాలు కలిగినట్టు ఆయన వెల్లడించారు.
స్పృహ వచ్చిన తర్వాత..
స్పృహ వచ్చిన తర్వాత.. ఆ సమయంలో తాము చూసిన, విన్న విశేషాల గురించి వారు చెప్పిన మాటలన్నీ నిజమేనని అక్కడ ఉన్నవారు ధ్రువీకరించిన ఘటనలనూ ఆయన రికార్డ్ చేశారు. అలాగే.. నియర్ డెత్ ఎక్స్‌పీరియెన్స్ కలిగిన మరికొందరు చెప్పినదాని ప్రకారం ఆ సమయంలో వారు మరో లోకంలోకి వెళ్లినట్టు అనిపిస్తుందట. ఒక సొరంగం గుండా ప్రయాణించడం.. చివర్లో ఒక కాంతిపుంజం కనిపించి, గతంలో మరణించిన తమ ఆప్తులను అక్కడ కలుసుకోవడం వంటివి చాలా మంది చెప్పినట్టు జెఫ్రీ తెలిపారు. ఆ సమయంలో తమ జీవితం మొత్తం కళ్లముందు ఫ్లాష్ అయినట్టు కొంతమంది చెప్పారని ఆయన వెల్లడించారు. వర్జీనియా యూనివర్సిటీలో సైకియాట్రీ అండ్ న్యూరోబిహేవియరల్ సెన్సెస్ ప్రొఫెసర్ ఎమెరిటస్ అయిన డాక్టర్ బ్రూస్ కూడా ‘నియర్ డెత్ ఎక్స్‌పీరియెన్సెస్’ విషయంలో డాక్టర్ లాంగ్‌తో ఏకీభవిస్తున్నారు. ఆయనను ‘ఫాదర్ ఆఫ్ ద రిసెర్చ్ ఇన్ నియర్ డెత్ ఎక్స్‌పీయెన్సె్‌స’గా వ్యవహరిస్తారు. ‘‘నాకు దొరికిన ఆధారాలను బట్టి.. మనకు ఉన్నది ఈ భౌతిక శరీరం ఒక్కటే కాదు. భౌతిక శరీరం గతించాక కూడా కొనసాగేది ఏదో ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే అదేంటో మాత్రం నాకు తెలియదు’’ అని గతంలో ఓ ఇంటర్యూలో పేర్కొన్నారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: What happens to man after death is the soul real
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com