YS Sharmila: తెలంగాణ కోడల్ని.. నేను ఎవరూ వదిలిన బాణాన్ని కాదు.. అంటూ తెలంగాణలో పార్టీ పెట్టారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కూతురు షర్మిల. పార్టీ కోసం 3 వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేశారు. తర్వాత చేసుకున్న కీలక పరిణామాలతో కాస్త సైలెంట్ అయ్యారు షర్మిల. తాజాగా అమెరికా వెళ్లిన ఆమె తెలంగాణలో రాజకీయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ ప్రజల మేలు కోసం పోరాడాలి అని నాన్న తన గుండెలపై విల్లు రాశారు’ అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అమెరికాలో వ్యాఖ్యానించారు. ఆమెరికా పర్యటనలో ఉన్న ఆమె కాపెల్‌లోని ఓ హోటల్‌లో పార్టీ సానుభూతిపరులతో సమావేశమయ్యారు. ‘తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారు’ అని నాన్న నాకు చెప్పినట్లు అనిపించిందని.. ‘తెలంగాణ ప్రజలను సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని నాన్న చెప్పారని అన్నారు. తనును ప్రేమించిన ప్రజలు.. నేను ప్రేమించిన ప్రజలు అని నాన్న చెప్పాడని.. అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టానన్నారు. వైఎస్సార్ పార్టీ జెండాలో వైఎస్సార్ ఉన్నాడు.. అజెండాలో వైఎస్సార్ సంక్షేమం ఉందని.. మళ్లీ రాజన్న పాలన తీసుకొస్తామని తెలిపారు. ‘ఇవ్వాళ వైఎస్సార్ బతికి ఉన్నా.. తెలంగాణ ముఖ్యమా..? ఆంధ్రా ముఖ్యమా అంటే సమాధానం చెప్పలేకపోయేవారని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్‌ను అమితంగా ప్రేమించిన తెలంగాణ ఈరోజు ఎలా ఉందో అందరూ గమనించాలన్నారు.

ఉద్యమకారుడని నమ్మితే..
ఉద్యమ కారుడు కదా అని తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారని విమర్శలు గుప్పించారు. ఎనిమిదిన్నర ఏళ్ల కేసీఆర్ పాలనలో 8 వేల మంది రైతులు, వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ ప్రారంభించిన ఒక్క పథకం తెలంగాణలో అమలు కావడం లేదన్నారు. వైఎస్సార్ ఐదేళ్లే సీఎంగా ఉన్నా ప్రజల గుండెల్లో ఉండిపోయేలా పాలన చేశారని తెలిపారు.

పాదయాత్రకు అనుమతి..
షర్మిల పాదయాత్రను నర్సంపేట వద్ద బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకున్న తర్వాత కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. అయితే తర్వాత వ్యక్తిగత పర్యటన, పండుగల కారణంగా అమెరికా వెళ్లారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తారు. అమెరికా తెలుగు వారు ఎక్కువగా ఉండే డాల్లాస్ దగ్గర కాపెల్ సిటీలోని ఓ హోటల్‌లో షర్మిల సన్నిహితులు సమావేశం ఏర్పాటు చేశారు. ఉచిత భోజనం, పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేసి.. కుటుంబంతో కలి సి రావాలని పెద్ద ఎత్తున ఆహ్వానాలు పంపారు. అయితే చాలా పరిమిత సంఖ్యలోనే హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులు కూడా హాజరు కాలేదు.