Vegetable Price Hike : మార్కెట్లో టమాటా మంట రగులుతోంది. ధర అమాంతం పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో అందనంత దూరానికి ఎగబాకుతోంది. దేశ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులే టమాటా ధర పెరుగుదలకు కారణం. దక్షిణాధి రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు, ఉత్తరాధి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కూడా ధర పెరుగుదలకు ఒక కారణం. వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా టమాటా ఉత్పత్తులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. భారీ వర్షాలతో రవాణా వ్యవస్థ స్తంభించడం కూడా మరో కారణం.
ప్రస్తుతం టమాటా ధర రూ.80 నుంచి రూ.100 పలుకుతోంది. పచ్చిమిర్చి కిలో ధర బుధవారం నాటికి రూ.120గా ఉంది. దక్షిణ భారతదేశానికి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో సకాలంలో వర్షాలు పడలేదు. ఇది పంటపై ప్రతికూలత చూపింది. అధిక ఉష్ణోగ్రతలతో పంట ఆశాజనకంగా లేదు. టమాటా మార్కెట్ కు మదనపల్లె పెట్టింది పేరు. కానీ ప్రతిరోజూ మార్కెట్ కు అరకొరగానే టమాటాలు వస్తున్నాయి.వ్యాపారుల మధ్య విపరీతమైన పోటీ పెరుగుతోంది. దీంతో ధరపై ప్రభావం చూపుతోంది. రాయలసీమలోని అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో టమాటా ఉత్పత్తుతు తగ్గుముఖం పట్టాయి.
అటు ఉత్తరాధి రాష్ట్రాల నుంచి రావాల్సిన పంట కూడా నిలిచిపోయింది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పంట పూర్తిగా నాశనమైంది. మిగతా పంట విక్రయించేందుకు అవకాశం ఉన్నా రవాణా వ్యవస్థ స్థంభించడంతో ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఇది కూడా టమాటా, పచ్చిమిర్చి ధర పెరగడానికి ఒక కారణంగా తెలుస్తోంది. సాధారణంగా ఈ సమయానికి వర్షాలు సమృద్ధిగా పడి టమాటా ఉత్పత్తులు గణనీయంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టమాటా అంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.