
Hanuman Jayanti 2023: కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవుడెవరంటే హనుమంతుడు అని అంటారు. శ్రీరాముడి జన్మించిన భూమి అయినందున ఆంజనేయుడు భూమ్మీద ఇప్పటికీ తిరుగుతున్నాడని భక్తుల నమ్మకం. విదేయడై, విశ్వాసపాత్రుడై, నమ్మిన బంటుగా ఉండే ఆంజనేయుడు సూర్య కుమారుడని పురాణాలను భట్టి తెలుస్తోంది. అయితే హనుమంతుడి జయంతిని రెండుసార్లు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో చైత్ర మాసంలో శుద్ధ పౌర్ణమి రోజు, మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ దశమినాడు నిర్వహిస్తున్నారు. కేరళలో మాత్రం మార్గశిర మాసంలో వేడుకలు నిర్వహిస్తారు.
అయితే కొందరు పండితులు చెబుతున్న ప్రకారం ఆంజనేయుడు లంకలో విజయం సాధించిన చైత్రమాసంలో శుద్ధపౌర్ణమి రోజును చిన్న జయంతిగా నిర్వహిస్తున్నారని, కానీ ఆంజనేయుడు వైశాఖ మాసంలో జన్మించినట్లు పేర్కొంటున్నారు. జయంతి ఏరోజైనైనా హనుమంతుడిని పూజిస్తే వాత రోగాలు దూరమవుతాయని పండితులు చెబుతున్నారు. అయితే హనుమాన్ జయంతి రోజు ఏం చేయాలి? భగవంతుడిని ఎలా ప్రార్థించాలి? అన్న విషయాలు తెలుసుకుందాం..
భక్తితో ఎవరైతే తనను పిలుస్తారో.. వారి పక్కనే ఆంజనేయుడు ఉంటారని భక్తులు అంటారు. స్వచ్ఛమైన భక్తితో దేవుడిని పూజిస్తే భయాలు తొలిగిపోతాయి. ఆంజనేయుడు చిరంజీవిగా దీవించబడ్డాడు. అందువల్ల ఆయనకు ఎల్లప్పుడూ భూమిపైనే ఏదో ఒక రూపంలో భక్తులకు దర్శనమిస్తుంటారని చెబుతారు. శని ప్రభావం ఉండేవారు మారుతిని కొలిస్తే కాస్త ఉపశమనం కలుగుతుందట. ఆయన ఆశీర్వాదం పొందితే దరిద్రాలు తొలిగిపోతాయి. రాముని కష్టాలు తీర్చడంలో తోడ్పిడిన ఆంజనేయుడు లక్ష్మిణుడికి సంజీవిని తెచ్చి ప్రాణాలను కాపాడాడు. సీతమ్మకు, రామునికి వారధిగా మారాడు. నిద్రపోయే ముందు ఆంజనేయుడిని స్మరించుకుంటే కష్టాలన్నీ తొలిగిపోతాయని భక్తుల నమ్మకం.

ఆంజనేయుడిని ప్రసన్నం చేసుకోవాలంటే హనుమాన్ జయంతి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. అంతకుముందు సూర్యోదయాన స్నానమాచరించాలి. ఆరోజు హనుమాన్ టెంపుల్ కు వెళ్లి నుదుట సింధూరం పెట్టుకోవాలి. ఆ తరువాత భగవంతుడిని ప్రార్థించిన దినచర్యను ప్రారంభించాలి. ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల దేవుడి ఆశీర్వాదం ఉంటుందని అంటారు. అలాగే నేలపైనే నిద్రించాలి. ఖాళీ సమయంలో హనుమాన్ చాలీసా, భజరంగీ మంత్రాలను పఠించాలి.
ఈసారి హనుమాన్ జయంతి ఏప్రిల్ 6న వచ్చిందని అంటున్నారు. ఈరోజున హనుమాన్ ను భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఆయన ఆశీర్వాదం లభిస్తుందని అంటున్నారు. భూత, ప్రేత పిశాచి భయాలతో ఉన్నవారు వీలైతే హనుమాన్ దేవాలయాల్లోనే నిద్రించేలా ప్రయత్నించాలి. ప్రతీ గ్రామంలో హనుమాన్ దేవాలయం తప్పక ఉంటుంది. ఊరిని కాపాడే దేవుళ్లలో హనుమాన్ కూడా ఉంటారు. అందువల్ల ఆయనను స్మరిస్తూ జీవితాన్ని కష్టాల నుంచి విముక్తి కలిగించుకోవాలి.