Dwaram Mangathayaru: మరో తెలుగు సంగీత శిఖరం నేలకొరిగింది. ద్వారం మంగతాయారు సంగీత ప్రియులను నిరాశలో ముంచి దివికేగారు. సుదీర్ఘకాలం తన సంగీతంతో ముగ్దుల్ని చేసిన మంగతాయారు ఇక లేరన్న వార్త కలచివేస్తుంది. వయొలిన్ విద్వాంసురాలు అయిన మంగతాయారు సంగీత శిఖామణిగా పేరుగాంచారు. కొన్నాళ్లుగా ద్వారం మంగతాయారు వయో సంబంధింత సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. 94 ఏళ్ల మంగతాయారు ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సమాచారం. దీంతో మంగతాయారు బుధవారం మధ్యాహ్నం చెన్నైలో గల నివాసంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

మంగతాయారు అచ్చతెలుగు తెలుగింటి ఆడపడుచు. వీరిది విజయనగరం. మంగతాయారు బాల్యం అంతా విజయనగరంలో సాగింది. లెజెండరీ వయొలిన్ విద్వాంసుడ ద్వారం వెంకటస్వామినాయుడి పెద్ద కుమార్తెనే మంగతాయారు.భారత ప్రభుత్వం చేత వెంకటస్వామి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న మంగతాయారు వయొలిన్ విధ్వాంసురాలిగా ఎదిగారు. తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు.
వయోలిన్ విధ్వాంసులుగా పేరు తెచ్చుకున్న మంగతాయారు కుటుంబం మరింత మెరుగయ్యేందుకు, ఎక్కువ మందికి తమ ప్రతిభ చాటేందుకు చెన్నై వెళ్లి స్థిరపడ్డారు. ఆ రోజుల్లో చెన్నై మ్యూజిక్ ఇండస్ట్రీకి హబ్ గా ఉండేది. ఇప్పటికి కూడా మ్యూజిక్ స్టూడియోలకు చెన్నై పెట్టింది పేరు.

మంగతాయారు ఆకాశవాణి సంస్థలో పలు సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.అలాగే మ్యూజిక్ కాలేజీలో మంగతాయారు వయొలిన్ టీచర్ గా పనిచేశారు. అంతర్జాతీయంగా అనేక దేశాల్లో సంగీత కచేరీలు ఇచ్చారు. క్లాసిక్ మ్యూజిక్ తో సంగీత ప్రియులను దశాబ్దాల పాటు అలరించారు.జీవితాన్ని సంగీతానికి అంకితం చేసిన మంగతాయారు పెళ్లి చేసుకోకపోవడం మరో అరుదైన విషయం. మంగతాయారు మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటుగా అభివర్ణిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు కోరుకుంటున్నారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.