
Bandi Sanjay: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఊహించని విధంగా బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి, కోర్టు ముందు హాజరు పరిచి జైలుకు తరలించారు పోలీసులు. దీంతో బీజేపీకి పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు, పార్టీ రథసారథి లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. గురువారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఆ పార్టీ కీలక నాయకులు ఏ విధంగా స్పందిస్తారు? ముందు ముందు ఎలాంటి కార్యాచరణకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
దేశంలో అతిపెద్ద పార్టీ..
దేశంలో అధికార పార్టీగా ఉన్న బీజేపీ 1980, ఏప్రిల్ 6న ఏర్పాటయింది. నాడు భారతీయ జనతా పార్టీని అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్‌కృష్ణ అద్వానీ ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం దేశంలో అతిపెద్దపార్టీగా అవతరించింది. కేంద్రంలో అధికారంలో కొనసాగుతుంది. వచ్చే లోకసభ ఎన్నికలకు ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
తెలంగాణలో కూడా అధికారం కోసం..
ఈసారి తెలంగాణ రాష్ట్రంలో పట్టు సాధించాలని, కాషాయ జెండాని ఎగరవేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇక కేంద్రంలో బీజేపీతో తలపడుతున్న బీఆర్‌ఎస్ బీజేపీనీ అడుగడుగునా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ పాత్ర ఉందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. ప్రస్తుతం బండి సంజయ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కరీంనగర్ జిల్లా కారాగారంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు రిమాండ్ ఖైదీ నెంబర్ 7917 ను కేటాయించారు. ఇతర ఖైదీలతో పాటు ఆయనకు సాధారణ బ్యారక్‌ను కేటాయించారు.
కుటుంబ సభ్యులను కలవనీయని పోలీసులు..
బండి సంజయ్ ను కలవడానికి కరీంనగర్ జిల్లా కారాగారం వద్ద ఆయన సతీమణి అపర్ణతోపాటు కుమారులు భగీరథ్, సుముఖ్ నిరీక్షించినప్పటికీ బండి సంజయ్ వాహనాన్ని నేరుగా జైల్లోకి తీసుకువెళ్లడంతో బండి సంజయ్ కుటుంబ సభ్యులు ఆయనను కలవలేకపోయారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించి, పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహాన్ని నింపి, భవిష్యత్తు ఎన్నికలకు దిశా నిర్దేశం చేయవలసిన తెలంగాణ పార్టీ రథసారథి బండి సంజయ్ జైలు పాలు కావడంతో తెలంగాణ బీజేపీ ఆత్మరక్షణలో పడింది. క్యాడర్‌లో కొంత నైరాశ్యం నెలకొంది.

జైలు కొత్తకాదు..
అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అంటున్నారు. దీంతో తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉంది అన్న కేసీఆర్ నోటి నుంచి ప్రతీ ప్రెస్‌మీట్‌లో బీజేపీ గురించి మాట్లాడే స్థాయికి పార్టీని తీసుకొచ్చారు సంజయ్. గ్రేటర్ హైదరాబాద్‌లో 49 కార్పొరేటర్ సీట్లు సాధించారు. హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించారు. మునుగోడులో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. మరోవైపు అధికార పార్టీ వైఫల్యాలను, కల్వకుంట్ల కుటుంబాన్ని నేరుగా టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో బండికి పగ్గాలు వేయడానికి బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో గతేడాది 317 జీవో పై దీక్ష చేసిన సంజయ్‌ని జైలుకు పంపింది. పాదయాత్రలో పలుమార్లు అరెస్ట్ చేసింది. తాజాగా లీకేజీ అంటూ బీజేపీని డ్యామేజీ చేయాలని యత్నించింది.
అయితే అరెస్ట్ చేసిన ప్రతీసారి బీజేపీకి హైప్ వస్తోంది. బలం మరింత పెరుగుతోంది. అయితే పార్టీ ఆవిర్భావం వేల అధ్యక్షుడు జైల్లో ఉండం క్యాడర్‌నుని నిరాశపర్చింది. ఈ ఆత్మరక్షణ భావన నుంచి∙బయటపడి ఆత్మవిశ్వాసంతో బీజేపీ భవిష్యత్తు ఎన్నికలకు వెళ్తుందా? లేదా అనేది భవిష్యత్తులో తేలనుంది.