
Vangaveeti Radhakrishna: వంగవీటి మోహన్ రంగా ఈ పేరులోనే ఒక వైబ్రేషన్. ఆయన భౌతికంగా దూరమై మూడు దశాబ్దాలు దాటుతున్నా క్రేజ్ తగ్గలేదు. వేలాది విగ్రహాల రూపంలో ఇప్పటికీ ఆయన ఆరాధ్య దైవంగా కొలుస్తున్నవారూ ఉన్నారు. కాపు నేతగా అందరూ భావిస్తున్నా అణగారిన వర్గాలకు అండగా నిలిచిన మహోన్నత వ్యక్తిత్వం మోహన్ రంగా సొంతం. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆయన కుమారుడు రాధాకృష్ణ. కానీ రాజకీయ తప్పటడుగులతో ఇంకా కుదురుకోలేదు. అత్యున్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్న అభిమానులు, అనుచరుల అంచనాలకు అందుకోవడం లేదు. అయితే వంగవీటి మోహన్ రంగా కుమారుడిగా రాధాక్రిష్ణకు సైతం అదే ఆదరణ ఉంది.
2004లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రాధాక్రిష్ణ. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు. గట్టి వాయిస్ వినిపించారు. 2009లో ప్రజారాజ్యం ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. రెండోసారి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. వైసీపీ ఆవిర్భావం తరువాత జగన్ వెంట చేరారు. 2014 ఎన్నికల్లో పోటీచేశారు. కానీ ఓటమే ఎదురైంది. 2019 ఎన్నికలకు ముందు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ ఇవ్వడానికి జగన్ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో మనస్తాపానికి గురైన రాధాక్రిష్ణ అనూహ్యంగా టీడీపీ గూటికి వచ్చారు. కానీ ఇక్కడ కూడా పోటీచేసే చాన్స్ దక్కలేదు. స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేశారు. కానీ టీడీపీకి ఓటమి తప్పలేదు. ప్రస్తుతానికైతే టీడీపీలో ఉన్నా ఏమంత యాక్టివ్ గా లేరు. జనసేనలో చేరతారని ప్రచారం సాగింది. కానీ అనూహ్యంగా ఆయన లోకేష్ యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. వారంలో రెండురోజుల పాటు లోకేష్ తో కలిసి నడుస్తానని ప్రకటించారు. దీంతో తాను జనసేనలోకి వెళ్లడం లేదని.. టీడీపీలో కొనసాగుతున్నట్టు సంకేతాలిచ్చారు.

అయితే రాధాక్రిష్ణ మనసు మార్చుకోవడం వెనుక చాలా పెద్ద కథ జరిగినట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే జనసేనపై కాపు కుల ప్రభావం ఉంది. కుల పార్టీగా అధికార వైసీపీ ప్రచారం చేస్తోంది. వాస్తవానికి జనసేనకు వెనుకబడిన తరగతుల వారే ఎక్కువగా అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కాపు ముద్ర వేసి వెనుకబడిన తరగతుల వారిని దూరం చేయాలన్నది వైసీపీ ఎత్తుగడ. కాపులుగా పిలవబడే కాపు, తెలగ, ఒంటరి, బలిజ, శెట్టిబలిజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోంది. కేవలం జనసేన కాపులకు కేంద్రంగా మారిందని విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో కానీ బలమైన నేపథ్యం ఉన్న వంగవీటి రాధాక్రిష్ణ వస్తే ఈ విమర్శలు మరింత పెరిగే చాన్స్ ఉందని భావించి పవనే రాధాను జనసేనలోకి రాకుండా అడ్డుకున్నారన్న ప్రచారం అయితే మాత్రం ఒకటి ఉంది.
అలాగే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి నడవాలని డిసైడ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కమ్మ, కాపుల మధ్య సమన్వయం అవసరం. ఇప్పటికే ఈ రెండు సామాజికవర్గాల మధ్య చిచ్చుపెట్టడం ద్వారా కూటమి ఓట్ల బదలాయింపు జరగకూడదని వైసీపీ భావిస్తోంది. అందుకే వంగవీటి రాధాక్రిష్ణ టీడీపీని వీడి జనసేనలో చేరితే ఆ రెండు సామాజికవర్గాల మధ్య గ్యాప్ వస్తుంది. ప్రధానంగా విజయవాడ రాజకీయాలు శరవేగంగా మారిపోతాయి. అందుకే రాధాక్రిష్ణ టీడీపీలోనే కొనసాగుతూనే రెండు పార్టీల మధ్య సమన్వయ కర్తగా వ్యవహరించే చాన్స్ ఉన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ కారణం చేతనే పవన్ జనసేనలోకి రాధాక్రిష్ణ రాకుండా అడ్డుకట్ట వేశారని టాక్ నడుస్తోంది.