Pawan Kalyan: పవన్ యువశక్తిలో మాట్లాడిన తరువాత పొత్తులు తప్పవని సంకేతాలిచ్చారు. ‘గౌరవం’ అన్న పదాన్ని ఉపయోగించారు. గౌరవం ఉన్నచోట మాత్రమే ఉండగలమని.. అగౌరవంగా చూస్తే మాత్రం ఆలోచించే ప్రసక్తే లేదని తేల్చేశారు. అవసరమైతే ఒంటరిగా పోటీచేస్తామని కూడా ప్రకటించారు. అయితే . అది టీడీపీకి పంపిన సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో.. ట్రయాంగిల్ ఫైట్ మూలంగా 57 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. అక్కడ జనసేన గణనీయమైన ఓట్లు చీల్చడం వైసీపీ విజయానికి ప్రధాన కారణం. అందుకే 50 అసెంబ్లీ నియోజకవర్గాలకు తగ్గకుండా సీట్లు ఇవ్వాలని జన సైనికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది సహేతుకమైన డిమాండ్ అని వారు భావిస్తున్నారు. అన్ని సీట్లు కేటాయించడం కుదిరే పని కాదని తెలుగు తమ్ముళ్లు వాదిస్తున్నారు.

ప్రధానంగా కోస్తా, ఉభయగోదావరి జిల్లాల్లోని చాలా నియోజకవర్గాల్లో జనసేన ఓట్ షేర్ అధికంగా ఉంది. ప్రతీ నియోజకవర్గంలో మూడు వేల ఓట్లు తగ్గకుండా సాధించింది. చాలాచోట్ల మాత్రం 20 వేలకుపైగా ఓటు షేర్ పొందింది. ఇటువంటి నియోజకవర్గాలు 18 నుంచి 25 వరకూ ఉన్నాయి. ఇక 5 వేల నుంచి 10 వేల మధ్య ఓట్లు పొందిన నియోజకవర్గాలు 15 ఉన్నాయి. పది నుంచి 20 వేల మధ్య ఓట్లు సాధించిన నియోజకవర్గాలు 10వరకూ ఉన్నాయి. అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి మారిందని.. జనసేనతో పాటు పవన్ గ్రాఫ్ అమాంతం పెరిగిందని జన సైనికులు వాదిస్తున్నారు. నాడు జనసేన చీల్చిన ఓట్లు మూలంగా వైసీపీ సాధించిన 53 నియోజకవర్గాలను కేటాయించాల్సిందేనని పట్టుబడుతున్నారు. అందులో భాగంగానే పవన్ నోటీ నుంచి ‘గౌరవం’ అన్న కామెంట్ బయటకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

అయితే దీనిపై టీడీపీ నుంచి భిన్నవాదన వినిపిస్తోంది. జనసేనకు 20 నుంచి 30 వేల వరకూ ఓట్లు సాధించిన నియోజకవర్గాలు 18 నుంచి 25 మధ్య ఉన్నాయని..వాటిని కేటాయిస్తే రెండు పార్టీలకు ఉభయతారకంగా ఉంటుందని చెబుతున్నారు. జనసేనకు బలమైన అభ్యర్థులు లేరని.. ఏ మాత్రం తేడా కొడితే మొదటికే మోసం వస్తుందని చెబుతున్నారు. అందుకే 25లోపు అసెంబ్లీ స్థానాలను సర్దుబాటు చేసుకుంటే ఇరు పార్టీలకు బాగుంటుందని సూచిస్తున్నారు.అయితే చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం పొత్తు కుదిరిపోయిందని.. 22 నుంచి 28 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు లోక్ సభ స్థానాలంటూ ప్రచారం మొదలు పెట్టింది. ఎల్లో మీడియాతో పాటు టీడీపీ సోషల్ మీడియా విభాగం కూడా ఇదే రకంగా ప్రచారం చేస్తోంది.
అయితే వచ్చే ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యం దక్కాలంటే వీలైనన్ని ఎక్కువ స్థానాలను పొత్తులో తీసుకోవాలని పవన్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. కనీసం 50 స్థానాలకు పోటీచేస్తే పొత్తులో 40 స్థానాలు దక్కే చాన్స్ ఉంటుందని.. 135 స్థానాలు టీడీపీ, వైసీపీ చెరి సగం పంచుకున్నా… అప్పుడు జనసేనది యాక్టివ్ రోల్ గా మారే అవకాశం ఉందని పవన్ భాస్తున్నారుట. రాజకీయంగా పొత్తు అనివార్యంగా మారిందని.. కానీ చంద్రబాబుకు ఎట్టి పరిస్థితుల్లో చాన్స్ ఇవ్వకూడదని కొందరు నేతలు పవన్ కు సూచించారుట. అందుకే పవన్ ముందస్తుగానే ‘గౌరవం’ ఉంటేనే పొత్తులుంటాయని అర్ధం వచ్చేలా మాట్లాడారు. ఆ 57 స్థానాల విషయాన్ని లెక్క కట్టి మరీ గుర్తుచేసినట్టుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.