Konda Surekha: ఎన్నికల ఏడాదిలోనూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్‌పై నుంచి కోలుకోవడం లేదు. అంతర్గత కుమ్ములాటలు, అనైక్యత ఆ పార్టీని మరింత దిగజారుస్తున్నాయి. ఈ తరుణంలో హస్తం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వలస వాదులు, అసలైన కాంగ్రెస్ వాదుల పేరుతో పార్టీని చీల్చే ప్రయత్నం జరుగుతున్న తరుణంలో సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ పీసీసీ చీఫ్‌కు కొండంత అండగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాల గురించి, అలాగే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీ, వైస్సార్‌టీపీ, బీఎస్పీ వంటి పార్టీల పరిస్థితి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పేదల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, పెద్దల గురించి ఆలోచించే పార్టీలు బీఆర్‌ఎస్, బీజేపీ అని అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డికి మద్దతుగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

సొంత ప్రయోజనాల కోసమే షర్మిల పార్టీ..
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అనేది వైఎస్.షర్మిల తన సొంత ప్రయోజనాల కోసం పెట్టిన పార్టీ అని కొండ సురేఖ విమర్శించారు. తన అన్నను కాదని తెలంగాణ కోడలు అని ఇప్పుడు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. షర్మిల పార్టీ వెనుక స్వార్థం తప్ప ప్రజలకు మేలు చేసే ఉద్దేశం ఉండదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు చీల్చడం కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ వచ్చిందని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ని చీల్చడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని కొండ సురేఖ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఉత్తమ్ కుమార్.. ‘ఉత్త’ కుమారే
పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారని కొండా సురేఖ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అభిప్రాయ బేధాలపైన మాట్లాడిన సురేఖ బీఆర్‌ఎస్‌ని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ నేతలు అందరూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్నారు. కాంగ్రెస్ నేతలంతా ఒకే మాట, ఒకే బాట అన్నట్టుగా ముందుకు సాగితే మంచి ఫలితం ఉంటుందన్నారు.
పదవుల కోసం పార్టీకి నష్టం చెయొద్దు..
చిన్న చిన్న పదవుల కోసం పార్టీకి నష్టం కలిగించవద్దని కొండా సురేఖ కోరారు. సీనియర్లకు రేవంత్ వర్గానికి మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు వర్గాలు గౌరవంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. పీసీసీ పీఠంలో ఎవరున్నారు? ఏ పార్టీ నుంచి వచ్చారు? అన్నది చూడవద్దని పేర్కొన్నారు. అందరూ కలిసి కట్టుగా పనిచేస్తే పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ నేతలు వెళ్లి బీజేపీలో చేరారని, కానీ నాకు ఆ ఉద్దేశం లేదని సురేఖ స్పష్టం చేశారు. పార్టీ మారాలని భావిస్తే చెప్పే వెళ్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్‌గా పనిచేయాలని, ఎవరితో పొత్తులు పెట్టుకున్నా విభేదాలు బయటకు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌తో, కేంద్రంలోని బీజేపీతో కలిసి నడిచే పరిస్థితి ఉండబోదని వరంగల్ డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారని సురేఖ గుర్తు చేశారు. కర్ణాటక తరహాలో తెలంగాణ నేతలందరూ కలిసి పాదయాత్ర చేయాలని, బీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు.

ఉత్తమ్ ఏం సందేశం ఇస్తున్నారు?
అధిష్టానం పిలిచినా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బోయినపల్లి సమావేశానికి వెళ్లకపోవడం ఏమిటని ప్రశ్నించిన కొండ సురేఖ, ఆయన పార్టీ నేతలకు ఏం మెసేజ్ ఇస్తున్నారో ఆలోచించాలన్నారు. రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేస్తే ఆయన కోసం కాదు పార్టీ కోసమేనని, అందరూ కలిసి రావాలని కొండా సురేఖ పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌పై బీజేపీ పోరాటం చేస్తే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం, గ్రానైట్ కుంభకోణం విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
మొత్తంగా చూస్తే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రేవంత్‌రెడ్డికి తన పూర్తి మద్దతు ప్రకటించినట్లుగా కనిపిస్తుంది. ఎన్నికల నాటికి పార్టీ బలపడుతుందన్న ధీమా ఆమెలో కనిపిస్తోంది. కొండా సురేఖ చెప్పినట్లుల మరి కాంగ్రెస్ కోలుకుంటుందో.. మరింత చతికిల పడుతుందో వేచి చూడాలి.